వృద్ధుడిని నరికి చంపిన నిందితుడు అరెస్ట్

వృద్ధుడిని నరికి చంపిన నిందితుడు అరెస్ట్
  • నగదుతో పరారైతుండగా పట్టివేత
  •  బైంసా ఏఎస్పీ అవినాశ్​ వెల్లడి 

భైంసా, వెలుగు:  నిర్మల్ జిల్లాలో వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన డబ్బుల కట్టల ఆధారంగా నిందితుడి గుర్తించారు.  భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు.  కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన బలరాం గౌడ్(70) తెల్లకల్లు బట్టీ నిర్వహిస్తుంటాడు. ఇటీవల కామారెడ్డిలోని తన భూమిని అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచాడు. ఈనెల17న కుటుంబ సభ్యులు వేములవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి బలరాంగౌడ్ హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన సిల్మల సంతోష్​​ను నిందితుడిగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించాడు. 

మద్యానికి బానిసైన సంతోష్​ చోరీలు చేస్తుంటాడు.  ఆ రోజు రాత్రి బలరాం ఇంట్లో ఒక్కడే ఉన్నట్టు తెలుసుకుని వెళ్లాడు.  ఇంట్లోకి రాగా.. ఎందుకు వచ్చావని అతడిని బలరాం  ప్రశ్నించాడు. దీంతో సంతోష్ తన వద్దనున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. బలరాం ప్రతిఘటిస్తూ కిందపడడంతో గొడ్డలితో గొంతుపై నరికి చంపేశాడు. అనంతరం బీరువా పగులకొట్టి అందులోని రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. అనుమానం రాకుండా ఉండేందుకు గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ చేసి వెలిగించి పారిపోయాడు.  

సిలిండర్ పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మూడు పోలీసు బృందాలు, క్లూస్ టీంతో దర్యాప్తులో భాగంగా నిందితుడు సంతోష్ ఇంట్లో నగదును గుర్తించి విచారించగా అతని తల్లి పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఇంట్లోని డబ్బులను స్వాధీనం చేసుకోగా..వాటిపై కామారెడ్డి జిల్లా మాచారం ఎస్బీఐ బ్యాంక్  లేబుల్ గుర్తించారు. బుధవారం 
 నిందితుడిని అరెస్టు చేసి రూ.1.50 లక్షల నగదు, రెండు కత్తులు, గొడ్డలి, మొబైల్​స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.  బైంసా టౌన్, రూరల్ సీఐలు గోపీనాథ్, నైలు, కుభీర్ ఎస్ఐ కృష్ణరెడ్డి ఉన్నారు.