మంచిర్యాల, సింగరేణి ఏరియాల్లో భారీ ఏర్పాట్లు..మినీ మేడారం ఉత్సవాలు

మంచిర్యాల, సింగరేణి ఏరియాల్లో భారీ ఏర్పాట్లు..మినీ మేడారం ఉత్సవాలు
  • ఇయ్యాల గద్దెలకు రానున్న సారలమ్మ గద్దెలకు చేరిన​కంకవనం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, చెన్నూరు, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, జైపూర్, కోటపల్లి, నెన్నెల ప్రాంతాల్లో మినీ మేడారం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి మూడు రోజులు పాటు నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో పాలవాగు ఒడ్డున 10 ఎకరాల విస్తీర్ణంలోని జరిగే జాతరకు సింగరేణి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీరాంపూర్ ​ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద జాతరకు సర్వం సిద్ధమైంది. 

జాతర జరిగేది ఈ ప్రాంతాల్లోనే.. 

మంచిర్యాలలో గోదావరి ఒడ్డున, బెల్లంపల్లి  మండలం కన్నాల బుగ్గ దేవాలయం సమీపంలో, లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల శివారు నుంచి 3  కిలోమీటర్ల దూరంలోని గోదావరి నదీ తీరాన, చెన్నూరు శివారు గోదావరి రోడ్డు, సుబ్బరాంపల్లి వద్ద, జైపూర్​ మండలంలోని వెలిశాల మల్లన్న గుడి వద్ద, కన్నెపల్లి మండలం ముత్తాపూర్, వేమనపల్లి, నెన్నెల మండలం మైలారం, కోటపల్లి మండలం మల్లంపేట, రాపన్​పల్లిలో జాతరలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం  సారలమ్మ, 29న సమ్మక్క గద్దెకు వచ్చి 30న భక్తులకు దర్శనమిస్తారు.

పూనకాల మధ్య గద్దెలకు చేరిన​ కంకవనం 

రామకృష్ణాపూర్​ శివారులోని ఆర్కే-1ఏ బొగ్గు గని సమీప పాలవాగు ఒడ్డున నిర్వహించనున్న వేడుకలు మంగళవారం మేడారం సంప్రదాయ పద్ధతిలో కంకవనం పూజలతో ప్రారంభమయ్యాయి. ఆర్కే-1ఏ బొగ్గు గని ఆవరణలోని కంకవనం వద్ద  మేడారం నుంచి వచ్చిన కోయ పూజారుల నేతృత్వంలో మందమర్రి జీఎం రాధాకృష్ణ, ఎస్​ఓటుజీఎం జీఎల్​ ప్రసాద్​, డీజీఎం అశోక్, కార్మిక సంఘాలు, రాజకీయ సంఘాల లీడర్లు పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, పూనకాల మధ్య కంకవనాలను తల్లుల గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిగిద్దెరాజు గద్దెలపై ఉంచి పూజలు చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయారు.