బడి పంతుళ్లకు భరోసా ఏది ?

బడి పంతుళ్లకు భరోసా ఏది ?

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు దాటినా.. విద్యారంగం స్థితిగతులు ఏమాత్రం మారలేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. విద్యపై నిర్లక్ష్య వైఖరే కొనసాగుతోంది. సర్కారు బడుల్లో సౌలత్​లు మెరుగుపడలేదు. బడులు తెరిచి రెండు నెలలైనా పాఠ్య పుస్తకాలు లేవు. సరిపోను సార్లు లేరు. యూనిఫామ్ ​అందలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటం లేదు. హాస్టళ్ల పరిస్థితి మరీ అధ్వానం.. ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి, వారి భవిష్యత్తుకు బాటలు వేసే పాఠశాల విద్యపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటుందో అర్థం కావడం లేదు. 

రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. విద్యార్థులకు ఇంకా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేదు. ఆయా జిల్లాల్లో యూనిఫామ్ కూడా రాలేదు. చదువుకోవడానికి పుస్తకాలు లేక, కూర్చునేందుకు సరిపోను తరగతి గదులు లేక, పాఠాలు చెప్పేందుకు పూర్తి స్థాయిలో సార్లు లేక పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది? మరో వారం పది రోజుల్లో పరీక్షలు మొదలుకానున్నాయి. ఇప్పటి దాకా పుస్తకాలు ఇవ్వకుండా ప్రభుత్వం పరీక్షలు ఎలా పెడుతుంది? పెట్టినా విద్యార్థులు ఏం రాస్తారు? విద్యా సంవత్సరానికి ముందే సిద్ధం చేయాల్సిన పుస్తకాలు, యూనిఫామ్​ ఇంకా పిల్లలకు అందించలేదనేది ప్రభుత్వానికి పాఠశాల విద్యపై ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. కరోనా మహమ్మారితో విద్యా వ్యవస్థ అతలాకుతలమైంది. బడులు మూతపడ్డాయి. పిల్లలు చదువుపై పట్టు కోల్పోయారు. విద్యా ప్రమాణాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయని అనేక అధ్యయనాలు చెప్పాయి. కరోనాతోనే తీవ్ర నష్టం జరిగితే.. ఇప్పుడు సర్కారు కూడా నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం సరికాదు. విద్యార్థుల భవిష్యత్​పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 

ఇంగ్లీష్​ మీడియం సరే.. టీచర్లేరి?
రాష్ట్రం సర్కారు ఈ సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన ప్రారంభించింది. కానీ దాన్ని విజయవంతం చేసే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇంగ్లీష్ ​మీడియంలో బోధించేందుకు టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్న ప్రభుత్వం.. 9 వారాల శిక్షణలో ఇప్పటి వరకు 4 వారాలు మాత్రమే పూర్తి చేసింది. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత ఉండగా, ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతో అది ఇంకా తీవ్రమైంది. అయినా ప్రభుత్వం టీచర్ల రిక్రూట్​మెంట్​చేపట్టడం లేదు. రాష్ట్రంలోని చాలా బడుల్లో టీచర్లకు సరైన శిక్షణ, నైపుణ్యాలు అందక వారు తెలుగు మాధ్యమంలోనే పాఠాలు బోధిస్తున్నారు. కొన్ని చోట్ల బైలింగ్వల్​పద్ధతిలో విద్యాబోధన జరుగుతోంది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్​ మీడియం ప్రవేశపెట్టడాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు వరంగా భావించారు. కానీ సర్కారు దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఆంగ్లమాధ్యమ బోధనను పటిష్టం చేసే విషయంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి.

వసతుల కల్పన ఉట్టిమాటేనా?
ఇప్పటి వరకు ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన ప్రభుత్వ బడులు.. ఇయ్యాల సరైన సౌలత్​లు లేక, పట్టించుకునే నాథుడు లేక అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. విద్యా వ్యవస్థపై పెట్టుబడిని ప్రభుత్వం భారంగా, ఉపయోగం లేనిదిగా భావిస్తోంది. అందుకే దానిపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తడంతో ‘మన ఊరు మన బడి’ పథకం తీసుకొచ్చిన సర్కారు.. దాని ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్​మెంట్​కార్యక్రమాలు పూర్తి చేయలేదు. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్లను ఎంపిక చేసినప్పటికీ.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సరిపోను తరగతి గదులు, టాయిలెట్లు, వంట రూములు లేవు. కొన్ని చోట్ల బడులు శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు కూడా పూర్తి స్థాయి భవనాలు లేవు. ప్రభుత్వం ఇప్పటికైనా బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి.

