గాలి తేమతో కరెంట్  పుట్టిచ్చిన్రు

గాలి తేమతో కరెంట్   పుట్టిచ్చిన్రు

    ‘ఎయిర్ జనరేటర్’ను సృష్టించిన సైంటిస్టులు

    బ్యాక్టీరియా సాయంతో విద్యుత్ ఉత్పత్తి 

    గాలి ఉంటే చాలు.. 24 గంటలూ కరెంట్    

జనరేటర్ అంటే.. డీజిల్ కావాలి కదా. డీజిల్ జనరేటర్లు ఇప్పుడు మస్త్ ఉన్నయి కదా? ఇక ఇదెందుకో! అనుకుంటున్నారా.. ఈ జనరేటర్ కు డీజిల్ కూడా అవసరం లేదు. జస్ట్ గాలి ఉంటే చాలని అంటున్నారు. బొగ్గు, నీళ్లతో కరెంట్ తయారీకి రిస్క్ ఎక్కువ. బొగ్గు నిల్వలు తరిగిపోతయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి ముప్పు ఉంటది. అందుకే సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై అన్ని దేశాలు ఫోకస్ పెడ్తున్నయి. కానీ.. వీటికి ఖర్చెక్కువ.. ఫలితం తక్కువ అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. సోలార్ పవర్ కు ఎండ కావాలె. విండ్ పవర్ కు గాలి బలంగా వీచే చోటు దొరకాలె. అందుకే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, టవర్ల వంటివేమీ అవసరం లేకుండా.. చిన్న చిన్న జనరేటర్లతోనే అది కూడా 24 గంటలూ పెద్దగా ఖర్చు లేకుండా కరెంట్ ను తయారు చేసే ‘ఎయిర్ జనరేటర్’ను తాము తయారు చేశామని యూనివర్సిటీ ఆఫ్ మసాచూ సెట్స్ సైంటిస్టులు వెల్లడించారు. ఎంఐటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ డెరెక్ లవ్లీ 1987లో ‘జియోబ్యాక్టర్ మెటాలిరెడుసెన్స్’ను కనుగొన్నారు. ఎలక్ట్రాన్లను ఒకదాని నుంచి మరోదానికి ఈ బ్యాక్టీరియాలు ట్రాన్స్ ఫర్ చేసుకోగలవని తేలింది. ఈ కెపాసిటీ ఉండటం వల్లే ఇవి ఫుడ్ వేస్ట్, మట్టి సాయంతో కరెంట్ ను పుట్టించగలవని కూడా గతంలోనే వెల్లడైంది. అయితే,  గాలిలోని తేమను వాడుకోవడం ద్వారా కరెంట్ ను తయారు చేసేలా ఈ బ్యాక్టీరియా సాయంతో ల్యాబ్ లో కరెంట్ తయారీపై  ఎయిర్ జనరేటర్ ను ఎంఐటీకి చెందిన డెరెక్ లవ్వీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ జున్ యావో టీం దృష్టి పెట్టింది. తాజాగా ఎయిర్ జనరేటర్ ను తయారు చేసి, విజయవంతంగా టెస్ట్ చేసింది.

‘గాలి’ కరెంట్ ఇట్లొస్తది.. 

జియోబ్యాక్టర్ లు ప్రొటీన్ నానోవైర్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ నానోవైర్లు ఎలక్ట్రికల్ కండక్టివ్ (ఎలక్ట్రాన్లను ట్రాన్స్​ఫర్ చేయడం) లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటిని గతంలో పర్యావరణం దెబ్బతిన్నచోట దాన్ని మళ్ళీ పాతస్థితికి తేవడానికి మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్స్ గా, మెక్సికన్ గల్ఫ్​లో ఆయిల్ స్పిల్స్ ను తొలగించేందుకు కూడా ఉపయోగించారు. ఇక ఎయిర్ జనరేటర్ లో సన్నని జియోబ్యాక్టర్ ప్రొటీన్ నానోవైర్లతో చేసిన ఫిల్మ్ ఉంటుంది. ఇది7 మైక్రోమీటర్ల మందమే ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రోడ్ల మధ్యన ఉంచుతారు. బయటి నుంచి వచ్చే గాలి నేరుగా దీనికి తగిలేలా ఉంటుంది. గాలి తగలగానే ఈ ఫిల్మ్ అందులోని తేమను పీల్చుకుంటుంది. దీంతో రెండు ఎలక్ట్రోడ్ల మధ్య కంటిన్యూగా కరెంట్ సరఫరా అవుతూనే ఉంటుంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా పెట్టనవసరంలేదు. గాలిలో పెద్దగా తేమ ఉండాల్సిన అవసరం కూడా లేనందున.. వీటిని ఇంట్లో పెట్టుకుని కూడా కరెంట్ తయారు చేసుకుని వాడుకోవచ్చని చెప్తున్నారు.

 

అనుకోకుండానే కనిపెట్టిన్రు..

ఈ ఎయిర్ జనరేటర్ ను తాము అనుకోకుండానే కనిపెట్టామని జున్ యావో వెల్లడించారు. జియోబ్యాక్టర్ ఉత్పత్తి చేసే ప్రొటీన్ నానోవైర్లపై రకరకాలుగా ప్రయోగాలు చేస్తుండగా… వీటిని ఎలక్ట్రోడ్లతో కలిపినప్పుడు కరెంట్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. గాలిలోని తేమను పీల్చుకుని ఈ నానోవైర్లు డివైస్ అంతటా కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయన్నారు. ఈ డివైస్ కంటిన్యూగా 0.5 వోల్టుల కరెంట్ తయారు చేస్తోందన్నారు. ఇండస్ట్రీలలో వాడకం కోసం డివైస్ ను డెవలప్ చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున గాలి కరెంట్ తయారీపై దృష్టి పెడతామన్నారు.