ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్

ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్
  • రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టివేత

వంగూరు, వెలుగు: కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలంలో విద్యుత్​ శాఖ లైన్​మెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో కొత్త ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు కోసం రూ.4,900 చొప్పున 4 డీడీలు కట్టాడు. కొత్త ట్రాన్స్ ఫార్మర్  ఇవ్వమని లైన్​మెన్  నాగేందర్ ను రైతు కోరగా, రూ.20 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ ఫార్మర్, పోల్స్  ఇస్తానని చెప్పడంతో రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. 

ఆ తరువాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం లైన్​మెన్  నాగేందర్ కు రూ.15 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నారు. నాగేందర్​ను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామని డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.

సిరిసిల్లలో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్.. 

రాజన్నసిరిసిల్ల: సిరిసిల్లలో లంచం తీసుకుంటూ సర్వేయర్  ఏసీబీకి చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 123లో ఇరుకుల్ల ప్రవీణ్​కు చెందిన మూడెకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్  వేణు రూ.30 వేలు డిమాండ్  చేశాడు. సర్వే చేయాలంటే ముందుగా రూ.10 వేలు చెల్లించాలని, సర్వే అయ్యాక రూ.20 వేలు ఇవ్వాలని షరతు విధించాడు. 

దీంతో రైతు ప్రవీణ్​ సర్వేకు ముందే రూ. 10 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని వేధించడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం రూ.20వేలు ఇవ్వగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.