వెల్దండ మండల ప్రజాప్రతినిధుల తిరుగుబాటు

వెల్దండ మండల ప్రజాప్రతినిధుల తిరుగుబాటు
  • పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా 
  • ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేడు ప్రగతిభవన్​కు పాదయాత్ర   

నాగర్​కర్నూల్, ​వెలుగు: వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ ఎంపిక కల్వకుర్తి టీఆర్ఎస్​లో చిచ్చు రాజేసింది. పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ఏకపక్షంగా ఓ వ్యక్తిని ఎంపిక చేయడం అన్యాయమంటూ వెల్దండ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేశారు. ఆదివారం కల్వకుర్తి నుంచి ప్రగతిభవన్​వరకు పాదయాత్రగా వెళ్తామని ప్రకటించారు. వెల్దండ మండలం టీఆర్ఎస్​లో కీలక నేత, సింగిల్​విండో వైస్​చైర్మన్​ సంజీవ్​యాదవ్​ తన పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలో ఎంపీపీ విజయ జైపాల్​నాయక్, వైఎస్​ ఎంపీపీ శాంతమ్మ, పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొజ్జితో పాటు 18 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ గ్రామ అధ్యక్షులు పార్టీకి రిజైన్​ చేశారు. 

విలువ ఇవ్వడం లేదని నేతల గుర్రు
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​యార్డు పరిధిలో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు, జడ్చర్లకు చెందిన ఒక మండలం, కల్వకుర్తికి చెందిన రెండు మండలాలు వస్తాయి. ఈసారి తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్​ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం. మార్కెట్​చైర్మన్​ ఎంపికలో తమ అభిప్రాయాలకు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని కల్వకుర్తి, వెల్దండ, ఊర్కోండ, చారకొండ మండలాలకు చెందిన సెకండ్​క్లాస్​ లీడర్లు గుర్రుగా ఉన్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఊర్కొండ మండలం నుంచి తమవారికి తగిన ప్రాతినిథ్యం కల్పించాలని అక్కడి ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి కొందరి పేర్లు సూచించారు. అచ్చంపేట, జడ్చర్ల ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లను సర్దుబాటు చేస్టూ కల్వకుర్తి, వెల్దండ మండలాల నుంచి ఆశావహులకు డైరెక్టర్లుగా స్థానం కల్పించాల్సి ఉంటుంది. మార్కెట్​ చైర్మన్​ పదవి రేసులో చాలామంది ఉన్నా ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ మాజీ వైస్​చైర్మన్​ విజయ్​గౌడ్​ వైపు మొగ్గు చూపించారని, తర్వలో విజయ్​గౌడ్​ చైర్మన్​గా ఉత్తర్వులు వస్తున్నాయని ప్రచారం జరిగింది. దీంతో తమతో చర్చించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మిగతా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

500 మందితో పాదయాత్ర 
మండలంలోని మెజార్టీ ఎంపీపీ, వైస్​ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు,18 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు దాదాపు 500 మందితో ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తా నుంచి ప్రగతిభవన్​ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని సంజీవ్ యాదవ్​ చెప్పారు. సీఎం కేసీఆర్​తో తమ బాధలు చెప్పుకుంటామని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.