పిల్లల భవిష్యత్‌‌ తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే : విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా

పిల్లల భవిష్యత్‌‌ తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే : విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
  • టీచర్‌‌, స్టూడెంట్‌‌ ఇంటరాక్షన్‌‌ ఉండేలా బోధించాలి
  • టెన్త్‌‌ స్టూడెంట్లకు సెప్టెంబర్ నుంచి స్పెషల్‌‌ క్లాస్‌‌లు ప్రారంభించాలి
  • విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
  • ఖమ్మం కలెక్టరేట్‌‌లో ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ఆఫీసర్లతో రివ్యూ

ఖమ్మం టౌన్, వెలుగు : పిల్లల భవిష్యత్‌‌ ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైనే ఉంటుందని విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్‌‌ జిల్లాల ఆఫీసర్లతో గురువారం ఖమ్మం కలెక్టరేట్‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ, అగ్రికల్చర్‌‌, పాడి, చేపల ఉత్పత్తి రంగాల్లో అద్భుత ఫలితాలను సాధించామని, విద్యా రంగంలో కూడా అలాంటి మార్పులే సాధించాలని, ఇది టీచర్ల వల్లే సాధ్యం అవుతుందన్నారు. 

డీఈవో, ఎంఈవోలు తప్పనిసరిగా స్కూళ్లను తనిఖీ చేసి, టీచర్ల బోధనా విధానాన్ని గమనించాలని సూచించారు. జిల్లాలో అవసరమైన చోట టీచర్లను అడ్జస్ట్‌‌ చేసుకోవాలని చెప్పారు. అంగన్‌‌వాడీ కేంద్రాలను పరిశీలించి.. అక్కడి స్టూడెంట్లు ప్రభుత్వ స్కూళ్లలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. టెన్త్‌‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. స్కూల్‌‌కు సంబంధించిన వివరాలను యూడీఐఎస్‌‌సీ పోర్టల్‌‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. ఏఐ టూల్స్‌‌పై టీచర్లు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. 

రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో మెనూ పాటించాలని, నాన్‌‌వెజ్‌‌ వండే టైంలో క్వాలనిటీని చెక్‌‌ చేయాలని ఆదేశించారు. రివ్యూలో విద్యాశాఖ డైరెక్టర్‌‌ నవీన్‌‌ నికోలస్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్రీజ, టీజీఆర్‌‌ఈఐఎస్‌‌ సెక్రటరీ రమణ కుమార్, అడిషనల్ డైరెక్టర్ రాజీవ్, భద్రాద్రి ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌‌శర్మ, ఆర్‌‌జేడీ సత్యనారాయణరెడ్డి, జేడీఎస్‌‌ మదన్‌‌ మోహన్, సమగ్ర శిక్ష జేడీ వెంకటనర్సమ్మ, కేజీబీవీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌‌ హెచ్.హరీశ్‌‌, మోడల్ స్కూల్స్ ఏఎంవో బీడీఆర్‌‌ఎస్‌‌ మంజరి, సీఎస్‌‌ఎఫ్‌‌ అసోసియేట్‌‌ డైరెక్టర్‌‌ జి.సురేశ్‌‌, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల విద్యాశాఖ ఆఫీసర్లు, ఎంఈవోలు, హెచ్‌‌ఎంలు పాల్గొన్నారు.

ఏఐ ద్వారా విద్యాప్రమాణాల పెంపు

ఖమ్మంటౌన్/కారేపల్లి, వెలుగు : ఖమ్మం ఎన్‌‌ఎస్‌‌పీ కాలనీలోని ప్రైమరీ స్కూల్‌‌ను రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, విద్యా శాఖ డైరెక్టర్‌‌ నవీన్‌‌ నికోలస్, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పి.శ్రీజ సందర్శించారు. స్కూల్‌‌లో ఏర్పాటు చేసిన ఏఐఏఎక్స్ఎల్ ల్యాబ్‌‌ను, నాలుగో తరగతితో విద్యాభోదనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐ ల్యాబ్‌‌లో పిల్లలకు నచ్చిన విషయం ఏంటి ? కంప్యూటర్‌‌ పాఠాల అనుభవం ఎలా ఉంది ? వారికి అర్ధం అవుతుందా.. లేదా ? అన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు. 

ఆర్టిఫీషియల్‌‌ ఇంటలిజెన్స్‌‌ ద్వారా విద్యా ప్రమాణాల పెంపు కోసం చర్యలు చేపడుతున్నామని సెక్రటరీ యోగితా రాణా చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్‌‌లో 30 మంది కంటే ఎక్కువ స్టూడెంట్లు ఉన్న ప్రతి ప్రైమరీ స్కూల్‌‌లో ఏఐ ల్యాబ్‌‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం ఖమ్మం డైట్‌‌ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌‌ బిల్డింగ్‌‌, ఆధునికీకరణ పనులను, కారేపల్లిలోని మోడల్‌‌ స్కూల్‌‌ను సందర్శించారు.