కాళేశ్వరంపై మాట తప్పుతున్న సీఎం రేవంత్ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాళేశ్వరంపై మాట తప్పుతున్న సీఎం రేవంత్ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, మిషన్ భగీరథ, పలు బ్యారేజీల కుంగుబాటు వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించకపోవడం అనుమానాలకు తావిస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నిర్మల్​లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

బీఆర్ఎస్​తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై విచారణకు వెనుకడుగు వేస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై విచారణ జరిపిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం దాటవేత వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. ఓఆర్ఆర్‌, ఫార్మసిటీ వంటి వ్యవహారాల్లో ఆయన రోజుకోతీరు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు సాయం అందించలేదన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా భూముల అక్రమాలపై ఇప్పటివరకు సీఎం రేవంత్​రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన ప్రవర్తన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలోని బడా బాబులతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, సీనియర్ నాయకులు గంగన్న, ముత్యం రెడ్డి, జమాల్ పాల్గొన్నారు.