- ఫెస్టివల్ షాపింగ్లో ఎలక్ట్రానిక్స్‌కు ఎక్కువ డిమాండ్
- భారీగా ఫోన్ల కొనుగోళ్లు
- టైమ్స్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా అన్ని ఈ–కామర్స్ ప్లాట్‌ఫారాలు ఫెస్టివల్స్ సేల్స్‌ను మొదలుపెట్టాయి. డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తున్నాయి. దీంతో షాపర్లు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆన్‌లైన్ పండుగ విక్రయాల మొదటి వారంలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొన్నారు. తరువాత స్థానంలో మొబైల్ ఫోన్లు ఉన్నాయని రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పండుగ కోసం సంప్రదాయ దుస్తుల కంటే ఎలక్ట్రానిక్స్‌కే గిరాకీ ఎక్కువ ఉంది. ఫెస్టివల్ సీజన్ మొదటివారంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.54,500 కోట్లపైగా విలువైన ఆర్డర్లు సంపాదించాయి.
మన దేశంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ డేటా తెలిపింది. అమ్మకాలు ఈసారి వార్షికంగా 26శాతం పెరిగాయి. కస్టమర్లు తమ షాపింగ్ ఖర్చులో దాదాపు 60శాతం మొత్తాన్ని మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం పెడుతున్నట్టు తేలింది. మొబైల్ఫోన్లలో ఐఫోన్ 15తోపాటు దాని పాత మోడల్స్హాట్కేకుల్లా అమ్ముడయ్యాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఎనలిస్టు శుభమ్ సింగ్ పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్‌లో శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ వంటి ఫోన్లు బాగా అమ్ముడుపోయాయని వివరించారు. కొత్త మోడల్ వచ్చిన తర్వాత మునుపటి మోడళ్ల ధరల తగ్గుదల కారణంగా ఐఫోన్ విక్రయాలు పెరిగాయి. సాధారణంగా రూ.30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న మొబైల్ ఫోన్లు పండుగ సీజన్‌లో డిస్కౌంట్ల బాగా అమ్ముడవుతాయని శుభమ్ చెప్పారు.
టీవీలు, ఫ్రిజ్‌లకు ఫుల్లు గిరాకీ..
కన్జూమర్ డ్యూరబుల్స్ సెగ్మెంట్‌ను గమనిస్తే స్మార్ట్‌టీవీలు, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లు వంటి ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉన్నాయి. మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే, సగానికి పైగా కొనుగోలుదారులు, ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాలవాసులు నెలవారీ ఈఎంఐ విధానంలో ఎక్కువగా కొంటున్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో దాదాపు 70శాతం, టీవీల్లో దాదాపు 80శాతం ఆర్డర్లు వచ్చాయని అమెజాన్తెలిపింది. మొదటి 48 గంటల్లోనే సుమారు 11 కోట్ల మంది అమెజాన్సైట్, యాప్‌ను చూశారని, ఎనిమిది వేల మంది రూ.లక్ష విలువైన షాపింగ్ చేశారని పేర్కొంది. ల్యాప్‌టాప్స్, టీవీలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, కిరాణా సరుకులు వంటి సెగ్మెంట్లలో 25 వేలకు పైగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రకటించింది.