భారీ స్థాయిలో ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు..!

భారీ స్థాయిలో ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు..!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత కంపెనీ పాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతమున్న ఉద్యోగులను తీసివేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. వారిలో దాదాపు 75శాతం మందిని మస్క్ వదిలించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా నవంబర్ 1లోగా పూర్తి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే  సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల అధిపతులను మస్క్ తొలగించారు.

ఇటీవలే 3.4 లక్షల కోట్ల డీల్ ను మస్క్ పూర్తి చేశారు. ఇప్పటికే కంటెంట్ మోడర్నైజేషన్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన మస్క్... రానున్న రోజుల్లో 75శాతం మంది ట్విట్టర్ వర్క్ ఫోర్స్ ను తొలగించవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం 75 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామంటూ వచ్చే వార్తల్లో వాస్తవం లేదని మస్క్ చెప్పారు. కానీ ప్రస్తుతం వచ్చే వార్తలను బట్టి చూస్తే.. నిజంగానే ఉద్యోగుల్లో కోత ఉండొచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.