కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఎట్టకేలకూ ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. అదే నెల 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ వెలువడనుండగా.. సెప్టెంబర్ 24న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోగా నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశముంది.

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లినందున వర్చువల్ గా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మధుసూదన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పి. చిదంబరం తదితరులు భేటీలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీలు ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నిజానికి ఆగస్ట్ 21 – సెప్టెంబర్ 20 మధ్యకాలంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని గతేడాది జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్ కు కొంత ఆలస్యంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగనుంది.