పిన్నెల్లిని అరెస్టు చేయండి : ఎన్నికల సంఘం

పిన్నెల్లిని అరెస్టు చేయండి : ఎన్నికల సంఘం
  • ఈవీఎం ధ్వంసం ఘటనపై ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం
  • ఎమ్మెల్యేపై లుకౌట్‌‌ నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టడంపై ఈసీ సీరియస్  అయింది. పోలింగ్  రోజు పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్​లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దాంతో ఎమ్మెల్యే తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై టీడీపీ నేత లోకేశ్​​ పెట్టిన ట్వీట్‌‌ను ప్రస్తావించింది. 

ఈ కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌‌కు పిన్నెల్లిపై ఏపీ డీజీపీ హరీశ్  కుమార్  గుప్తా బుధవారం ఓ రిపోర్టు పంపించారు. సీఈఓ ఎంకే మీనా ద్వారా ఆ నివేదిక అందజేశారు. కాగా, పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేస్తూ లుకౌట్‌‌ నోటీసులు జారీ చేశారు.

అలాగే వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్  చేరుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ హరీశ్  కుమార్  గుప్తా పేర్కొన్నారు. పిన్నెల్లి కోసం తెలంగాణలో కూడా గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇస్నాపూర్​లో పిన్నెల్లి అరెస్టు?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణ స్పెషల్  టాస్క్ ఫోర్స్ తో గాలించి ఏపీ పోలీసులు తెలంగాణలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్  సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పటాన్ చెరు పోలీసుల సహకారంతో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, పిన్నెల్లి అరెస్టుపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.