- కిరాయి హంతకులతో కలిసి దారుణం
- గొడ్డలితో ..., పెట్రోల్ పోసి దహనం..
- ముగ్గురు నిందితులు అరెస్ట్
కోటపల్లి, వెలుగు: ఆస్తి తగాదాలతో తమ్ముడిని హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. గుప్త నిధుల పేరిట నమ్మించి అడవిలోకి తీసుకెళ్లి శ్రీనివాస్(40)ను గొడ్డలితో నరికి హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ కేసును కోటపల్లి, నీల్వాయి పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు కుడుకుల రాజేశ్, గోదారి సమ్మయ్య, బల్లా కిష్టస్వామిని అరెస్ట్ చేశారు.
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నీల్వాయి గ్రామానికి చెందిన రాజేశ్, అతని తమ్ముడు శ్రీనివాస్ మధ్య వ్యవసాయ భూమి, ఇంటి స్థలం విషయంలో ఏడేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన రాజేశ్.. చాకపల్లికి చెందిన సమ్మయ్యను సంప్రదించగా, అతను తన గ్రామానికే చెందిన కిష్టస్వామిని కలుపుకున్నాడు.
ఈ నెల 20న చెన్నూరు వచ్చిన శ్రీనివాస్‌ను సమ్మయ్య కలిసి ఇద్దరు కలిసి బస్టాండ్ సమీపంలో మద్యం తాగారు. అనంతరం గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఒడ్డు సోమనపల్లి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కిష్టస్వామి సాయంతో శ్రీనివాస్‌ను గొడ్డలితో నరికి హత్య చేశారు. డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. హత్య చేసిన అనంతరం రాజేశ్ డబ్బులు తీసుకున్నారు.
శ్రీనివాస్ కనిపించడం లేదని ఈ నెల 21న అతడి భార్య శారద నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సమ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా, హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజేశ్, కిష్టస్వామిని సైతం అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.60 వేల నగదు, హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్, రక్తపు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన చెన్నూరు రూరల్ సీఐ ఆర్.కృష్ణ, నీల్వాయి ఎస్సై నాగరాజు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, భీమారం ఎస్సై రాజేందర్‌తో పాటు సిబ్బందిని జైపూర్ ఏసీపీ అభినందించారు.
