ప్రతి ఎంఈఓ రోజూ 2 స్కూళ్లు తిరగాలి

ప్రతి ఎంఈఓ రోజూ 2 స్కూళ్లు తిరగాలి
  • విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 

హైదరాబాద్,వెలుగు: ప్రతి ఎంఈఓ రోజూ కనీసం రెండు స్కూళ్లను సందర్శించాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వం పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబా ద్​లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్​లో 624 మండలాలకు చెందిన ఎంఈఓలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన బుర్రా వెంకటేశం మాట్లాడారు. 

బడుల పర్యవేక్షణతో విద్యానాణ్యత పెంచడంలో ఎంఈఓలదే కీలక పాత్ర అని చెప్పారు.  స్కూళ్లలో ఐదారు క్లబులను ఏర్పాటు చేయాలని, తద్వారా వేదికలపై నిర్భయంగా మాట్లాడేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలిపారు. వినూత్న ఆలోచనలతో విద్యాభివృద్ధికి కృషి చేసిన ఎంఈఓలకు రాష్ట్రస్థాయిలో అవార్డులు అందిస్తామని వెల్లడించారు. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి,  విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడారు. విద్యాప్రమాణాలు పెంచడంలో పేరెంట్స్, టీచర్లు కృషి చేసేలా ఎంఈఓలు కీలకపాత్ర పోషించాలని కోరారు.