ఆన్‌‌లైన్‌‌లోనే విద్యుత్​ హెచ్‌‌టీ లైన్‌‌ స‌‌ర్వీసు సేవ‌‌లు

ఆన్‌‌లైన్‌‌లోనే విద్యుత్​ హెచ్‌‌టీ లైన్‌‌ స‌‌ర్వీసు సేవ‌‌లు
  •  ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ప్రత్యేక  పోర్టల్‌‌ను రూపొందించిన విద్యుత్తు సంస్థలు
  • ట్రాన్స్‌‌కో, డిస్కంల మధ్య ఇక ఆన్‌‌లైన్ కార్యకలాపాలు

హైదరాబాద్‌‌, వెలుగు: హైటెన్షన్‌‌ లైన్లకు సంబంధించి విద్యుత్తు సరఫరా సేవలను రాష్ట్ర సర్కారు  ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసేవ‌‌ల‌‌కు సంబంధించిన ఆన్‌‌లైన్ పోర్టల్​ను బుధవారం మింట్‌‌ కాంపౌండ్‌‌ సదరన్‌‌ డిస్కం కార్పొరేట్‌‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  స్విచ్ఛాన్​ చేసి లాంఛ‌‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అత్యంత ఎక్కువ వోల్టేజీ కలిగిన కరెంటును  సరఫరా చేసే హైటెన్షన్‌‌ లైన్లకు సంబంధించి కొత్త కనెక్షన్లు, హైటెన్షన్‌‌ సామర్థ్యం పెంచుకునే సేవలు  ఆన్‌‌లైన్‌‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 

ఈ పోర్టల్ ద్వారా ఇక నుంచి వినియోగ‌‌దారుల‌‌కు పార‌‌ద‌‌ర్శకంగా వేగ‌‌వంతమైన సేవ‌‌లు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా డిస్కంలు,  ట్రాన్స్‌‌కో ల మధ్య కార్యకలాపాలు సైతం ఆన్‌‌లైన్‌‌ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సేవలన్నింటినీ  సులభతరం చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా  సాఫ్ట్‌‌వేర్‌‌ను రూపొందించిన సదరన్‌‌ డిస్కం ఐటీ సీజీఎం వ‌‌ట్టికొండ శివాజీ , బండారి ముర‌‌ళీకృష్ణ,  జ్యోతిర్మయి, సీహెచ్ ర‌‌మ‌‌శ్రీ,  పీ అశోక్‌‌, డీ రాధిక‌‌, కే ర‌‌ఘుకిర‌‌ణ్‌‌, ఈ లక్ష్మీనారాయ‌‌ణ‌‌, సాయికిర‌‌ణ్​, ట్రాన్స్‌‌కో  ఎస్‌‌ఈ రాజ్యల‌‌క్ష్మి తదితర అధికారుల‌‌ను ఈ సంద‌‌ర్భంగా భట్టి విక్రమార్క అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ సీఎండీ సయ్యద్‌‌ ముర్తుజా రిజ్వీ, సదరన్‌‌ డిస్కం సీఎండీ ముషారఫ్‌‌ ఫరూకీ పాల్గొన్నారు. 

హెచ్‌‌టీ వినియోగదారులకు ఉపయోగం..

పరిశ్రమలు, పలు కంపెనీలు వినియోగించే అత్యధిక సామర్థ్యం కలిగిన 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ కొత్త స‌‌ర్వీసుల‌‌ను, అదే విధంగా 11 కేవీ/ 33 కేవీ కొత్త స‌‌ర్వీసుల‌‌ను, ఈహెచ్‌‌టీ నుంచి హెచ్‌‌టీ స‌‌ర్వీసుల‌‌ను మార్చుకునేందుకు ఆన్‌‌లైన్‌‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం గ‌‌తంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆన్‌‌లైన్ లో అప్లికేషన్‌‌ పెట్టుకుంటే   ఎల్టక్ట్రిసిటీ అధికారులు గడువులోగా పరిశీలించి అనుమతిస్తారు. 

ప్రత్యేక సాఫ్ట్​వేర్​ రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సేవ‌‌లతో  ఆన్‌‌లైన్ పోర్టల్‌‌లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకున్న వినియోగ‌‌దారులు  రోజువారీగా అప్లికేషన్‌‌ స్టేటస్‌‌ తెలుసుకునే అవకాశం  ఉంటుంది. విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్లికేషన్లను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అన్ని ర‌‌కాలైన అనుమ‌‌తులు తీసుకొని అధికారులు దర‌‌ఖాస్తును వేగ‌‌వంతంగా పరిష్కరించే ప్రక్రియ‌‌ను పూర్తి చేస్తారు.

దరఖాస్తు చేసుకునే వెబ్‌‌సైట్లు ఇవే..

ట్రాన్స్ కో (www.tstransco.in), సదరన్‌‌ డిస్కం (www.tssouthernpower.com), నార్తర్న్​ డిస్కం  (www.tsnpdcl.in) పోర్టల్​లో ఆన్‌‌లైన్‌‌ ద‌‌ర‌‌ఖాస్తు చేసుకొని విద్యుత్తు కొత్త కనెక్షన్‌‌, లైన్ల త‌‌ర‌‌లింపు, మ‌‌ళ్లింపు ప్రక్రియ‌‌ను  వినియోగ‌‌దారులు స‌‌ద్వినియోగం చేసుకోవచ్చు. డిస్కం, ట్రాన్స్‌‌కోల మధ్య కార్యకలాపాలు ఇక ఆన్‌‌లైన్‌‌లోనే నిర్వహించనున్నారు. 

ప్లాన్​తో వస్తే భద్రాచలానికి ఫండ్స్ ఇస్తం

భద్రాచలం ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలతో రావాలని, ఫండ్స్ కేటాయించేందుకు ప్రభుత్వం రెడీగా  ఉందని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ లో  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీరామనవమి, పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవాలయం చుట్టూ రెండు ప్రాకారాలు, రోడ్డు నిర్మాణానికి అధికారుల వద్ద ఉన్న ప్రణాళికలపై రివ్యూ చేశారు.

 ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి ఇంజినీరింగ్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.  సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, భద్రాచలం టెంపుల్ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.