
హైదరాబాద్, వెలుగు: ఎలైట్ విమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (రైల్వేస్) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ టీమ్ బాక్సర్లు మూడు గోల్డ్ సహా మొత్తం తొమ్మిది మెడల్స్ సొంతం చేసుకున్నారు.
స్టార్ బాక్సర్లు నీతు ఘంఘాస్, లవ్లీనా బొర్గొహైన్, సవీటీ బూర గోల్డ్ మెడల్స్ నెగ్గగా, ఫైనల్లో వాకోవర్ ఇచ్చిన తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ సిల్వర్ అందుకుంది. ముక్కుకు గాయం అవ్వడంతో రైల్వేస్ బాక్సర్ జ్యోతితో 51 కేజీ ఫైనల్ బౌట్‌లో నిఖత్ బరిలోకి దిగలేదు.
మంగళవారం (జులై 01) జరిగిన 48 కేజీ ఫైనల్లో నీతు (హర్యానా) 4–1తో చంచల్ (సాయ్)పై నెగ్గగా, సవీటీ ( సాయ్, 80 కేజీ) 5–0తో అల్ఫియా (రైల్వేస్)పై గెలిచింది. తన ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో లవ్లీనా (టాప్స్, 75 కేజీ) గోల్డ్ అందుకుంది. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్లు గోనెళ్ల నిహారిక (60కేజీ), యషి శర్మ (65 కేజీ) కాంస్య పతకాలు గెలిచారు. గోల్డ్, సిల్వర్ నెగ్గిన బాక్సర్లు పటియాలాలో జరిగే నేషనల్ క్యాంప్‌కు క్వాలిఫై అయ్యారు.