అమరులపై ఎందుకంత పగ

అమరులపై ఎందుకంత పగ

వాళ్ల త్యాగాలతో గద్దెనెక్కి వాళ్లనే విస్మరిస్తరా?: ఎక్కా యాదగిరి

గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా కేసీఆర్​ ఎందుకు ప్రారంభిస్తలె? ప్రాణత్యాగం చేసినోళ్లతో రాజకీయాలేంది? స్థూపాన్ని చూస్తే కన్నీళ్లు వస్తున్నయ్.. ఇక ప్రారంభిస్తారనే నమ్మకం పోయింది ‘వీ6 వెలుగు’తో స్థూపం రూపశిల్పి ఆవేదన 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులపై సీఎం కేసీఆర్ పగబట్టారని తెలంగాణ అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతోనే గద్దెనెక్కిన కేసీఆర్.. ఇప్పుడు వాళ్లనే విస్మరించారని ఆయన అన్నారు. శుక్రవారం ‘వీ6–వెలుగు’తో ఎక్కా యాదగిరి ప్రత్యేకంగా మాట్లాడారు. గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాతే సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్.. ఇన్నేండ్లయినా దాన్ని అధికారికంగా ఎందుకు ప్రారంభించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 

..ఎందుకంత పగ

అమరవీరుల స్థూపాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, 360 మందికి పైగా యువకుల బలిదానాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మెమోరియల్​ను పక్కనపెట్టి కొత్తది ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపాన్ని చూస్తుంటే నాకు దు:ఖం ఆగడం లేదు. ప్రభుత్వ లాంఛనాలతో అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించాలనేదే నా కోరిక. అందుకు లక్షలు, కోట్లేమీ ఖర్చు కావు కదా! తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించాలని కేసీఆర్​ను కలిసి కోరాను. అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు.

కానీ ఆ తర్వాత ఏమైందో గానీ.. అమరవీరుల స్థూపాన్ని కాదని, రూ.వందల కోట్లు పెట్టి కొత్త మెమోరియల్ నిర్మించారు. ఇక గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభిస్తారన్న నమ్మకం లేదు. కేసీఆర్ అమరవీరులపై పగబట్టినట్టుగా ఉంది. అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభించడం లేదంటే వాళ్లపై పగబట్టినట్టు కాదా? రాష్ట్రం కోసం బలిదానం చేసిన వారిపై ఎందుకంత పగ? తన రాజకీయ ప్రయోజనాల కోసం అమరవీరులను వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడెందుకు వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు” అని ప్రశ్నించారు.

 దోస్తుకు నివాళిగా.. 

ఆలియాబాద్​కు చెందిన తన స్నేహితుడు వెంకటేశ్వర్​రావు 1969 ఉద్యమంలో తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడని, అప్పుడు తాను చాలా బాధ పడ్డానని యాదగిరి చెప్పారు. ‘‘నాకు అవకాశం వస్తే నా స్నేహితుడికి నివాళిగా ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పుడు తొమ్మిది జిల్లాలు ఉండేవి. ఒక్కో జిల్లాకు ఒక్కో బుల్లెట్ ను గుర్తుగా నల్లరాయితో స్థూపంపై చిత్రించాం. అమరవీరుల ఆశయాలను ప్రతిబింబించేలా దాన్ని నిర్మించాం” అని తెలిపారు. మెమోరియల్​అంటే ఉద్యమకారుల బలిదానాలను గుర్తు చేసేదిగా ఉండాలన్నారు. 
ప్రశ్నిస్తున్నానని పిలుస్తలేరు.. 
తెలంగాణ వచ్చిన కొత్తలో అధికారిక కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందేదని, తాను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నానని ఇప్పుడు ఏ కార్యక్రమానికి పిలవడం లేదని యాదగిరి చెప్పారు. కేసీఆర్​పిలవకపోయినంత మాత్రాన తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ‘‘కేసీఆర్​పద్ధతి వేరు.. ఆయన థింకింగ్​వేరు.. సంగతులు వేరు.. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసు. అది ఓపెన్​సీక్రెట్. నేను రాజకీయవేత్తను కాదు.. నేను కళాకారుడ్ని.. శిల్పకళను పద్మశ్రీ అవార్డు వరకు తీసుకెళ్లిన.. నేను కేసీఆర్​ను కలవలేదని కాదు.. హ్యాండ్​టు హ్యాండ్​ఎన్నో రిప్రజంటేషన్లు ఇచ్చిన” అని తెలిపారు.

