ఎటూతేలని భద్రాచలం పంచాయితీ

ఎటూతేలని భద్రాచలం పంచాయితీ
  • మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వ ప్రయత్నం
  •  వ్యతిరేకించిన ప్రజలు, ప్రతిపక్షాలు
  • తర్వాత మూడు పంచాయతీలు చేయాలనే అంశం తెరపైకి.. 
  • ఇంకా తేలని నిర్ణయం.. 
  • చివరిగా 2013లో ఎన్నికలు..పాలకవర్గం లేక పాట్లు 
  • తాజాగా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం మేజర్​ గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ జీవో నంబర్​45ను గత బీఆర్​ఎస్ సర్కారు విడుదల చేసింది. 17 వార్డులతో భద్రాచలం, 17 వార్డులతో సీతారామనగర్​, 17వార్డులతో శాంతినగర్​పంచాయతీలుగా విభజించారు. పంచాయతీరాజ్​ యాక్టు ప్రకారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. గవర్నర్​ అనుమతి కోసం పంపారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గవర్నర్​ ఆ బిల్లును వెనక్కు పంపించారు.

2022 డిసెంబర్​ నుంచి ఈ వివాదం నడుస్తోంది. అయితే పట్టువీడని బీఆర్ఎస్ సర్కారు మాత్రం తిరిగి రెండోసారి కూడా బిల్లును ఆమోదించి గవర్నర్​కు పంపించారు. ఈ సమయంలో నాటి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గవర్నర్​ను కలిసి ప్రజల మనోభావాలను వివరించి బిల్లును ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. తాజాగా పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో భద్రాద్రి భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2013లో భద్రాచలం పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం ముగిశాక ప్రభుత్వం పంచాయతీని మున్సిపాల్టీగా చేయాలని భావించి, వ్యతిరేకత రావడంతో మూడు పంచాయతీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 
  
పాలకవర్గం లేకపోవడంతో అనేక పాట్లు

22 వార్డులు, 80వేల జనాభా ఉన్న భద్రాచలంలో పాలకవర్గం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ ఆఫీసర్​ పాలనలో డెవలప్​మెంట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద పంచాయతీ, నిధులు కూడా దండిగా వస్తాయి. వచ్చే డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయో..? కూడా జవాబుదారీతనం లేదు. పాలకవర్గం ఉంటే ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ, ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో నిధుల వినియోగంపై చర్చ జరుగుతుంది. అభివృద్ధి కూడా జరుగుతుంది. 

ఎన్నికలు పెట్టి ప్రజాపాలన నిర్వహించాలి

భద్రాచలం పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ ప్రజాపాలన జరగాలి. మూడు పంచాయతీల బిల్లు రద్దు చేసి, జీవో నెంబరు 45ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎప్పటిలాగే భద్రాచలాన్ని మేజర్​ పంచాయతీగా కొనసాగాలి.