వారం వ్యవధిలో ముగ్గురు రైతులు మృతి

వారం వ్యవధిలో ముగ్గురు రైతులు మృతి

నిర్మల్,వెలుగు : చేన్ల చుట్టూ అమర్చుతున్న కరెంట్​ కంచెలు ప్రాణాలు తీస్తున్నాయి. విద్యుత్​ అధికారులు హెచ్చరిస్తున్నా.. పోలీసులు కేసులు పెడుతున్నా..  కొందరు పట్టించుకోవడంలేదు. నిర్మల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు కంచెలకు బలయ్యారు. మామడ మండలం పోన్కల్​గ్రామానికి చెందిన మల్లయ్య, బొర్రన్న, రెండు రోజుల క్రితం దిలావర్​పూర్ మండలం కదిలి గ్రామానికి చెందిన రైతు చంద్రకాంత్​కంచెల బారినపడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలతో పోలీసు, విద్యుత్​ శాఖలు అప్రమత్తమయ్యారు. ఆదివారం సోన్​పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. చేలకు అమర్చిన విద్యుత్​తీగలు తొలగించారు. ఒకరిపై కేసు నమోదుచేసి కటకటాల్లోకి పంపారు. ఇక ముందు కరెంట్​కంచెలు ఏర్పాటు చేస్తే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. 

విచ్చలవిడిగా..

మామడ, లక్ష్మణచాంద, కడెం, ఖానాపూర్​, పెంబి, సోన్​తదితర మండలాల్లోని మారుమూల పల్లెల్లోనే అడవి జంతువుల నుంచి రక్షణ కోసం అక్రమంగా కరెంటు కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వణ్య ప్రాణులు మృతిచెందుతున్నాయి. అయినా ఫారెస్ట్ ఆఫీసర్లు అటువైపు దృష్టిసారించడంలేదు. కొందరు ఈ ఘటనలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు పొలాలకు వెళ్తున్న రైతులు కంచెలు అమర్చిన చేలను దాటుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. 

జిల్లాలో మొదటి కేసు..

సోన్ మండలంలో పోలీసు, విద్యుత్తు శాఖ సంయుక్తంగా ఆదివారం దాడులు నిర్వహించారు. సోన్​ గ్రామ శివారులోని పుష్కర ఘాట్ సమీపంలోని చేలకు అక్రమంగా అమర్చిన కరెంటు తీగలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కంచరి వెంకన్న, కంచరి ఊశన్న కట్టెల సహాయంతో చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇకనుంచి తనిఖీలు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. రైతులు పంట చేలను కాపాడుకునేందుకు సోలార్​ఫెన్సింగ్​ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.