ఈ నెలలో కూడా సర్కార్ ఉద్యోగులకు జీతాలు లేట్

ఈ నెలలో కూడా సర్కార్ ఉద్యోగులకు జీతాలు లేట్
  • ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు.. 20వ తేదీ దాకా చెల్లింపులు
  • సొంత ఆదాయం రూ. 12 వేల కోట్లలోపే  
  • ఇబ్బందికరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 
  • అప్పు పుట్టకపోవడంతో ఆర్బీఐ నుంచి చేబదులు
     

హైదరాబాద్ : జూన్ నెలలో కూడా సర్కార్ ఉద్యోగులకు జీతాలు లేట్ కానున్నాయి. జీతాలు, ఆసరా పెన్షన్లతో పాటు రైతుబంధుకు జూన్​లో పైసలు సర్దుబాటు చేయాల్సి ఉండటంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో జీతాలు ఇవ్వాలని, మొత్తంగా 20వ తేదీ దాకా అన్ని జిల్లాల్లో జీతాల చెల్లింపులు పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఇప్పటికే అన్ని రకాల బిల్లులను పెండింగ్​లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అత్యవసరమైన జీతాలు, రైతుబంధు, ఆసరా పెన్షన్లకు చెల్లింపులపై మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు ఈ మూడింటికి ఎలా అయినా నిధులు సర్దుబాటు చేసుకోవాల్సి ఉండటం, మరోవైపు కొత్త అప్పులు పుట్టకపోవడంతో రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదులు తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.  
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రాష్ట్ర సర్కార్​కు అప్పు పుట్టడం లేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.  రెండు నెలలు ప్రభుత్వం ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ జూన్​లో రైతుబంధు కూడా ఉండటం, రాష్ట్ర సొంత ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో దీనిపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఇంటర్నల్ రివ్యూ చేశారు. అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడంతో అన్ని బిల్లులు ఆపేసి ముఖ్యమైన రైతుబంధు, ఆసరాకు నిధులు సర్దాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే విషయంపైనా చర్చ వచ్చినప్పటికీ.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందనే సంకేతాలు వస్తాయని ఆ విషయాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది. ఒక్కసారిగా అప్పులు ఆగిపోవడంతో.. రాష్ట్ర సర్కార్​కు అసలు తత్వం బోధపడుతున్నదని ఆర్థిక శాఖ అధికారులే చర్చించుకుంటున్నారు.  
 

పోయిన నెల కన్నా లేట్ 
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను పోయిన నెల లెక్కన.. ఈ సారి కూడా లేట్​గానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో స్టార్ట్ చేసి.. 20వ తేదీ వరకు చెల్లింపులు చేయనున్నారు. పెన్షన్లు కూడా అదే లెక్కన ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రతినెలా రూ.4 వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్లు అవసరం అవుతాయి. కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్​లో రాష్ట్ర సర్కార్​కు రూ.9 వేల కోట్ల రాబడి వచ్చింది. ఇటీవల మద్యం ధరలు, ఆర్టీఏ చార్జీలు పెంచడంతో కాస్త పెరిగి, రూ.12 వేల కోట్ల దాకా వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. జీతాలు, ఆసరా, రైతుబంధు, వడ్డీ చెల్లింపులకు దాదాపు రూ.14 వేల కోట్లు అవసరం కానున్నాయి. మిగతా వాటితో కలుపుకుంటే దాదాపు రూ.25 వేల కోట్లు కావాలని చెప్తున్నారు. జూన్ నెలలోనూ అప్పు పుట్టకపోతే ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (చేబదులు), ఓవర్ డ్రాఫ్ట్​(ఓడీ) తీసుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద రూ.1,728 కోట్లు తీసుకునేందుకు లిమిట్ ఉంది. జూన్​లో ఓవర్ డ్రాఫ్ట్ కింద మరో రూ.2 వేల కోట్లు సమకూర్చునేలా ప్లాన్ చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే వీటికి ఆర్బీఐ ఓకే చెప్పాల్సి ఉంటుంది.
 


రైతుబంధు, ఆసరా కూడా అట్లనే 
జూన్ లో రైతుబంధు కింద రూ.7,400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. గత ఏడాది జూన్ లో15 నుంచి రైతుబంధు పైసలు జమ చేస్తూ వచ్చింది. ఈ సారి కూడా జూన్​ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఎకరాకు రూ. 5 వేల పెట్టుబడి సాయం జమ చేయడం ప్రారంభించాలని సోమవారం ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఎకరా నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల వరకు విడతల వారీగా.. ఆ తర్వాత 10 ఎకరాలు, ఆ పైన రైతులకు పైసలు జమ చేసేలా ప్లాన్​ చేశారు. ఆసరా కోసం ప్రతినెలా రూ.900 కోట్లు అవసరం కాగా, ఈ పైసలను కూడా నెలాఖరున ఇస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -

ప్రభుత్వ ఆఫీసుల్లో రూ.17 వేల కోట్ల కరెంట్ బకాయిలు..!


దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదు