ఏసీడీ చార్జీలు రద్దు చేయాలె: విద్యుత్ వినియోగదారులు

ఏసీడీ చార్జీలు రద్దు చేయాలె: విద్యుత్ వినియోగదారులు
  • ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
  • త్రీఫేజ్​సప్లై లేక పంటలు ఎండుతున్నయ్​ 
  • ప్రమాదకరంగా ఉన్న పోల్స్​ మార్చుత లేరు 
  • డబ్బులు కట్టించుకొని ట్రాన్స్​ఫార్మర్​ పెట్టట్లే  
  • సబ్​స్టేషన్​ లేక పవర్​ సప్లై నిలిచిపోతోంది  
  • 'ముఖాముఖి'లో సమస్యలు ఏకరువు పెట్టిన విద్యుత్​ వినియోగదారులు 

మంచిర్యాల, వెలుగు: సామాన్యులపై వేల రూపాయల భారం మోపుతున్న ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని విద్యుత్​ వినియోగదారులు డిమాండ్​ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఉండే ఇంట్లో రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, టీవీ వాడుకుంటే గతంలో రెండు మూడు వందలు బిల్లు వచ్చేదని, ప్రస్తుతం రెండు మూడు వేలు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ ఫంక్షన్​ హాల్​లో జిల్లా విద్యుత్​ వినియోగదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈఆర్​సీ చైర్మన్​ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్​రాజు, బి.కిష్టయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ సమస్యలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. తన ఇంటి వద్ద ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు కోసం లైన్​మెన్​ ద్వారా కాంట్రాక్టర్​ రూ.1.80 లక్షలు తీసుకున్నాడని, ఎనిమిది నెలలు అవుతున్నా ట్రాన్స్​ఫార్మర్​ పెట్టలేదని నస్పూర్​కు చెందిన రాజేంద్రప్రసాద్​ కంప్లైంట్​ చేశాడు. రెండు నెలల కింద రూ.1.60 లక్షలు సంస్థకు డీడీ కట్టినట్టు చెప్పాడని, అధికారులకు ఫిర్యాదు చేస్తానంటే ఎక్కడన్నా చెప్పుకో అంటున్నారని వాపోయాడు. భీమిని మండలం వీగాంకు చెందిన తులసీబాయి, రామగౌడ్​ మాట్లాడుతూ గ్రామంలో వైర్లు లూజ్​గా ఉండడంతో పత్తి, వరిగడ్డి ట్రాక్టర్లకు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు.

పల్లెప్రగతిలో పంచాయతీలో 40 పోల్స్​ ఏర్పాటు చేసి లూజ్​లైన్లు సరిచేయాలని తీర్మానించి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో త్రీఫేజ్​ సప్లై లేకపోవడంతో మోటార్లు నడవడం లేదని, పంటలు ఎంఇపోతున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్​ సర్పంచ్​ సత్యవతి విన్నవించారు. రెబ్బనపల్లికి చెందిన కందుల కల్యాణి గ్రామంలో ఐరన్​ పోల్స్​ ప్రమాదకరంగా ఉండడంతో పశువులు షాక్​తో చనిపోతున్నాయని, వెంటనే పోల్స్​ మార్చాలని డిమాండ్​ చేశారు. తాండూర్​ మండలం అచ్చులాపూర్​కు సర్పంచ్​ దాగం శంకరమ్మ పల్లెప్రకృతి వనంలో బోరుమోటారు కనెక్షన్​ కోసం రూ.1.70 లక్షలు డీడీ కట్టి ఆరు నెలలైనా కనెక్షన్​ ఇవ్వలేదని, మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. జన్నారం మండలం చింతగూడలో 133 కేవీ సబ్​ స్టేషన్​ లేక వ్యవసాయ మోటార్లకు కరెంట్​ సప్లై నిలిచిపోతోందని, నాలుగు గ్రామాలకు ఒక్కరే లైన్​మెన్​ ఉన్నారని, సమస్యలను పరిష్కరించాలని ఆరె శిరీష్​కుమార్​ డిమాండ్​ చేశారు. విద్యుత్​ శాఖ అధికారుల తీరుపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఏసీడీ చార్జీలతో సర్కారుకు సంబంధం లేదు... ఏసీడీ చార్జీలతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఈఆర్​సీ పర్మిషన్​తోనే విద్యుత్​ సంస్థలు వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయని చైర్మన్​ శ్రీరంగారావు అన్నారు. వినియోగదారులు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది డబ్బులు అడిగితే కంప్లైంట్​ చేస్తే ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులకు 040 23311121, 28 నంబర్లకు కాల్​ చేయాలన్నారు.