టెక్నాలజీ : జీమెయిల్​లో ఎమోజీ

టెక్నాలజీ  : జీమెయిల్​లో ఎమోజీ

కొందరు వాట్సాప్​లో ఎమోజీలు తెగ వాడతారు. మెసేజ్​లకు షార్ట్​కట్​లో సమాధానం ఇవ్వాలంటే టక్కున ఎమోజీలను నొక్కే అలవాటు ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఈ ఎమోజీలు జీమెయిల్​కి కూడా వచ్చేశాయి. 

ఆండ్రాయిడ్ ఫోన్​లలో జీమెయిల్​ యాప్​లో ఎమోజీలు అందుబాటులోకి రాబోతున్నాయి. తర్వాతి రోజుల్లో వెబ్, ఐఒఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తాయి.  మెయిల్ రాగానే రిప్లై మెయిల్ ఇవ్వడానికి కొన్నిసార్లు టైం పట్టొచ్చు. అలాంటప్పుడు ఎమోజీలు ఉపయోగపడతాయి. ఇ–మెయిల్​ కింద ‘యాడ్ ఎమోజీ రియాక్షన్’ బటన్ ఉంటుంది. దాంతో నచ్చిన ఎమోజీని సెలక్ట్ చేసి, యాడ్ చేయొచ్చు. గ్రూప్​ మెయిల్స్​కి అయితే ‘ఎవ్రీ వన్స్ రియాక్షన్స్’ సెలక్ట్ చేయాలి.

అయితే గ్రూప్​లో ఇరవై కంటే ఎక్కువమంది ఉంటే ఎమోజీ రియాక్షన్​ ఇవ్వడం కుదరదు. ఎమోజీలతో రియాక్షన్ ఇచ్చిందెవరో తెలుసుకోవాలంటే దాని మీద కాసేపు నొక్కి పట్టాలి. అవసరమైతే అదే రియాక్షన్​ని గ్రూప్​లో ఇతరులకు పంపించొచ్చు. మోర్​ బటన్​ మీద నొక్కితే త్రెడ్​లో ఉన్న ఏ మెసేజ్​కైనా ఎమోజీని జత చేయొచ్చు. 

స్మార్ట్​ ఫీచర్స్​తో ఫోన్​

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే ఫీచర్​ ఫోన్స్​ లాంచ్​ చేసింది. అవి చాలా పాపులర్ అయ్యాయి కూడా. అయితే, ఇప్పుడు లేటెస్ట్​గా మరో ఫోన్​ వచ్చింది. దాని పేరు ‘జియో ఫోన్​ ప్రైమ 4జీ’. దీన్ని జియో కంపెనీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​ 2023లో ఎగ్జిబిట్​ చేసింది. ఇది ఫీచర్ ఫోన్ అయినా, ఇందులో ప్రీమియం డిజైన్​ వాడారు. ఈ ఫీచర్​ ఫోన్​లో సోషల్​ మీడియా యాప్​లు చాలా ఉంటాయి. ఈ ఫోన్​ని దీపావళి పండుగకల్లా మార్కెట్​లోకి తీసుకువస్తుందట కంపెనీ.

ఢిల్లీ, ముంబై సహా మెయిన్​ సిటీల్లో ఈ 4జీ ఫీచర్​ ఫోన్​ డెలివరీ చేయనున్నట్లు జియో మార్ట్​ చెప్పింది. ప్రస్తుతానికి ఈ ఫోన్​ ఎల్లో, బ్లూ కలర్స్​లో అందుబాటులో ఉంది. ఇప్పటికే జియో మార్ట్​ ఇ–కామర్స్ వెబ్​సైట్​లో జియో ఫోన్​ ప్రైమ​ 4జీ అందుబాటులో ఉంది. లాంచింగ్​కి క్యాష్​బ్యాక్, బ్యాంక్ ఆఫర్లతో పాటు కూపన్లు కూడా ఇస్తుందట. 

ఫోన్​ గురించి..

జియో ఫోన్​ ప్రైమ 4జీ ఫోన్​ డిస్​ప్లే 2.4 అంగుళాలు ఉంటుంది. 320 *240 రిజల్యూషన్​ పిక్సెల్స్​ ఉంటాయి. దీనికి పలుచటి ఫిల్మ్​ ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ (టీఎఫ్​టీ) డిస్​ప్లే ఉంది. ఈ ఫీచర్ వల్ల ఇమేజ్​ క్వాలిటీ బాగా కనిపిస్తుంది. అలాగే ఫోన్​ వెనక ప్యానెల్​ పై రెండు సర్కిల్స్​ కనిపిస్తాయి. దాని లోపల జియో లోగో ఉంటుంది. ఇది జియో నుంచి వచ్చిన kaiOS ఆధారంగా పనిచేస్తుంది. అలాగే ఇది సింగిల్ సిమ్​తో పనిచేస్తుంది. ఇందులో ఎఆర్​ఎమ్​ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్ ఉంది. ఇందులో128జీబీ మైక్రో ఎస్​డీ కార్డ్​ని ఇన్​స్టాల్ చేసుకోవచ్చు. 

ఇస్మార్ట్​ ఫీచర్స్ 

  • ఈ ఫోన్​కి 4జీ కనెక్షన్ సపోర్ట్​,1800ఎమ్​ఎహెచ్​ బ్యాటరీ ఉంది. 
  •  ఇరవై మూడు భాషలు ఉంటాయి. 
  •  ఇందులో 0.3 ఎం.పి ఫ్రంట్​ కెమెరా ఉంది. 
  •  బ్లూటూత్​ వెర్షన్ 5.0 కూడా అందుబాటులో ఉంది. 
  •  ఎఫ్​ఎమ్​ రేడియోతోపాటు 3.5ఎమ్​ఎమ్ ఆడియో జాక్​కు సపోర్ట్​ చేస్తుంది. 
  •  వాట్సాప్, జియో చాట్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్​లు కూడా ఉంటాయి. 
  •  స్మార్ట్ ఫోన్​లో లాగానే ఈ ఫోన్​లో యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావ​న్, జియో న్యూస్ వంటి ఎంటర్​టైన్​మెంట్ యాప్స్​ వాడొచ్చు. 
  •  ఈ ఫోన్​ ధర 2,599 రూపాయలుగా రిలయన్స్ జియో ప్రకటించింది. 
  •  ఈ ఫోన్​కు ఒక ఏడాది వారంటీ ఇస్తోంది జియో కంపెనీ.