కేసీఆర్.. జవాబు చెప్పండి 

అమరవీరుల స్థూపం తన ప్రాణమని యాదగిరి చెప్పారు. ఆ స్థూపంలో కొన్ని మార్పులు చేసి మెమోరియల్​ను తక్కువ చేసే ప్రయత్నాలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయని ఆవేదన చెందారు. ‘‘అమరవీరుల స్థూపం గుంతలో ఉంటుంది. అప్పటి పాలకులు ఆ గుంతను పూడ్చేశారు. దాని స్ఫూర్తి దెబ్బతింటుందని మేమంతా గొడవ పడితే మళ్లీ గుంతను తీశారు” అని గుర్తు చేశారు. అమరుల త్యాగాల పునాదులపై రాజ్యమేలుతున్న కేసీఆర్... వారిని విస్మరించడం బాధ కలిగిస్తోందన్నారు. ‘‘అమరవీరులతో రాజకీయాలు ఎందుకు? వాళ్లు పాకిస్తాన్​.. మనం హిందుస్తానా?” అని ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మొక్కే కేసీఆర్.. తామిచ్చే రిప్రజంటేషన్లను ఎందుకు బుట్ట దాఖలు చేస్తున్నారని నిలదీశారు. అమరవీరుల స్థూపాన్ని ఎందుకు ప్రారంభించడం లేదో కేసీఆర్​సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇన్నేండ్లుగా ఎదురుచూశా.. 

అమరవీరుల స్థూపాన్ని చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదని యాదగిరి ఆవేదన చెందారు. ‘‘1972లో స్థూపం నిర్మాణం ప్రారంభించి 1974లో పూర్తి చేశాం. రెండేండ్ల పాటు 50 మందిమి కష్టపడ్డాం. అప్పుడు ఆంధ్రా పాలకులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్లు దాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలంగాణ పాలకులే కదా.. అయినా ఎందుకు ప్రారంభించడం లేదు? తెలంగాణ ఉద్యమంలో గన్​పార్క్​దద్దరిల్లింది. అమరులతో రాజకీయాలేంటో అర్థం కావడం లేదు. ఈ మెమోరియల్​ను ప్రారంభించకపోవడం, దాన్ని ఏర్పాటు చేసినోళ్లను పట్టించుకోకపోవడం దారుణం. ఈ స్థూపాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఇన్నేండ్లు ఎదురుచూశా. కానీ నా ఆశ నెరవేరలేదు” అని వాపోయారు. ‘‘తెలంగాణ ఏర్పడిన మొదట్లో పాలకులను వెళ్లి కలిశాను. స్థూపం ప్రారంభించిన తర్వాత దాని నిర్మాణానికి చేసిన ఖర్చు చెల్లిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. 1974లో స్థూపం నిర్మాణానికి రూ.4 లక్షలు ఖర్చు చేస్తే, కేవలం రూ.50 వేలు మాత్రమే చెల్లించారు. మిగతావి ఇప్పటికీ ఇవ్వలేదు. డబ్బుల గురించి నేను ఆలోచించడం లేదు. స్థూపం ప్రారంభించడం లేదనే బాధే నాకు ఎక్కువగా ఉంది” అని అన్నారు. 

గన్​ పార్క్​లో అమరవీరుల స్థూపం ఉన్నందుకే ఉద్యమకారుల చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఈ స్థూపమే కారణం. కేసీఆర్ ​అనుకుంటే  రేపే అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించవచ్చు. కానీ ఆయన అధికారికంగా ప్రారంభిస్తా రన్న నమ్మకం నాకు లేదు. కేసీఆర్ నాపై కాదు.. అమరవీరులపైనే పగబట్టారు. అందుకే దాన్ని ప్రారంభించడం లేదు.