సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ.. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు లేఖ

సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ.. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు లేఖ

హైదరాబాద్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. పసిపిల్లల విక్రయాలు, ఫెర్టిలిటీ సెంటర్ మోసాలతో సంపాదించిన కోట్ల రూపాయల మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్​నార్త్‌‌‌‌‌‌‌‌ జోన్ డీసీపీ, గోపాలపురం పోలీసులకు లేఖ రాసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ కేసుకు సంబంధించిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ సహా నిందితుల రిమాండ్‌‌‌‌ రిపోర్టులను అందించాలని కోరింది. 

వీటి ఆధారంగా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ కేస్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫర్మేషన్ రిపోర్ట్‌‌‌‌(ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌)ను రిజిస్టర్ చేయనుంది. ప్రధాన నిందితురాలు నమ్రత సహా కేసులో నిందితుల బ్యాంక్‌‌‌‌ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు. విదేశాలు సహా దేశ వ్యాప్తంగా పెట్టుబడుల వివరాలు సేకరించనుంది. డాక్టర్​నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్లు సంపాదించారని ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. 

8 రాష్ట్రాలు, రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు..!

హైదరాబాద్ సహా 8 రాష్ట్రాల్లో సృష్టి కార్యకలాపాలు విస్తరించి ఉన్నట్టు గోపాలపురం పోలీసులు గుర్తించారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేనివారికి అమ్మినట్లు ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదులు ఆధారంగా ఇప్పటికే 9 కేసులను రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 30 మందిని అరెస్టు చేయగా రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును వివిధ మార్గాల్లో మనీలాండరింగ్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. పిల్లలను అమ్మి  సరోగసీ, ఐవీఎఫ్ ద్వారా వారికి జన్మనిచ్చినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 

ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, ఆమె భర్త సురేశ్‌‌‌‌, ఆమె చెల్లి కీర్తి సహా దాదాపు 50 మందికిపైగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా భారీగా సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పిల్లల కొనుగోలుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 86 మందికిపైగా పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేలింది. ఈ డబ్బును వివిధ మార్గాల ద్వారా మనీలాండరింగ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈడీ దృష్టి పెట్టింది.