ఎన్నికల్లో షేర్​మార్కెట్ ఎందుకు పెరిగింది? ఎందుకు పడిపోయింది?

ఎన్నికల్లో  షేర్​మార్కెట్ ఎందుకు పెరిగింది? ఎందుకు పడిపోయింది?

 ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా విందు భోజనం అందుతుంది’ అనేది నానుడి. కానీ ఇది సహజ న్యాయం కాదు, అందరికీ సమానంగా దక్కాల్సినవి కొందరికే అందడం సరికాదు, ఇదింకా ప్రజాపాలన చూసే రాజకీయాలలో ఉన్నవారు చేయడం శిక్షార్హమైన ద్రోహం. అందుకే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయిస్తూ.. పదవీ బాధ్యతలు చేపట్టే ప్రతీ నేతతో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, బంధుప్రీతి లేకుండా ఉంటానని త్రికరణ శుద్దిగా చెప్పిస్తారు. 

ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వారి హోదాతో సంబంధం లేకుండా శిక్షించాల్సిందే అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెపుతుంది. కానీ దురదృష్టవశాత్తు సాక్షాత్తు ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, ఆ తర్వాత అత్యంత కీలకమైన హోం మంత్రిగా ఉన్న వ్యక్తి దీన్ని కాలరాసి తమ అనుంగు అనుయాయులకు లబ్ది చేకూర్చే విధంగా మాట్లాడారనేది ఆరోపణ. అస్సలు ఎన్నికల ప్రచారానికి ఏమాత్రం సంబంధం లేని విషయాలను జనాల మెదళ్లలోకి ఎక్కించాలని చూసారనేది మేధావులంటున్న మాట. 

దాదాపు కోట్లాది కుటుంబాల పెట్టుబడితో 400 లక్షల కోట్లకు పైగా ఉన్న స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్ని ప్రభావితం చేసి అందులో ప్రధాన భాగస్వాములైన తమ అనుంగు అనుయాయులకు మేలు చేయడానికి మోదీ, అమిత్ షాలు ఈ ఎన్నికల సందర్భాన్ని సైతం వాడుకున్నారనేది చర్చకు  దారితీసింది. మే 13న నిర్వహించిన ప్రచారంలో అమిత్ షా 400 పైచిలుకు స్థానాల్లో గెలుస్తున్నాం. అందుకే ఇప్పుడే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టండి జూన్ 4 తర్వాత విపరీతంగా లాభాలు ఆర్జించండి అని చెబితే, అదే నెల 19న మరో ప్రచారంలో సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ అలాంటి మాటలనే మరోసారి పునరుధ్ఘాటించారనేది అందరికీ తెలిసిన విషయమే.

 ఇలా జూన్ వరకూ సందర్బం చిక్కిన ప్రతీసారి వారి మందీ మార్బలంతో వల్లెవేయించి జనాలలో లేని ఆశలు కల్పించారనేది ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు. వీటిని అదాని కింద పనిచేస్తున్న మీడియా సంస్థల ఇంటర్వ్యూల్లో సైతం చెప్పడంతో మోదీ అనుకూల మీడియా విస్తృత ప్రచారం చేసుకొని లబ్ది పొందడానికి  ఆజ్యం పోశాయి. 

ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

ఎగ్జిట్ పోల్స్ పేరుతో మీడియా సంస్థలు చేసిన అతి ఏంటో ఈరోజు మనందరికీ సుస్ఫష్టంగా అర్థమౌతున్నా.. జూన్ 1, 2, 3 తేదీల్లో ఇన్వెస్టర్ల సెంటిమెంటును ఏ రీతిలో ప్రభావం చేసాయో ఆయా రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీల కదలికలు తెలియజేసాయనేది ప్రస్తుత చర్చ. తమ జేబు సంస్థలుగా ఉండే మీడియా వండివార్చిన కట్టు కథలన్నీ జూన్ 4వ తారీఖు ఫలితాల సరళి వెల్లడైనప్పటి నుంచి తేలిపోయాయి.

 అసలైన సత్యం ఏంటో ప్రపంచానికి తేటతెల్లమైంది, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేసిన పోరాటం నిక్షిప్తం చేసుకున్న ఒక్కో ఈవీఎం లోని ఓట్లు బయటకొస్తూ మోదీ, షా కోటల్ని బద్దలు కొట్టాయి. 400 పైచిలుకు సాధిస్తామని బీరాలు పలికి ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టమన్న చోట సాధారణ మెజార్టీ కూడా దక్కించుకోలేక చతికిల పడి నైతిక అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును విపరీతంగా దెబ్బతీసింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ప్రారంభించాయి. 

ఇన్వెస్టర్ల కష్టార్జితం బూడిదయింది

ఒక్కరోజే అత్యంత భారీస్థాయిలో 6శాతంగా పడిపోయి 2020 తర్వాత 4వ డిజాస్టర్ ను నమోదు చేసుకొంది స్టాక్ మార్కెట్. దేశానికి చెందిన మధ్యతరగతి, ఇతర అల్పాదాయ వర్గాలు ఎక్కువగా ఉండే రిటైల్ ఇన్వెస్టర్లు ఆ ఒక్కరోజే తమ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరులా కోల్పోయారనేది రాజకీయంగా చర్చకు తెరలేపింది. దాదాపు 30 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయి మానసిక వేదనను వారు అనుభవించేలా చేసింది. 

