పోస్టులు ఖాళీ ఉన్నా రెన్యువల్ చేయని సర్కారు‌‌‌‌‌‌‌‌

పోస్టులు ఖాళీ ఉన్నా రెన్యువల్ చేయని సర్కారు‌‌‌‌‌‌‌‌
  • పోస్టులు ఖాళీ ఉన్నా.. రెండేండ్ల నుంచి రెన్యువల్ చేయని సర్కారు‌‌‌‌‌‌‌‌
  • అటు కొత్త రిక్రూట్ మెంట్​లేక.. ఇటు వలంటీర్లను తీసుకోక ఆగమాగం
  • సర్దుబాటు తర్వాత కూడా బడుల్లో పెద్ద మొత్తంలో వెకెన్సీలు
  • సబ్జెక్ట్​ టీచర్లు లేక నష్టపోతున్న హైస్కూలు స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం విద్యావలంటీర్ల వ్యవస్థను ఎత్తేసినట్టే కన్పిస్తోంది. సర్కారు బడులల్లో వేల సంఖ్యలో టీచర్​పోస్టులు ఖాళీగానే ఉన్నా రెండేండ్ల నుంచి వలంటీర్లను రెన్యువల్​చేయడం లేదు. టీచర్ల సర్దుబాటు తర్వాత మిగిలే పోస్టుల్లో వలంటీర్లను తీసుకుంటామని చెప్పినా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉద్యోగుల సర్దుబాటు పూర్తయి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏమీ తేల్చడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు12 వేల మంది విద్యావలంటీర్లు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటు విద్యావలంటీర్లను తీసుకోక, అటు కొత్త టీచర్ల రిక్రూట్​మెంట్​చేపట్టకపోవడంతో.. వేలాది టీచర్​పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొన్నటి టీచర్ల సర్దుబాటు తర్వాత కూడా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.  2019–20 అకడమిక్​ఇయర్​లో టీచర్ల ఖాళీలను బట్టి ప్రభుత్వం16 వేల మంది విద్యావలంటీర్లను తీసుకుంది. ఉద్యోగాలు రావడం తదితర కారణాలతో12 వేల మంది వలంటీర్లు మిగిలారు. కరోనా వల్ల 2020 మార్చి నెలాఖరు నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. 2020–21 అకడమిక్​ఇయర్​లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొద్దిరోజులే ఫిజికల్ క్లాసులు నడిచాయి. దీంతో ఈ ఏడాది కూడా ప్రభుత్వం వలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. ఈసారైనా రెన్యువల్ చేస్తారని భావించినా, వారికి నిరాశే మిగిలింది. 

స్టూడెంట్స్ కు నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల సర్కారు బడులు ఉండగా, ఈసారి రెండున్నర లక్షల మంది కొత్త స్టూడెంట్లు సర్కారు బడుల్లో చేరారు. కానీ వారికి సరిపోను టీచర్లు లేరు. గతంలోనే వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండగా, మొన్నటి సర్దుబాటు తర్వాత కూడా పెద్ద సంఖ్యలో టీచర్ల కొరత ఉంది. దీంతో స్టూడెంట్స్​కు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా హైస్కూలు పిల్లలు సబ్జెక్ట్​ టీచర్​లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ ​జిల్లా గార్ల జడ్పీహెచ్ఎస్(సక్సెస్​ స్కూలు) స్కూలులోనే.. 2 స్కూల్​అసిస్టెంట్​ఇంగ్లిష్​ పోస్టులు, తెలుగు, ఫిజికల్​సైన్స్, బయోసైన్స్, సోషల్​స్టడీస్, ఒక పీఈటీ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఇలా సబ్జెక్ట్​టీచర్ల కొరతతో పిల్లలు పాఠాలు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కొత్త టీచర్లను రిక్రూట్​చేయకపోగా, విద్యా వలంటీర్లను కూడా తీసుకోవడం లేదని ఆయా స్కూళ్ల హెచ్​ఎంలు వాపోతున్నారు. అయితే ఉన్న టీచర్లతోనే నడిపించాలని సర్కారు ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు  చెప్తున్నారు. 

వలంటీర్లకు వేతనాలు పెండింగ్..
2019-–20 అకడమిక్​ఇయర్​లో పనిచేసిన విద్యావలంటీర్లకు సుమారు13 జిల్లాల్లో ఇంకా వేతనాలు అందలేదు. కొన్ని చోట్ల జిల్లా మొత్తం బకాయిలుండగా, ఇంకొన్ని చోట్ల పలు మండలాల్లో  జీతాలు రాలేదు. తమను రెన్యువల్ చేయాలని, పెండింగ్ జీతాలివ్వాలని కోరుతూ వలంటీర్లు ధర్నాలు చేసినా, విద్యాశాఖ, ఫైనాన్స్ మినిస్టర్లను కలిసినా ఫలితం లేకుండా పోయింది. కరోనా టైమ్​లో కూడా ప్రభుత్వం వలంటీర్లను ఆదుకోలేదు. ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బంది రెండున్నర లక్షల మందికి బియ్యం, నగదు అందించారు గానీ సర్కారు స్కూళ్లలో చదువు చెప్పే వలంటీర్లకు మాత్రం పైసా సాయం చేయలేదు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.