చలో విజయవాడకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, టీచర్లు

చలో విజయవాడకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, టీచర్లు

అమరావతి: ఏపీ సర్కారు తెచ్చిన  పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ‘చలో విజయవాడ’కు ఉద్యోగులు, టీచర్లు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర ఎటు చూసినా వాళ్లే కనిపించారు. దీంతో ‘చలో విజయవాడ’ సక్సెస్ అయ్యిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కార్యక్రమానికి బయలుదేరిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు, టీచర్లు తరలివచ్చి గురువారం భారీ ప్రదర్శన చేశారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ ఎన్జీవో భవన్‌‌‌‌ నుంచి అలంకార్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌ రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. రాష్ట్ర సర్కారు పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే మరింతగా తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఈనెల 6వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించుకుని, చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌‌‌‌‌‌‌‌ శర్మ ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఐఆర్‌‌‌‌‌‌‌‌ పెంచామని తెలిపారు. కాగా, చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయ్యిందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా? వద్దా అనే విషయాన్ని శుక్రవారం జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.