అసహజంగా పడిపోయిన స్టాక్​ మార్కెట్లు

మోదీ హయాంలో కరోనా వార్తలు వెలువడ్డ 23 ఫిబ్రవరి 2020న దాదాపు 13 శాతం, ఆ తర్వాత అవే భయాందోళనలతో లాక్ డౌన్ ప్రకటన పర్యవసానాల్లో 12 మార్చిన 8.3 శాతం, 16 మార్చిన 7.6 శాతంగా స్టాక్ మార్కెట్లు పడిపోయినట్టు సహజంగా జరిగి ఉంటే, నష్టపోయినవారికి సానుభూతి చూపించడంతో సరిపెట్టవచ్చేమో.. కానీ ఇది అలా జరిగింది కాదేమోననే అనుమానాల్ని స్టాక్ మార్కెట్ నిపుణులు, మేధావులు చర్చించుకుంటున్నారు.

నిఘా వ్యవస్థతో ముందే ఫలితాలు తెలుసుకోలేదా?

స్టాక్ మార్కెట్ గణాంకాలు, అందుకు కారణమైన నేతల ప్రకటనలు, దాన్ని అందిపుచ్చుకోవడానికి పెట్టుబడిదారుల చేతుల్లోని మీడియా ప్రచారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇందులో అనుమానాలకు తావిచ్చే మరో అంశం కూడా నేడు దేశ క్షేమాన్ని కాంక్షించేవారి మదిని తొలుస్తోంది. అదేంటంటే, పటిష్టమైన నిఘా వ్యవస్థ, అత్యాధునిక సమాచార సాంకేతికత అందుబాటులో ఉండే కేంద్ర ప్రభుత్వానికి అసలు ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదా?  ఎన్నికల కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ, ఏ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఉంటుందా..? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని బుద్దిజీవుల మాట.

 అందుకే దేశంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని, మోదీ చరిష్మా తగ్గిపోయిందని, తాము చేసే ఏ ప్రచారంతోనూ ఈ పరిస్థితులు మారడం లేదని ఈ ధపా 220 నుంచి 240 స్థానాలకు పరిమితమై పోతారని స్పష్టమైన నివేదికలు ఇంటెలిజెన్స్ నుంచి అందాయనేది మెజార్టీ భావన. మొదటి రెండు విడతల ప్రచారం తర్వాత పూర్తిగా ప్రచార సరళి మారిపోయింది, తమ మూల సిద్ధాంతమైన ద్వేషం రెచ్చగొట్టడంపై ఆధారపడ్డట్టు స్పష్టంగా కనిపించింది.

రూ. 30 లక్షల కోట్ల నష్టం!

ప్రచారానికి, ఓట్లకు సంబంధం లేని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమనే మాటల్ని బలంగా చెప్పి సెంటిమెంట్ రేకెత్తించి, ప్రజల సొమ్ము 30 లక్షల కోట్లు నష్టపోవడానికి కారకులయ్యారనేదే బలమైన ఆరోపణ. దీనికితోడు అతి ముఖ్యమైన అదాని తొమ్మిది కంపెనీల్లో 2019 నుండి 2024 వరకూ షేర్ విలువ అమాంతం పెరిగాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల నష్టాన్ని అధిగమించి ఈ స్థాయికి పెరగడం వెనుక సైతం మదుపరుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. అందుకే రాహుల్ గాంధీ అడిగినట్టు కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలతో కాకుండా పార్లమెంట్ జేపీసీ వేసి విచారణ చేయాలి. వీటి నిజానిజాల నిగ్గుతేల్చి సామాన్య ఇన్వెస్టర్ నమ్మకాలను నిలబెట్టాలి.

చిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్​

ఇలా సెంటిమెంటే బలంగా ఉండే చిన్న ఇన్వెస్టర్లలో ఇండైరెక్టుగా కల్పించిన ఆశలతో నాటి నుండి తాము కష్టపడి సంపాదించిన సొమ్మును రెట్టింపు లాభాలకు ఆశపడి ఇన్వెస్ట్ చేసేలా చేసారు. ఐతే ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ప్రధాని మోదీకి అనుంగు అనుయాయులు ఎవరంటే కార్పొరేట్లనే సమాదానం వస్తుంది, అందులో అదానీ, అంబానీలు అత్యంత ఇష్టులనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యం. దీంతో సామాన్య ప్రజల పెట్టుబడులు అత్యధికంగా ఈ సంస్థల్లోకే మళ్లుతాయనేది ఎవ్వరినడిగినా చెప్పే మాట. 

ఒక రకంగా స్టాక్ మార్కెట్ వర్గాల్లో వినపడే ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారానికి ఏమాత్రం తగనిది ఇదని నిపుణులు చెబుతున్నారు. ఐతే ఈ ప్రహసనం పరాకాష్టకు చేరిన సందర్భం ఏదైనా ఉందంటే అది జూన్ 1 సాయంత్రం పోలింగ్ ముగిసిన దగ్గరి నుంచి జూన్ 4 ఉదయం కౌంటింగ్ ప్రారంభం వరకూ జరిగిందనే చెప్పాలి.

 

  బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిసాట్ నెట్వర్క్,
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక