ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. రూ.40కోట్ల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేత కేసులో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు రేఖానాయక్ ను విచారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం (నవంబర్20)సోదాలు నిర్వహించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎగవేత కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు చెందిన సత్తెనపల్లిలోని ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సుమారు రూ.40 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం ఎగవేత జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ క్రమంలో రేఖా నాయక్‌ను విచారించిన ఈడీ అధికారులు ..ఎగవేసిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించారు? ధాన్యం విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము ఎక్కడికి చేరింది? అనే కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ ఎగవేత వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.
