ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ .. ట్రంప్కు ఎలాన్ మస్క్ భారీ షాక్ !

 ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ .. ట్రంప్కు ఎలాన్ మస్క్ భారీ షాక్ !

అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత, డాడ్జ్ మాజీ చీఫ్ ఎలాన్ మస్క్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇన్నాళ్లుగా ట్రంప్ ప్రభుత్వంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని శాసించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త బిల్లు విషయంలో విభేదించి దూరమైన విషయం తెలిసిందే. అంతకు ముందు కొన్నాళ్లు జోడెద్దులు సవారీ చేసినట్లుగా ఒకే దారిలో నడిచిన వీరిద్దరి మైధ్య వైరం ఇప్పుడు మరింతగా ముదురుతోంది. ఆ బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానని ఏకంగా మస్క్ హెచ్చరించడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ పేరున అధ్యక్షుడు ట్రంప్  తెచ్చిన కొత్త బిల్లుకు సోమవారం (జులై 01) ఫైనల్ ఓటింగ్ ఉన్న సందర్భంగా  మస్క్ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తెచ్చే బిల్లును ‘‘బానిసత్వ బిల్లు’’ గా పరిగణించారు. ఒకవేళ బిల్లు పాసైతే ‘అమెరికా పార్టీ’ తీసుకొస్తానని హెచ్చరించారు. 

మస్క్ గత ఎన్నికల్లో ట్రంప్ కు మద్ధతు ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ అన్నీ తానై అన్నట్లుగా ముందుండి ప్రచారం చేశారు. అందుకోసం 250 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు మస్క్. అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న టాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వలన అమెరికా ఎకానమీకి 3 ట్రిలియన్ డాలర్ల అప్పు అదనంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత బిల్లు సాధారణ అమెరికా పౌరులపై దారుణ ప్రభావం చూపిస్తుందని వారిస్తున్నారు. 

బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయ్యేందుకు జులై 4 డెడ్ లైన్ ఉన్న సందర్భంగా.. సోమవారమే బిల్లును పాస్ చేయించేందుకు ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పాక్షికంగా గత నెల బిల్లును సభ ఆమోదించింది. అయితే మార్పులు చేర్పులతో సెనేట్ బిల్ ఫైనలైజ్ చేస్తే.. చట్టంగా తీసుకురానుంది

బిల్లులో ఏముంది:

వన్  బిగ్ బ్యూటిఫుల్ బిల్ (One Big, Beautiful Bill) పేరున ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు రక్షణ రంగంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. డిఫెన్స్, ఎనర్జీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం ఎక్కువ నిధులను సమకూరుస్తుంది. అదే క్రమంలో న్యూట్రిషన్ (పోషణ), హెల్త్ కేర్ (ఆరోగ్యం) మొదలైన రంగాలకు బడ్జెట్ లో కోతలు విధిస్తుంది. అయితే బడ్జెట్ లెక్కల అంచణా ప్రకారం.. ఎకానమీకి ఈ బిల్లు 3 ట్రిలియన్ డాలర్లకు పైగా లోటు ఏర్పడుతుంది. వెయ్యి పేజీల బిల్లులో ప్రతీ అంశమూ దేశానికి హానికరమైనదేనని.. లక్షలాది ఉద్యోగాలు మాయం కావచ్చునని మస్క్ హెచ్చరిస్తున్నారు.

ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం:

మొదట్లో  ట్రంప్‌కు సలహాదారుగా పనిచేసిన ఎలాన్ మస్క్.. కొత్త బిల్లుపై  తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "అధికార ఎన్నికల ప్రచారంలో ఖర్చులు తగ్గిస్తామంటూ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద అప్పు తీసుకునే విధంగా ఓటేయడం అవమానకరం. అలాంటి బిల్లు వస్తే ప్రతీ కాంగ్రెసు సభ్యుడు తలదించుకోవాలి. అది నేను చేసే చివరి పని అయినా సరే, వాళ్లను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు నేను పోరాడతా.. నేనే అమెరికన్ పార్టీ పెడతా" అంటూ తన ఎక్స్  వేదికగా హెచ్చరిక జారీ చేశారు మస్క్.

 "ఈ అనాలోచిత, వృథా వ్యయాలతో కూడిన బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే, వెంటనే 'అమెరికన్ పార్టీ'ని స్థాపిస్తా. డెమోక్రట్స్-రిపబ్లికన్స్ లాంటి రెండు పార్టీల వ్యవస్థకు ప్రత్యామ్నాయ పార్టీగా తీసుకొస్తా.. ప్రజలకు నిజమైన గొంతక కావాలంటే కొత్త రాజకీయ వేదిక అవసరం," అని మస్క్ స్పష్టం చేశారు.