పిల్లల కంటి చూపు పై ఆన్ లైన్ క్లాసుల ప్రభావం

పిల్లల కంటి చూపు పై ఆన్ లైన్ క్లాసుల ప్రభావం

పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి నానా తంటాలు

పిల్లల్ని ఒకప్పుడు టీవీ కి దూరంగా ఉంచటానికి నానా తంటాలు పడేవాళ్లు పేరెంట్స్, ఈ మధ్యకాలంలో టీవీ ప్లేస్‌లోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. గంటల కొద్దీ ఆన్‌లైన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోలు అంటూ ఫోన్ మీదనుంచి కళ్లని పక్కకు తీయడం లేదు. ఇప్పుడు కరోనా వల్ల ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాక ఇది ఇంకా పెరిగింది.  ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టమనే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.  ఇదివరకైతే స్కూల్ టైంలో అయినా ఫోన్‌కి దూరంగా ఉండేవాళ్లు.   ఇప్పుడు క్లాసులు కూడా ఫోన్‌లోనే కావటంతో, అటు చదువు, ఇటు ఆటలూ అన్నీ ఫోన్‌లోనే అయ్యాయి.   దాంతో  పిల్లల స్క్రీన్ టైం పెరుగుతోంది.  దానితో పాటే చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు…

ఆన్‌‌లైన్ క్లాసుల ప్రభావం పిల్లల కంటిచూపుపై ఎక్కువ పడే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. గంటలపాటు ఆపకుండా ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో క్లాసెస్ వినడం, చూడటం వల్ల కళ్ల మంటలు, తలనొప్పి, నిద్ర రాకపోవటం లాంటి సమస్యలతో పాటు, కంటిచూపుపై మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతోంది. మామూలుగా పిల్లలకు స్క్రీన్ టైం రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా హెల్త్‌‌ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది…

గంటకన్నా ఎక్కువ  వద్దు

పిల్లల్లో స్క్రీన్ టైం విపరీతంగా పెరగడానికి కారణం వాళ్ల ప్రపంచమంతా డిజిటల్ వరల్డ్‌‌తో ముడిపడి  ఉండటమే. ఇంతకు ముందులాగా స్కూల్ కి వెళ్లటం, బయటికి వెళ్ళి ఆడుకోవటం కూడా ఇప్పుడు లేదు. దాంతో వాళ్లకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్సే లోకం అయిపోతున్నాయి. మొబైల్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్, ట్యాబ్, ఐప్యాడ్ ఇలా ఏదో ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వాళ్లకి అందుబాటులో ఉంటోంది.
కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదు.  WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ)  చెబుతున్న సూచనల ప్రకారం ఐదు సంవత్సరాల్లోపున్న పిల్లలు ఒకరోజులో గంటకన్నా ఎక్కువ సేపు స్క్రీన్ ని చూడటం మంచిది కాదు.

రూల్స్ ఇవే…

సెంట్రల్‌‌ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌‌ మెంట్ ఆన్ లైన్ క్లాసుల కోసం  కొన్ని రూల్స్ సూచించింది.

ప్రీ ప్రైమరీ – తరగతుల పిల్లలకి ఆన్ లైన్‌‌లో 30 నిమిషాలకి ఎక్కువ సేపు హోం క్లాస్ తీసుకోకూడదు.

ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి పిల్లల వరకు రోజుకు గంటన్నర మించకుండా ఒకటి నుంచి రెండు తరగతులు మాత్రమే తీసుకోవాలి.

తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి స్టూడెంట్స్​ మూడు గంటల టైం దాటకుండా నాలుగు సెషన్ల వరకు క్లాసులు తీసుకోవచ్చు.

మొబైల్ ఫోన్ మంచిది కాదు

పన్నేండేళ్లలోపు పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వటం ఏమాత్రం మంచిది కాదు. కానీ ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల తప్పని సరి అవసరమైంది.  అందుకని  రోజులో అవసరాన్ని బట్టి ఒకటిన్నర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా ఫోన్ చూడనివ్వొద్దు. కంప్యూటర్ స్క్రీన్, టీవీలకంటే మొబైల్ ఫోన్ పిల్లలకి ఇంకా ప్రమాదకరం. అంతే కాదు మనలో చాలా మంది దగ్గర  తక్కువ క్వాలిటీ ఫోన్లు ఉంటాయి.  కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండక పోతే పిల్లలకి చాలా సమస్యలు తెచ్చిన వాళ్లం అవుతాం.

పిల్లల ఆరోగ్యం మీద మొబైల్ ప్రభావం పడుతుందా? అనేది గమనిస్తుండాలి. చిన్న పిల్లలు ఆ సమస్యలని సరిగ్గా చెప్పలేకపోవచ్చు.

తలనొప్పి, కంటి నుంచి నీళ్లు కారటం, కళ్లు పొడిబారి దురదలు రావటం,  నిద్రలేమి వంటివి ఉంటాయి. ఇంకా అలాగే కొనసాగితే ఫోన్‌కి అడిక్ట్ అయిపోతారు. అంటే ఫోన్ లేకపోతే అన్నం తినక పోవటం, కోపంగా అరవటం వంటివి చేస్తారు.

