కామారెడ్డి  జిల్లాలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు

కామారెడ్డి  జిల్లాలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు
  •     పనిచేస్తున్న  మండలంలో కాక ఇతర మండలాలకు కేటాయింపు
  •      ప్రజాప్రతినిధుల సిఫారస్​లకు ప్రయార్టీ 
  •     కామారెడ్డి జిల్లాలో  245 మంది టీచర్లకు  డిప్యూటేషన్​

కామారెడ్డి,  వెలుగు : కామారెడ్డి  జిల్లా  విద్యా శాఖలో డిప్యూటేషన్ల పేరుతో  ఇష్టారాజ్యం  కొనసాగుతోంది.  టీచర్ల సర్దుబాటు పేరిట ఆఫీసర్లు మాయజాలం ప్రదర్శించారు. పనిచేస్తున్న  మండలంలోనే  సర్దుబాటు చేయాలనే  రూల్స్ ఉన్నప్పటికీ   ఇందుకు విరుద్ధంగా  పలువురిని  వారు కోరుకున్న  మండలాలు,  టౌన్స్, హైవేకు దగ్గరగా  ఉన్న  స్కూల్స్​కు  డిప్యూటేషన్​పై  పంపారు.  కొన్ని చోట్ల స్థానిక అవసరాల మేరకు డిప్యూటేషన్లు ఇవ్వగా, మరి కొందరిని మాత్రం  జిల్లాకు చెందిన ముఖ్య  ప్రజాప్రతినిధుల సిఫారస్​లతో వారు కోరుకున్న  చోటుకు  పంపారు. ఇటీవల  245 మంది టీచర్లను డిప్యూటేషన్​పై పంపారు. 

857 పోస్టులు ఖాళీ

జిల్లాలో  183 హైస్కూల్స్​,  126 యూపీఎస్​, 696 ప్రైమరీ స్కూల్స్​ ఉన్నాయి.   వీటిల్లో   82వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు.  మొత్తం  4,938 మంది టీచర్లకు గాను  ప్రస్తుతం  4,081 మంది  ఉండగా  857 పోస్టులు ఖాళీగా  ఉన్నాయి.   కొన్ని చోట్ల  స్టూడెంట్స్​ ఎక్కువగా  ఉంటే  టీచర్లు తక్కువగా,  టీచర్లు  ఎక్కువగా ఉన్న చోట స్టూడెంట్స్​ తక్కువగా ఉన్నారు.  ప్రైమరీ స్కూల్స్​లో  సగం స్కూల్స్​లో  సింగిల్​ టీచర్లు ఉన్నారు.  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా  టీచర్లను  సర్ధుబాటు చేసుకునే అవకాశంఉంది.   స్టూడెంట్స్​కు  నష్టం జరగకుండా చూడాలి.  
 

కోరుకున్న చోటికి

మండలంలోనే   స్టూడెంట్స్​ ఎక్కువగా  ఉన్న చోటుకు డిప్యూటేషన్​ వేయకుండా ప్రజాప్రతినిధుల  సిఫారస్​లను పరిగణనలోకి  తీసుకుని టీచర్లు కోరుకున్న  చోటుకు   జిల్లా విద్యా శాఖ ఆఫీసర్లు డిప్యూటేషన్​ ఇచ్చారు.   భిక్కనూరు మండలంలో  పని చేసే ఓ టీచర్​ను  దోమకొండకు పంపారు.  భిక్కనూరు మండలంలో  కొందరిని హైవేకు దగ్గరగా ఉన్న స్కూల్స్​కు డిప్యూటేషన్​ ఇచ్చారు.   తాడ్వాయి  మండలంలోని  3 హైస్కూల్స్​లో  స్టూడెంట్స్​తక్కువగా ఉన్నా  టీచర్ల సంఖ్య  ఎక్కువగా ఉంది. వెనకబడిన  జుక్కల్​ నియోజకవర్గంలోని పలు స్కూల్స్​ నుంచి  బాన్స్​వాడ,  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు డిప్యూటేషన్ పై పంపారు.​ సిఫారస్​లు,  పైరవీలతో కోరుకున్న చోటుకు పంపించడంపై పలువురు టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

ఆఫీసర్ల  డిప్యూటేషన్ అర్డర్​పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్నూర్​ మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో  75 మంది స్టూడెంట్స్​ ఉన్నారు.  ఇక్కడ  3 పోస్టులు  ఉండగా  ఒకరు హెల్త్​ ప్రాబ్లమ్​తో , మరొకరు  ఉన్నత చదువుల కోసం  సెలవుల్లో  ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క టీచరే  పనిచేస్తున్నారు.   డిప్యూటేషన్​పై మరో టీచర్​ను  వేయలేదు.  ఇదే మండలం నుంచి  ఇద్దరు టీచర్లను మాత్రం ఇతర మండలాలకు డిప్యూటేషన్ పై పంపించారు.  జిల్లా కేంద్రానికి  దగ్గరగా, హైవేపై ఉన్న సదాశివనగర్​ మండలంలోని  హైస్కూల్​కు  ఒకరిని,  నస్రుల్లాబాద్​ ప్రైమరీ స్కూల్​కు మరొకరిని పంపారు.  అవసరాలకు అనుగుణంగా మండలంలోనే  టీచర్లను సర్దుబాటు చేయల్సి ఉండగా ఇతర మండలాలకు పంపారు.  

మారుమూలన ఉండే  మద్నూర్​ మండలంలో సరిపడా టీచర్లు లేక స్టూడెంట్స్​కు  బోధన  కష్టమవుతోంది. లింగంపేట మండలంలోని పలు స్కూల్స్​లో టీచర్ల  సమస్య ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఒక టీచర్​ను  కామారెడ్డి టౌన్​కు అతి సమీపంలో ఉండే  తాడ్వాయి మండలం కృష్ణాజీవాడీ ప్రైమరీ స్కూల్​కు  డిప్యూటేషన్​పై  పంపారు.  లింగంపేట మండలం నుంచి  మరో టీచర్​ను హైవే మీద ఉన్న సదాశివనగర్​  మండలానికి  డిప్యూటేషన్​పై పోస్టింగ్​ ఇచ్చారు.  

అవసరాలను దృష్టిలో   పెట్టుకొని ఇచ్చాం

స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని   245 మంది టీచర్లకు డిప్యూటేషన్ ఇచ్చాం.  వారు పని చేసే మండలంలోనే ఇవ్వాల్సిఉన్నప్పటికీ కొందరినీ  మాత్రమే  పక్క మండలాలకు కేటాయించాం. స్టూడెంట్స్​కు  బోధన విషయంలో  ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

-  రాజు,  డీఈవో, కామారెడ్డి