జేపీఎస్​ల సమ్మె ఎఫెక్ట్..పల్లెల్లో ఆగిన పనులు

జేపీఎస్​ల సమ్మె ఎఫెక్ట్..పల్లెల్లో ఆగిన పనులు

 

  • జేపీఎస్​ల సమ్మె ఎఫెక్ట్..పల్లెల్లో ఆగిన పనులు
  • గ్రామాలకు రాని ఇన్ చార్జ్ సెక్రటరీలు 
  • వివిధ సర్టిఫికెట్లు, దరఖాస్తుల కోసం జనం తిప్పలు   
  • ఉపాధి హామీ పనులకు దెబ్బ 
  • నాలుగేండ్లు పూర్తయినా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయని సర్కార్  
  • 15 రోజులుగా కొనసాగుతున్న సమ్మె  

హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)ల సమ్మెతో పల్లెల్లో పనులు ఆగిపోయాయి. పాలన స్తంభించి జనం ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత పల్లెల్లో పనులన్నీ కార్యదర్శులే చూసుకుంటున్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులు, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీ, ఇంటి పన్ను వసూలు, ఇండ్ల పర్మిషన్, మ్యుటేషన్, ఉపాధి హామీ పనుల పరిశీలనకు తోడు రోజువారీగా చేయాల్సిన శానిటేషన్ పనుల పరిశీలన, మంచినీటి సరఫరా, డంపింగ్ యార్డు, స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు సెక్రటరీలపైనే ఉన్నాయి. అంతేకాకుండా హరితహారం, పల్లె ప్రకృతి వనా లు, శ్మశానవాటికలు, గ్రామ సభల నిర్వహణ తదితర పనులనూ వాళ్లే చూసుకుంటున్నారు. 

గత 15 రోజులుగా జేపీఎస్ లు సమ్మె చేస్తుండడంతో ఈ పనులన్నీ ఆగిపోయాయి. బిల్లులు ఇచ్చే జేపీఎస్ లు లేకపోవడంతో రోజువారీ ఖర్చులు పెట్టలేకపోతున్నామని సర్పంచ్​లు చెబుతున్నారు. కూలీలకు చెల్లింపులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్ల ప్రొబేషన్ తో జేపీఎస్ లను ప్రభుత్వం నియమించింది. అది పూర్తయ్యాక మరో ఏడాది ప్రొబేషన్ పొడిగించింది. ఇప్పుడది కూడా పూర్తి కావడంతో రెగ్యులరైజ్ చేయాలని జేపీఎస్ లు కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లు సమ్మెకు దిగినప్పటికీ స్పందించడం లేదు. పైగా జాబ్స్ నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. 

వ్యవసాయ పనులపైనా ఎఫెక్ట్..  

జేపీఎస్ ల సమ్మెతో వ్యవసాయ పనులపైనా ఎఫెక్ట్ పడుతోంది. పంటనష్టం అంచనా, వడ్ల కొనుగోళ్లలోనూ పంచాయతీ సెక్రటరీల పాత్ర ఉంది. పంట నష్టం జరిగినప్పుడు ప్రాథమికంగా సెక్రటరీలు రిపోర్టు పంపాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించినప్పటికీ.. కొనుగోళ్లు, కాంటాల నిర్వహణ బాధ్యత సెక్రటరీలు చూసుకుంటారు. రోజువారీగా కొనుగోళ్ల వివరాల రిపోర్టును మండల ఆఫీసులకు పంపిస్తుంటారు. ఇప్పుడు సెక్రటరీల సమ్మెతో వడ్ల కొనుగోళ్లలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని జనం అంటున్నారు. 

పల్లెల్లోకి రాని ఇన్ చార్జ్ సెక్రటరీలు..  

రాష్ర్టంలో దాదాపు 3 వేల మంది రెగ్యులర్ పంచా యతీ సెక్రటరీలు పని చేస్తున్నారు. జేపీఎస్ లు, ఓపీఎస్ లు సమ్మెలో ఉండడంతో ఆయా గ్రామాల బాధ్యతలను సీనియర్లకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఒక్కొక్కరిని 4 గ్రామాలకు ఇన్ చార్జ్ గా నియమించారు.  కొందరు వచ్చినా నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఇవ్వడంతో.. వెంటనే కనిపిం చి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఇక జేపీఎస్ ల సమ్మెకు సర్పంచ్ లు కూడా మద్దతు  తెలుపుతున్నారు.

జనం ఇబ్బంది పడుతున్నరు.. 

గత 15 రోజుల సంది గ్రామంలో పాలన స్తంభించింది. జనం ఇబ్బందులు పడు తున్నరు. ఇన్ చార్జ్ సెక్రటరీలు గ్రామాల కు రావడం లేదు. తమను రెగ్యులర్ చేయాలని జేపీఎస్ లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. ఫీల్డ్ అసి స్టెంట్లను తొలగించిన తర్వాత సెక్రటరీ లపై పని భారం మరింత పెరిగింది.

- ధనలక్ష్మి, సర్పంచ్,  తాటికోల్ గ్రామం, దేవరకొండ