తౌక్టే తుఫాన్ బీభత్సం.. ఎనిమిది మంది మృతి

తౌక్టే తుఫాన్ బీభత్సం.. ఎనిమిది మంది మృతి
  • కేరళ, కర్ణాటక,గోవాలో కుండపోత
  • కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు,గోవాలో ఇద్దరు మృతి 
  • రేపు గుజరాత్ దగ్గర తీరాన్ని దాటనున్న తుఫాన్ 
  • 175 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న ఎండీ

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను అతి తీవ్రంగా మారింది. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్​లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలకు కర్నాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు, గోవాలో ఇద్దరు మృతి చెందారు. కేరళలోని 9 జిల్లాల్లో భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం రెడ్ ​అలర్ట్ ​ప్రకటించింది. గుజరాత్‌‌లోని పోరుబందర్, మహువా మధ్య మంగళవారం పొద్దున తుఫాను తీరం దాటనుందని వెల్లడించింది. తుఫాను తీరాన్ని తాకే టైమ్​లో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, తీరం దాటేప్పుడు 150 కిలోమీటర్ల నుంచి -175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌‌ను కేంద్రం రంగంలోకి దించింది. మ‌‌రో 22 టీమ్​లను ప‌‌రిస్థితుల‌‌ ప్రకారం అవ‌‌స‌‌ర‌‌మైన చోటుకు త‌‌ర‌‌లించేందుకు రెడీగా ఉంచింది. ఇండియన్​కోస్ట్​గార్డ్​కు సంబంధించిన 40 టీమ్​లు కూడా సిద్ధంగా ఉన్నాయి. గుజరాత్​లో ఇప్పటికే లోతట్టు ప్రాంతల్లోని 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

కేరళలో 14.5 సెంటీమీటర్ల వాన

తుపాను ప్రభావంతో కేరళలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం రాష్ట్రంలో సరాసరి 14.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మల్లాపురం, కొజికోడ్‌‌, వయనాడ్‌‌, కన్నూర్‌‌, కాసర్‌‌గోడ్‌‌ల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది. తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడంతో పాటు వానలు, గాలులకు రాష్ట్రంలోని వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 2 వేల మందిని 71 క్యాంపులకు తరలించారు. కాసర్‌‌గోడ్‌‌ జిల్లాలోని చేరంగాయ్‌‌లో తుఫాను దాటికి ఓ బిల్డింగ్ కూలింది. అందులోని వాళ్లను ముందే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. 

కర్నాటకలో 73 గ్రామాలు ఎఫెక్ట్​

తౌక్టే తుఫాను ప్రభావంతో కర్నాటకలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాలు, వరదలకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. తుఫాను దెబ్బకు 7 జిల్లాల్లోని 73 గ్రామాలు ప్రభావితమయ్యాయన్నారు. 112 ఇండ్లు డ్యామేజ్​అయ్యాయని చెప్పారు.  రాష్ట్రంలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 15 కోట్లు ఖర్చు చేస్తామని యడియూరప్ప చెప్పారు.

గోవాలో స్తంభించిన జనజీవనం

మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానే, పాల్ఘర్​ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. రాయ్​ఘడ్​లో కుండపోతు కురుస్తుందని తెలిపింది. ముంబైకి అంత పెద్దగా ముప్పు లేదంది. బలమైన గాలులు, భారీ వర్షాల వల్ల గోవాలో జనజీవనం స్తంభించింది. వందలాది విద్యుత్​ పోల్స్ పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో పవర్​సప్లై నిలిచిపోయింది. గోవా నుంచి వెళ్లే అన్ని ఫ్లైట్లను క్యాన్సిల్​ చేశారు.

సీఎంలతో అమిత్​షా రివ్యూ

సైక్లోన్ తౌక్టేకు సంబంధించి ముందస్తు సన్నద్ధతపై ప్రధాని మోడీ ఇప్పటికే సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​అధికారులతో రివ్యూ చేశారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్, తాగునీరు, ఫుడ్ లాంటి సర్వీసులకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు. తౌక్టే తుఫాను ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం అమిత్‌‌ షా వర్చువల్‌‌గా సమావేశమయ్యారు.  తుఫాను ప్రభావం, అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 100కు పైగా ఎన్డీఆర్​ఎఫ్​ టీమ్​లు రెడీగా ఉన్నాయని చెప్పారు. గుజరాత్​లో లక్షలాది మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుందన్నారు.