లండన్: ఆ రోజు సోమవారం. లండన్‌లోని ఎలిఫెంట్ అండ్ క్యాసల్ రైల్వే స్టేషన్. మూడు షాపుల్లో పేలుడు జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగ కమ్మేసింది. ఎవరికి వారు బయటకు పరుగెత్తుకు వస్తున్నారు. కానీ ఇద్దరు చిన్నారులు అక్కడే చిక్కుకుపోయారు. అయ్యో.. ఎలాగా? అనుకుంటున్న టైమ్‌లోనే ఓ పోలీస్ ఆఫీసర్ వెళ్లి వాళ్లిద్దరినీ పట్టుకొచ్చేశాడు. ఆ ఆఫీసర్ చిన్నారులను ఎత్తుకొని బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఆయనను హీరో కాప్ అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ఆయన సాహసాన్ని ప్రభుత్వం గుర్తించాలంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెంటనే 15 ఫైరింజన్లు, 100 మంది సిబ్బంది వచ్చారు. కొన్ని గంటలపాటు కష్టపడి మంటలను కంట్రోల్చేశారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురికి ఆ ప్రాంతంలోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఒకరిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
