హుజూరాబాద్‌‌‌‌ బై ఎలక్షన్ కోసం ఈసీ ఆరా..

హుజూరాబాద్‌‌‌‌ బై ఎలక్షన్ కోసం ఈసీ ఆరా..
  • హుజూరాబాద్‌‌‌‌ల ఎట్లుంది?
  • సెగ్మెంట్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌, ప్రస్తుత పరిస్థితేంటో రిపోర్ట్‌‌‌‌ పంపండి: ఈసీ

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గ ప్రొఫైల్, ప్రస్తుత పరిస్థితేంటో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)​ను తాజాగా ఆదేశించింది. అక్కడేమైనా ప్రత్యేక సమస్యలున్నా  చెప్పాలంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత నెల 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ సెగ్మెంట్‌‌‌‌కు బై ఎలక్షన్ తప్పనిసరి అయింది. ఆ సీటు ఖాళీ అయినట్టు సీఈవో కూడా ఈసీకి రిపోర్టు చేశారు. అయితే అప్పటికే కరోనా సెకండ్‌‌‌‌ వేవ్ విజృంభించడంతో అన్ని రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మే రెండో వారంలో నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా వాటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులు తగ్గడంతో కరోనా వ్యాప్తి తక్కువున్న ప్రాంతాల్లో జాగ్రత్తలతో ఎలక్షన్స్ నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అందులో భాగంగానే హుజూరాబాద్ బై ఎలక్షన్‌‌‌‌కు సంబంధించి రిపోర్టు అడిగినట్లు అధికారులు చెబుతున్నారు.

7 రాష్ట్రాల బై ఎలక్షన్స్‌‌‌‌తో పాటేనా?
రాష్ట్రంలో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను పూర్తిగా ఎత్తేసినందున ఎన్నికలు జరిగే ప్రాంతంలో కరోనా కేసులు, వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలను కూడా ఈసీకి రిపోర్ట్ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఏదైనా కారణంతో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ లెక్కన హుజూరాబాద్‌‌‌‌లో ఎలక్షన్‌‌‌‌కు డిసెంబర్ వరకూ గడువుంది. ఆ లోపు కరోనాతో పరిస్థితులు ఎలా మారతాయో తెలియకపోవడం, ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్​పెట్టాల్సి ఉండటంతో హుజూరాబాద్‌‌‌‌కూ వాటితోపాటే పూర్తి చేయాలని ఈసీ భావిస్తున్నట్టు తెలిసింది.

ఈవీఎం, వీవీప్యాట్‌‌‌‌లు రెడీ చేస్తున్నరు
హుజూరాబాద్‌‌‌‌ బై ఎలక్షన్‌‌‌‌కు ఈసీ ఏ టైమ్‌‌‌‌లోనైనా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉండాలని సీఈవో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు రెడీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రకారం 610 బ్యాలెట్ యూనిట్లు (ఈవీఎంలు), మరో 610 వీవీప్యాట్లు జీహెచ్‌‌‌‌ఎంసీ నుంచి కరీంనగర్‌‌‌‌కు పంపారు. వీటికి ఫస్ట్ లెవెల్ చెకింగ్‌‌‌‌ను త్వరలోనే చేస్తారని తెలిసింది. కరోనా తర్వాత ఈవీఎంలతో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికల కమిషన్‌‌‌‌ షెడ్యూల్ ప్రకారం ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. గతంలో స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలూ అప్పుడే
రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ కోటా, ఒక గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ స్థానానికి జూన్‌‌‌‌ నెలలో పదవీకాలం ముగిసింది. వీటికి ఇప్పటికే ఎలక్షన్స్ పెట్టాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా వేశారు. ఈ ఎన్నికలపైనా ఈసీ వివరాలు తీసుకుంది. బై ఎలక్షన్‌‌‌‌కు షెడ్యూల్ ఇచ్చినప్పుడే వీటికి ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్​ ఫరీదుద్దున్, గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డిల టర్మ్ జూన్ 4న ముగిసింది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మారెడ్డి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పదవీకాలం జూన్ 17న అయిపోయింది.