బెల్లంపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రులను .. సందర్శించిన ఎఫ్‌డీఆర్ బృందం

బెల్లంపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రులను .. సందర్శించిన ఎఫ్‌డీఆర్ బృందం
  • వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి

బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఎఫ్‌డీ ఆర్) ఉమ్మడి రాష్ట్ర సమన్వయకర్త కె.రామ్మోహన్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి పట్టణం లోని షంషీర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సంస్థ ప్రతినిధులు సుమేధ, లిఖిత, ఉదయ్ కుమార్, మహేందర్‌తో ఆయన కలిసి పరిశీలించారు. రామ్మోహన్ మాట్లా డుతూ.. ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 ఇందుకోసం పలు జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో డివిజన్, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సమస్యలు, అవసరమైన వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి క్యాడర్ స్ట్రెంగ్త్‌కు సంబంధించి జీవో జారీ చేయాలని, వైద్య నిపుణులు, సిబ్బందిని నియమించాలని, సిటీ స్కానింగ్, ఎమ్మారై స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు వంటి ప్రధాన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని పీహెచ్​సీల్లోని సమస్యలను గుర్తించామని తెలిపారు.