కంటిన్యూగా ఫోన్ చూడనియ్యొద్దు. క్లాస్ అయిపోగానే ఫోన్ ని దూరం పెట్టాలి. ఒక్కో సెషన్ 30 నిమిషాలు మించి ఉండకూడదు. అలాగే, ప్రతి సెషన్ కి మధ్యలో 30 నిమిషాల ఇంటర్వెల్ ఉండాలి.

పిల్లలు ఆన్ లైన్ క్లాసులో ఉన్నప్పుడు పెద్ద వాళ్లు కూడా పక్కనే ఉండాలి.

స్క్రీన్ లైట్ ఎక్కువగా ఉండకూడదు, అలా అని మరీ తగ్గించి కూడా ఉంచొద్దు. 25% నుంచి 35%  బ్రైట్‌నెస్ ఉంటే చాలు.  చీకట్లో  కూర్చోకూడదు. మంచి లైటింగ్ ఉన్న ప్లేస్‌లో కూర్చోవాలి.

వీలైన వాళ్లు ఫోన్ కంటే కంప్యూటర్, ట్యాబ్‌ లాంటివి వాడొచ్చు. ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉండటం వల్ల కళ్లకి మరీ దగ్గరగా పెట్టుకుంటారు. అది రెటీనా మీద ప్రభావం చూపిస్తుంది. కంటికి, స్క్రీన్‌కి మధ్య కనీసం  3 నుంచి 4 అడుగుల దూరం ఉండాలి.

ఫోన్ లౌడ్ స్పీకర్‌‌లో కూడా ఆడియో సరిగ్గా వినపడక చెవికి మరీ దగ్గరగా పెట్టుకుంటారు. దానివల్ల కూడా రేడియేషన్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే చిన్న పిల్లల కోసం స్పెషల్ గా దొరికే ఇయర్ ఫోన్స్ వాడాలి. మార్కెట్లో ప్రత్యేకంగా పిల్లలకోసమే తయారైన ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి.

ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులు కూడా ఉండటం వల్ల కాదనలేని పరిస్థితి. అయితే.. కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి.

అన్నిటి కంటే ముఖ్యంగా పిల్లల్లో కంటి నుంచి నీరు కారటం, నిద్ర సరిగా లేకపోవటం, తలనొప్పి లాంటి సమస్యలు కనిపిస్తే లేట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. డాక్టర్ సలహా లేకుండా  అప్పటికప్పుడు ఏదో ఒక మందు తెచ్చి వేసే ప్రయోగాలు  చెయ్యొద్దు. పిల్లలకి ఇవ్వాల్సిన మందులు, డోసేజ్ వేరుగా ఉంటాయి. -డా.వంశీధర్ రెడ్డి, పీడియాట్రిషన్, సుధాకర్​ క్లినిక్స్​, హైదరాబాద్​.

ఇలాంటి యాప్స్ ఉన్నాయి.

పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించటానికి గూగుల్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. యాపిల్ కూడా అదే బాటలో స్క్రీన్ టైం తగ్గించే యాప్స్‌‌ని ఇన్ బిల్ట్‌‌గా అందించబోతోంది. ఇందుకు గూగుల్‌‌ “ఫ్యామిలీ లింక్” అనే అప్లికేషన్‌‌ చాలా ఉపయోగపడుతుంది.  పెయిడ్‌‌ పేరెంటల్‌‌ కంట్రోల్‌‌ అప్లికేషన్స్‌‌లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉన్న యాప్ ఇది. పిల్లల స్క్రీన్ టైం ఎంత సేపు ఉండొచ్చు అనే దగ్గరనుంచి ఏ  యాప్స్ ఓపెన్ చేయాలి? ఎలాంటి వెబ్ సైట్స్‌‌, యాప్స్‌‌ని బ్లాక్ చేయాలో కూడా ఈ యాప్‌‌లో సెట్ చేసుకోవచ్చు. లొకేషన్ ట్రాకింగ్‌‌తో పాటు ప్రమాదకరం అనుకున్న ఏ సైట్ ని కూడా ఓపెన్ చేయటానికి ఇందులో ఛాన్స్ ఉండదు. అలాగే పిల్లలకి ప్రమాదకరం అనిపించే గేమ్స్, యాప్స్ డౌన్‌‌లోడ్ చేయకుండా కూడా ఈ యాప్ అడ్డుకుంటుంది. ఫ్రెండ్స్, పేరెంట్స్ పర్మిషన్ లాక్  పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా ఒక యాప్‌‌ని కంటిన్యూగా చూస్తుంటే టైం లిమిట్ దాటగానే ఆ యాప్ ఆటోమేటిక్‌‌గా క్లోజ్ అయిపోతుంది.  ఆ రోజుకి మళ్లీ దాన్ని రీ ఓపెన్ చేయాలి అంటే తప్పక పేరెంట్స్ యాక్సెస్ అడగాల్సిందే.