వీడియో: కాన్వాస్‌పై ఏనుగు ఆర్ట్.. నెటిజన్లు సీరియస్

వీడియో: కాన్వాస్‌పై ఏనుగు ఆర్ట్.. నెటిజన్లు సీరియస్

బ్యాంకాక్: ఏనుగు తొండంతో బ్రష్ పట్టింది. కాన్వాస్‌పై అందమైన పెయింటింగ్ వేసింది. థాయ్‌లాండ్‌లో మైతంగ్ ఎలిఫెంట్ క్యాంప్ కోసం విరాళాలు సేకరించేందుకు ఆ గజరాజు వేసిన ఆర్ట్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేసి రూ.4 లక్షలకు అమ్మారు. ఆ ఎలిఫెంట్ ఆర్గనైజేషన్‌లోని తొమ్మిది సంవత్సరాల వయసున్న నాంగ్‌థన్వా అనే ఏనుగు ఈ ఆర్ట్ వేసింది. దానితో మావటి దగ్గరుండి బ్రష్ పట్టించి పెయింటింగ్ చేయిస్తుంటే వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ‘నవ్‌దిస్ (NowThis)’ అనే వార్తా సంస్థ తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో బుధవారం పోస్ట్ చేసింది. ఈ వీడియోకు శుక్రవారం ఉదయం వరకు 86 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు హింస ఆపాలంటూ అనేక మంది ట్వీట్లు చేశారు. ఆ ఏనుగును టార్చర్ చేస్తూ దానిని ప్రమోట్ చేయడం తప్పని, ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని, జంతు హింసను ప్రమోట్ చేయొద్దని కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఏనుగు దానంతటదే బ్రష్ పట్టుకుని పెయింట్ చేస్తే ఓకే కానీ, ట్రైనర్ పక్కనుండి గీయించడమంటే దానిని ఫోర్స్ చేయడమేనని మరికొందరు ఫైర్ అయ్యారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే దేవుడి సృష్టిలో ఇదో అద్భుతమని, దీనిని ఎంజాయ్ చేయాలంటూ రెస్పాండ్ అయ్యారు.