బడి పంతుళ్లకు.. భరోసా ఏది ?
విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర. విద్యా ప్రమాణాలు మెరుగుపడాలన్నా, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా టీచర్లు కృషి ఉంటేనే అది జరుగుతుంది. ఇది కాదనలేని సత్యం. నిత్యం సమస్యలతో బడికి వెళ్లే టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై ఎంత వరకు ఫోకస్​ చేయగలుగుతారనేది సందేహమే! కాబట్టి ప్రభుత్వం టీచర్ల సమస్యలు పరిష్కరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తమకు ఒకటో తారిఖున జీతాలు పడేవని, స్వరాష్ట్రంలో ప్రతి నెల జీతాలు ఆలస్యమవుతున్నాయిన టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేక ఉన్నచోటే ఏండ్లుగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంలో పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ చేయకపోవడం, ముఖ్యంగా పర్యవేక్షణ స్థాయి ఉద్యోగాలైన ఎంఈవో, డీఈవో, డిప్యూటీ డీఈవో లాంటి పోస్టులను నింపకపోవడం విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాపోతున్నారు.

ఇవన్నీ ప్రభుత్వం పరిష్కరించాల్సిన వాస్తవ సమస్యలే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ఏకీకృత సర్వీస్ రూల్సని కొంత కాలం, కోర్టు కేసులని కొంత కాలం, ఇలా అనేక సాకులని చూయించి, అన్నీ అర్హతలున్న టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్ లుగా, జూనియర్ లెక్చరర్స్ గా, డైట్ లెక్చరర్స్ గా పదోన్నతులు కల్పించక పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీగాక ఉద్యోగులకు పూర్తి స్థాయి ఉచిత వైద్య సదుపాయాలను కల్పించక పోవడంపై కూడా వారు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, ప్రత్యామ్నాయ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వాటిల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుంటూ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం తమ పొట్టగొట్టడమేనని నిరుద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది పోరాటాల ఫలితంగా, అనేకమంది ప్రాణత్యాగాల మూలంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వ బడుల పరిస్థితి మారకపోవడం, పేదోడికి నాణ్యమైన విద్య అందకపోవడం దుర్మార్గం. మరోవైపు కార్పొరేట్​స్కూళ్లు, విద్యా సంస్థలు రెట్టింపు ఫీజుల వసూళ్లతో వాటి బ్రాంచీలను పెంచుతున్నా.. ప్రభుత్వం వాటిని నియంత్రించలేకపోతోంది. ఈ పరిస్థితి మారాలె. విద్యా వ్యవస్థను బాగు చేయడానికి టీచర్​ఎమ్మెల్సీలు, విద్యా శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి. పూర్తి నిర్ణయాధికారం కలిగిన ముఖ్యమంత్రి కూడా విద్యావ్యవస్థ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సర్కారు బడులను బాగు చేయాలె. కార్పొరేట్ సంస్థలకు దీటుగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్ది, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలి.

భోజనం సరిగా లేక ...
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజనం, రెసిడెన్షియల్ హాస్టళ్లలో పెడుతున్న అన్నం నాణ్యతగా ఉండటం లేదు. పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల్లో ఫుడ్​పాయిజనై అనేక మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలుకావాల్సి వచ్చింది. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో చాలా చోట్ల నిర్వాహకులు నాసిరకం భోజనం పెడుతున్నారు. నెలల తరబడి ప్రభుత్వం బిల్లులు చెల్లించక పెండింగులో పెడుతుండటంతో నిర్వాహకులు అప్పు తెచ్చి మరి వంట చేస్తున్నారు. రెసిడెన్షియల్​హాస్టళ్లకు సరఫరా చేసే సరుకులు కూడా నాసిరకంగా ఉంటున్నాయని బాసర ట్రిపుల్​ఐటీ లాంటి చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. మా పిల్లలు ఏం తింటున్నారో.. పేదోడి పిల్లలకు కూడా బడుల్లో అదే భోజనం పెడుతున్నామని చెప్పిన పాలకులు.. ఇటీవలి ఫుడ్​పాయిజన్​ఘటనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

- దర్శనం దేవేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ జేఏసీ