గుంపులో గున్నలెక్కువైతే పరేషాన్‌‌

గుంపులో గున్నలెక్కువైతే పరేషాన్‌‌

ఏనుగులు సాధారణంగా భయపడవు. అవి గుంపులుగా వచ్చాయంటే అందరూ హడలి పోవాల్సిందే. అయితే తల్లి ఏనుగులు కొన్ని సమయాల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతాయని ఇటీవల రిలీజ్​చేసిన ఓ స్టడీలో వెల్లడైంది. గుంపులో గున్న ఏనుగులు ఎక్కువగా ఉన్నప్పుడు తల్లులు ఒత్తిడికి గురవుతాయని ఇందులో తేలింది. కానీ యుక్త వయసులో ఉండే ఆడ ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది. మగ పిల్ల ఏనుగుల సంఖ్య, యుక్త వయసులోని ఆడ ఏనుగుల సంఖ్య,  సీజన్లు, అవి పిల్ల తల్లులుగా ఉండే సమయం.. ఈ నాలుగూ తల్లి ఏనుగుల సైకలాజికల్ స్ట్రెస్​పై ప్రభావం చూపుతాయని ఈ స్టడీ చెప్పింది.  బెంగళూర్​లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్​సైన్స్​(ఐఐఎస్​) సైంటిస్టులు ఏసియన్​ఆడ ఏనుగులపై ఈ పరిశోధన చేశారు.

‘‘గుంపులో గున్నలు ఎక్కువగా ఉంటే వేటాడే జంతువుల నుంచి ముప్పు ఉంటుంది. ఆ సమయంలో తల్లి ఏనుగులు మరింత జాగ్రత్తగా ఉంటాయి. అదే యంగ్​లేడీ ఎలిఫెంట్స్​ఉంటే ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే అవి ముప్పును ఎదుర్కోగలవు”అని శాస్త్రవేత్తల్లో ఒకరైన సంజితా శర్మ చెప్పారు. శాస్త్రవేత్తలు ఆడ ఏనుగుల్లోని ఎఫ్​జీసీఎం హార్మోన్​ను సేకరించి ఈ స్టడీ చేశారు. దక్షిణ భారతదేశంలోని బందీపూర్, నాగర్​హోల్​జాతీయ పార్కుల్లోని123 ఏనుగుల నుంచి145 శాంపిళ్లను సేకరించారు. 2013–2015 మధ్య వీటిని తీసుకున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎఫ్​జీసీఎం లెవల్స్​ఎక్కువగా ఉంటాయని, అదే ఆగస్టు నుంచి డిసెంబర్​వరకు తక్కువగా ఉంటాయని స్టడీలో తేలింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎఫ్​జీసీఎం లెవల్స్​మిగతా వాటితో పోలిస్తే తల్లి ఏనుగుల్లోనే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఏనుగుల సైకలాజికల్​హెల్త్​పై ప్రభావం చూపే అంశాలను అంచనా వేయడానికి ఈ స్టడీ ఉపయోగపడుతుందని సంజిత పేర్కొన్నారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి