
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షూటర్ ఎలవెనిల్ వలారివన్ గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 26 ఏండ్ల తమిళనాడు షూటర్ 253.6 పాయింట్లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో తనకిదే తొలి గోల్డ్ కావడం విశేషం. చైనాకు చెందిన జిన్లూ పెంగ్ (253 పాయింట్లు) రజతం, కొరియాకు చెందిన యుంజి క్వాన్ (231.2 పాయింట్లు) కాంస్యం సాధించారు. మరో ఇండియా షూటర్ మెహులి ఘోష్ 208.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది.
వలారివన్, మెహులి ఘోష్,అనన్య నాయుడుతో కూడిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ కాంస్యం గెలిచింది. ఫైనల్లో మొత్తం 1891 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఈ పతకం గెలిచింది. ఇక, సీనియర్ స్కేట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అభయ్ సింగ్ సెఖోన్– గణేమత్ సెఖోన్ కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. బ్రాంజ్ మెడల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ 39–-37తో కువైట్‌కు చెందిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అబ్దుల్లా అల్ రషీది–అఫ్రా అల్మొహమ్మద్‌పై విజయం సాధించారు.
మరోవైపు మెగా టోర్నీలో ఇండియా జూనియర్ షూటర్లు సత్తా చాటుతున్నారు. విమెన్స్10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో శంభవి శ్రావణ్, హృద్య శ్రీ కొండూరు, ఇషా అనిల్ స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో 1896.2 స్కోరుతో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఇండియా త్రయం జూనియర్ వరల్డ్, ఆసియా రికార్డును కూడా నెలకొల్పింది. జూనియర్ స్కేట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో హర్మెహర్ సింగ్ లాలీ, యశస్వి రాథోడ్ జోడీ గోల్డ్ నెగ్గింది. ఫైనల్లో 39–36తో కజకిస్తాన్ షూటర్లను ఓడించింది.