ఉక్రెయిన్ నుంచి వచ్చిన కొడుకుని హత్తుకుని ఏడ్చేసిన తల్లి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన కొడుకుని హత్తుకుని ఏడ్చేసిన తల్లి

జగిత్యాల జిల్లా: జగిత్యాల బస్టాండులో శనివారం భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. యుద్ధ భూమిగా మారిపోయిన ఉక్రెయిన్ నుండి తిరిగి వస్తున్న కొడుకు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తల్లి, చెల్లి..  కొడుకు బస్సు దిగగానే హత్తుకుని ఏడ్చేశారు. క్షేమంగా తిరిగి రావాలంటూ క్షణమొక యుగంలా ఆందోళన చెందుతూ గడిపిన వీరు.. కొడుకు పవన్ కుమార్ కన్పించగానే.. ఆనంద భాష్పాలు రాలుస్తూ బిగ్గరగా ఏడ్చేశారు. 
గొల్లపెళ్లి మండలం వెంగళాపూర్ కు చెందిన పడాల పవన్ కుమార్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్నాడు. డాక్టరై తిరిగొస్తాడనే ఆశతో ఉన్న కుటుంబ సభ్యులకు పది రోజుల క్రితం ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిన వెంటనే భయంతో వణికిపోయారు. వెంటనే కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడారు. వీలు చిక్కినప్పుడల్లా మాట్లాడుతూ.. కొడుకును ఇంటికి రప్పించమంటూ నేతలను, అధికారులను పదేపదే వేడుకోవడం జరిగింది. తల్లి, చెల్లి, కుటుంబ సభ్యుల పూజలు ఫలించి శనివారం మధ్యాహ్నం పవన్ కుమార్ హైదరాబాద్ మీదుగా సొంతూరుకు రాగానే..  తల్లి, చెల్లి ఇతర కుటుంబ సభ్యులు బస్సు దిగిన వెంటనే హత్తుకుపోయారు. కొందరు పూలదండ తీసుకుని రాగా.. తల్లి తన కుమారుడు పవన్ కుమార్ కు దండ వేసింది. తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులతోపాటు తన రాకకోసం ఎదురు చూసిన గ్రామస్తులతో ఫోటోలు, వీడియోలు దిగారు. 
యుద్ధం మొదలుకాగానే భయపడుతూ బంకర్లో దాక్కున్నాం
రష్యా యుద్ధం మొదలుపెట్టిందని తెలియగానే సహచర విద్యార్థులతో కలసి బంకర్ లోకి వెళ్లి దాక్కున్నామని చెప్పారు. తరచూ ఇంటికి ఫోన్ చేస్తూ.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూనే ఉన్నానని పవన్ కుమార్ చెప్పారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ కార్యక్రమం ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలు చేపట్టిందని తెలియగానే ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్ బోర్డర్ దాటడానికి 20 కిలోమీటర్ల దూరం 6 రోజులు నడిచామన్నారు. ప్రాణాలతో దేశం దాటేసి వచ్చామని, ఇంకా చాలా మంది ఉక్రెయిన్ లో వున్నారని, వారందరిని క్షేమంగా తీసుకురావాలని పవన్ కుమార్ కోరారు. 

 

ఇవి కూడా చదవండి

మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

రష్యాతో యుద్ధం చేసేందుకు తిరిగొచ్చిన ఉక్రెనియన్లు

డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు

జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన