మునిగిన లంక తేలేదెన్నడు

మునిగిన లంక తేలేదెన్నడు

ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది.. దేశం అతలాకుతలమైంది... వ్యవసాయం కుదేలైంది.. పర్యాటకం పడిపోయింది.. ఇంధనం అందడం లేదు.. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి.. ఇదీ శ్రీలంక దుస్థితి! సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తున్నది. దేశంలో రాజకీయం కాస్త గాడిలో పడినా.. జనజీవనం కుదుటపడలేదు. కొత్త అప్పు పుట్టక, ఇప్పటికే తెచ్చిన అప్పులను చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నది.

భారీగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం

పెట్టుబడులు పెరుగుతాయని, వస్తువుల డిమాండ్ పెరుగుతుందని శ్రీలంక పన్ను రేట్లు తగ్గించింది. కానీ అలా జరగకపోగా, ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చులు తగ్గలేదు. బ్యాంకులు నోట్లను ముద్రిస్తూనే వచ్చాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పగ్గాల్లేకుండా పెరిగిపోయింది. జూన్‌‌లో 54.6% ఉన్న ఇన్‌‌ఫ్లేషన్.. జులై నాటికి 60.8 %కి పెరిగింది. జూన్‌‌లో 80.1% ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జులైలో 90.9కి పెరిగింది. ఇన్‌‌ఫ్లేషన్ 75 % కి పెరగవచ్చని లంక సెంట్రల్ బ్యాంకు అంచనా వేసింది. అదే జరిగితే సామాన్యులు నిత్యావసరాలు కొనలేని స్థితి. దేశం ఇంకా క్లిష్టమైన పరిస్థితికి చేరే ప్రమాదం ఉంది.

ప్రయోగానికి వ్యవసాయం బలి

ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతో రాజపక్స ప్రభుత్వం ప్రయోగం చేసింది. దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైంది. సింథటిక్ ఎరువులు, పురుగుమందులపై నిషేధం విధించడంతో దిగుబడులు భారీగా పడిపోయాయి. బియ్యం ఉత్పత్తి మూడో వంతుకు పడిపోయింది. టీ ఉత్పత్తి 16% పడిపోయింది. రైతులు నిండా మునిగాక సర్కారు యూటర్న్ తీసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ఎగుమతులు పడిపోవడంతో విదేశీ మారకపు నిల్వలు కూడా తగ్గాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడి, మళ్లీ వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించడానికి కొన్నేండ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోలుకోని టూరిజం 

శ్రీలంకకు టూరిజం నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుంది. కానీ 2019 ఏప్రిల్‌‌లో జరిగిన ఈస్టర్ బాంబు పేలుళ్లు.. టూరిజంపై పెను ప్రభావం చూపాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా మహమ్మారితో పర్యాటకం పూర్తిగా కళతప్పింది. రెండేండ్లుగా పర్యాటకులు రాక ఆదాయం పడిపోయింది. లంకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు అంటున్నారు. టూరిజం వృద్ధి చెందడం అంత సులువు కాదని చెబుతున్నారు. అదీకాక ఇండోనేషియా, థాయ్‌‌లాండ్ వంటి దేశాల నుంచి పోటీ ఎక్కువగా ఉండటం, ఆయా దేశాల్లో తక్కువ రేట్లకే మెరుగైన సౌలత్​లు అందుతున్నాయి. మరోవైపు కరోనా తదితర కారణాల వల్ల విదేశాల్లో స్థిరపడిన లంక పౌరులు స్వదేశానికి డబ్బు పంపడం కూడా భారీగా తగ్గింది.

నిత్యావసరాల కొరత తీరలే

2.2 కోట్ల జనాభా ఉన్న లంకలో నిత్యావసరాల కొరత వేధిస్తోంది. డాలర్లు లేక పెట్రోలు, డీజిల్, మందులు మొదలైనవి తీసుకురాలేని పరిస్థితి. ఈ షార్టేజీతో ఫ్యుయల్ స్టేషన్లలో రేషన్ మాదిరిగా క్యూఆర్ కోడ్ సిస్టమ్‌‌ను లంక సర్కారు ప్రవేశపెట్టింది. క్యూఆర్ కోడ్ ద్వారానే ఇంధనం సరఫరా చేస్తున్నది. బియ్యం రేటు 160%, గోధుమ పిండి ధర 200 %, చక్కర రేటు 160% పెరిగాయి. ఇక వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా ఉన్నాయి. అయినా సరే సిలిండర్లు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. శ్రీలంక ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్‌‌కమ్ నెలకు 1.3 బిలియన్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ డబ్బును ఉపయోగించే సమయంలో ఆహారం, ఇంధనం, మందుల దిగుమతికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్పుల కుప్పలు.. తీర్చేందుకు తిప్పలు

శ్రీలంక తొలిసారి అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటున్నది. దాదాపు 51 బిలియన్​ డాలర్లు (సుమారుగా రూ.4 లక్షల కోట్లు) బాకీ పడింది. ఈ అప్పు చెల్లించడం సంగతి దేవుడెరుగు. వడ్డీ చెల్లించేందుకూ ఇబ్బంది పడుతున్నది. మొత్తం అప్పుల్లో ఆసియన్ డెవలప్‌‌మెంట్ బ్యాంకు అప్పులు 16 %, జపాన్, చైనా, ప్రపంచ బ్యాంక్ అప్పులు 10 % ఉన్నాయి. మరోవైపు స్థిరమైన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టే వరకు శ్రీలంకకు కొత్తగా ఆర్థిక సాయం చేయబోమని వరల్డ్‌‌ బ్యాంక్ తేల్చిచెప్పింది. దీంతో ఆశలన్నీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) బెయిలవుట్‌‌ పైనే పెట్టుకుంది. సంక్షోభం నుంచి బయటపడడానికి ఇప్పటికిప్పుడు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31,938 కోట్లు) కావాలని గతంలోనే కోరింది. ఇందుకోసం లంక, ఐఎంఎఫ్ మధ్య చర్చలు  ప్రారంభమయ్యా యి. కానీ ఏకాభిప్రాయానికి రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అంటే ఆర్థిక అనిశ్చితి ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 

వ్యవస్థలు నాశనం

రాజపక్స ఫ్యామిలీ ఘనకార్యాలకు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైంది. కొన్ని రోజులపాటు కొనసాగిన హింసాత్మక ఆందోళనలకు దేశ రాజధాని కొలంబో సహా చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నో ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు మంటల్లో కాలిపోయాయి. పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్టు, విద్యావ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నాయి. మొత్తంగా దేశాన్ని మళ్లీ నిర్మించాలి. మరి ఆ చిత్తశుద్ధి పాలకుల్లో ఉందా? ఆర్థిక, రాజకీయ అడ్డంకులను దాటుకుని శ్రీలంక నిలబడుతుందా? పునర్వైభవం దక్కించుకుంటుందా? అందుకు ఎన్నేళ్లు పడుతుంది? కాలమే చెప్పాలి!

- కొట్టాల రాము