కొండెక్కిన కోడిగుడ్డు

కొండెక్కిన కోడిగుడ్డు
  • దాణా, కూలీ ఖర్చుల కారణంగానే పెరిగిన రేటు
  • ధరలు పెరగడంతో స్కూళ్లు, హాస్టళ్లలో గుడ్డు గాయబ్
  • వారంలో రెండు రోజులే ఇస్తున్నరు.. కొన్ని చోట్ల అరటి పండుతో సరి

కోడి గుడ్డు ధర కొండెక్కి కూర్చున్నది. రెండు నెలల కిందటి దాకా రూ.4 వరకు ఉండగా, ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లోనే రూ.6కు చేరుకుంది. రిటైల్​షాపుల్లో ఒక్కో గుడ్డును రూ.7కు అమ్ముతున్నారు. పెరిగిన కోళ్ల దాణా ఖర్చు, కూలీ ఖర్చుల కారణంగా ఎగ్ ధర పెరుగుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనంలో వారంలో రెండు రోజులు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో గుడ్డుకు బదులు అరటి పండు ఇస్తున్నారు. 

ఖమ్మం, వెలుగు : కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. దీంతో కొందామని షాపుకు వెళ్లిన వారు ధర చూసి నోరెళ్లబెడుతున్నారు. రోజుకో గుడ్డు తినే అలవాటు ఉన్నవారు వారంలో రెండు రోజులకోసారి తింటూ సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనంలో ఇవ్వాల్సిన గుడ్డు కూడా మాయమవుతోంది. రెండు రోజులకోసారి ఇవ్వాల్సి ఉండగా మూడు రోజులకోసారి మాత్రమే పెడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో గుడ్డుకు బదులు అరటి పండు ఇస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడం తో హెడ్​మాస్టర్లు కూడా కుకింగ్ ఏజెన్సీలపై ఒత్తిడి చేయడం లేదు. వార్డెన్లు కొని తీసుకువచ్చే హాస్టళ్లలో మాత్రం వారంలో మెనూ ప్రకారం రోజు విడిచి రోజు బాయిల్డ్ ఎగ్ పెట్టాల్సి ఉండగా, వారంలో ఒకరోజు ఎగ్గొడుతున్నారు. రెండు నెలల క్రితం అక్టోబరులో గుడ్డు ధర రూ.4 వరకు ఉండగా, ఇప్పుడు ఏకంగా హోల్ సేల్ మార్కెట్లోనే రూ.6కు చేరుకుంది. నగరాల్లోని రిటెయిల్​షాపుల్లో ఒక్కో గుడ్డు రూ.7కు అమ్ముతున్నారు. పెరిగిన కోళ్ల దాణా ఖర్చు, కూలీ ఖర్చుల కారణంగా ఈ రేటు మరింత పెరిగే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

30 లక్షల గుడ్లు అవసరం

కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ముందున్న తెలంగాణలో రోజూ కోటి 80 లక్షల నుంచి 2 కోట్ల గుడ్లను ప్రజలు తింటున్నారు. ఇందులో మిడ్ డే మీల్స్, అంగన్ వాడీ, గవర్నమెంట్​ హాస్పిటల్స్, సంక్షేమ హాస్టళ్ల ద్వారానే 25 నుంచి 30 లక్షల వినియోగం జరుగుతోంది. దీంతో తెలంగాణలోని ఎగ్స్​ఇండస్ట్రీ ఏటా రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ సహా పలు రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమయ్యే దాణా ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ నుంచి తయారవుతుంది. కానీ రాష్ట్రంలో ఈ రెండు పంటల సాగు..డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది మొక్కజొన్న 6.20 లక్షల ఎకరాల్లో, సోయా 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యింది.  గతేడాది కిలో దాణా రూ.14 నుంచి రూ.17 వరకు ఉండగా, ప్రస్తుతం రెట్టింపై రూ.28 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. ఇదే సమయంలో డీజిల్ ధరలు పెరగడంతో ట్రాన్స్ పోర్ట్ కూడా భారమైంది. దీంతో పెరిగిన ధరల నుంచి బయటపడేందుకు గుడ్ల ధరలను పెంచుతున్నామని రైతులు, లేయర్ ఫామ్ యజమానులు చెబుతున్నారు. అయినా రైతులకు లాభం లేకుండా పోతోంది.  

వ్యాపారులకే లాభం

రాష్ట్రంలో గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ ఫామ్స్ 2 వేలకు పైగా ఉన్నాయి. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి సుమారు రూ.5.27 పైసలు ఖర్చు వస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. ఎగ్ బిజినెస్ పోటీతో కూడుకుని ఉన్న నేపథ్యంలో ఎవరికి వారే వారి స్టాక్ బయటకు వెళ్లాలన్న ఆలోచనతో తక్కువ ధరకు కూడా ఇచ్చేస్తున్నారు. దీంతో రైతుల కంటే మధ్య వ్యాపారులే అధికంగా లాభపడుతున్నారు. రైతు నుంచి వినియోగదారులకు వచ్చేసరికి ఒక్కో గుడ్డుపై రూ.1.50 నుంచి రూ.2 వరకు లాభం మధ్య వ్యాపారులకు ఉంటోంది. కానీ అసలు గుడ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులు మాత్రం మరింత రేటు పెంచలేక, చాలా ఏళ్ల నుంచి చేస్తున్న వ్యాపారం నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. 

నెలకు రూ.లక్ష లాస్

నేను ఐదు కేజీబీవీలు, రెండు సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు ఎగ్స్ సప్లయ్​ చేస్తున్నా. కేజీబీవీల్లో గుడ్డుకు రూ.5, సోషల్ వెల్ఫేర్​ స్కూళ్లలో రూ.4.75 చొప్పున రేటు ఫిక్స్ చేశారు. 3 నెలల నుంచి గుడ్ల రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.5.50 పలుకుతోంది. మాకు ఇచ్చే ధరతో నెలకు రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. –  శ్రీనివాస్, ఎగ్ కాంట్రాక్టర్, లక్సెట్టిపేట

రేటు పెరగడంతో బేరాలు తగ్గాయి

కోడిగుడ్ల రేట్లు పెరగడంతో వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. గతంలో రోజుకు 9 వేల గుడ్ల (300 ట్రేలు) వరకు అమ్మేవాడిని. ఇప్పుడు 6 వేల నుంచి 7 వేల వరకే అమ్ముడవుతున్నాయి. మొక్కజొన్న, సోయా, నూకల వంటి దాణా ఖర్చు, కోళ్ల ఫారాల్లో కూలీల ఖర్చు పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశముంది. – లక్ష్మీనారాయణ, హోల్ సేల్ వ్యాపారి, ఖమ్మం 

అయినా రైతులకు లాభాల్లేవు

గతేడాదితో పోలిస్తే దాణా ఖర్చు రెట్టింపయ్యింది. రాష్ట్రంలో మొక్క జొన్న సాగు చేయొద్దని చెప్పడంతో ప్రస్తుతం బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నాం. కరెంటు బిల్లులు, కూలీ ఖర్చులు, దాణా, ట్రాన్స్ పోర్ట్​ఛార్జీలు అన్నీ పెరిగాయి. రేటు పెరిగినా రైతులకు ఏ మాత్రం లాభాల్లేవు. ఇంకా రేటు పెంచే పరిస్థితి లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కొద్ది నెలల్లోనే చాలా లేయర్ ఫామ్స్ యజమానులు బ్యాంకులోన్లు కట్టలేక వ్యాపారం మూసుకునే ప్రమాదముంది.  – జి.చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ జోనల్ చైర్మన్, ఎన్​ఈసీసీ