ఉద్యోగులకు జరిగిందేమిటి?

ఉద్యోగులకు జరిగిందేమిటి?

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు స్కూలు యాజమాన్యం, ఉద్యోగులు, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, రచయితలు నిర్వహించిన పాత్ర, చేసిన త్యాగాలు మహోన్నతమైనవి.  సబ్బండ కులాలు, మహిళలు కూడా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించిన చరిత్ర  కళ్లముందే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ తమ సమస్యలు, ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు. అవి ఏమేరకు నెరవేరాయనేది  పరిశీలిద్దాం.  

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల వల్ల ఆదిలాబాద్‌ నుంచి కరీంగనర్‌,  వరంగల్‌,  ఖమ్మం దాకా గోదావరి తీరం అంతా  బొందల గడ్డగా  వాతావరణ  కాలుష్యంతో  నిండిపోయి  ప్రజలు తీవ్ర  అనారోగ్యాల పాలవుతున్నారు. ఉద్యమకాలంలో ఓపెన్‌ కాస్ట్‌ గనులను నిషేధిస్తామన్నారు. అందుకు విరుద్ధంగా  కొత్తవాటికి  అనుమతులిచ్చారు. లక్ష యాభైవేల మంది ఉన్న సింగరేణి  కార్మికులు  నలభై వేలకు  తగ్గిపోయారు. బొగ్గు నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది. ఉన్న కార్మికులకు మూడు నెలల జీతం బోనస్‌గా ఇచ్చి జోకొట్టారు.  వారసత్వ నియామకాలు చాలా ఆలస్యంగా చేపట్టారు.  ఓపెన్‌ కాస్ట్‌  గనులతో,  యాంత్రికీకరణతో,  సింగరేణిలో మనం లక్షన్నర ఉద్యోగాలు కోల్పోయాం.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆయా సింగరేణి  ట్రేడ్‌ యూనియన్లను నిర్వీర్యం చేస్తూ వచ్చింది.  కవిత, హరీష్‌రావు వంటి రాజకీయ నాయకుల  ప్రమేయంతో  మొత్తం ట్రేడ్‌ యూనియన్‌లు కుప్పకూలిపోయాయి.  

ఆర్టీసీ ఉద్యోగులు అతలాకుతలం

ఆర్టీసీ ఉద్యోగులు,  డ్రైవర్లు,  కండక్టర్లు చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. ఆర్టీసీ జేఏసీలు ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించారు. ఆర్టీసీ సిబ్బందికి కమిషన్‌లు లేవు. తాము పొదుపు చేసిన డబ్బుపై వడ్డీతో  నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్‌గా ఇస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమను ప్రభుత్వ శాఖలో భాగం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆకాంక్షించారు. ఉద్యమ నాయకత్వం కూడా అంగీకరించింది. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రేడ్‌ యూనియన్‌ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేసింది.  లక్షా ఇరవై ఐదు వేలమందిఉన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాభై మూడు వేలకు తగ్గిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులను, సిబ్బందిని  ప్రభుత్వ శాఖలో భాగం చేయలేదు.  దాంతో  నేటికీ వారికి సరైన పెన్షన్లు లేవు.  గృహవసతి, వైద్య వసతి, పిల్లలకు విద్యావసతి అనేక సౌకర్యాలు అందుబాటులో  లేకుండా పోయాయి.  ఇలా ఆర్టీసీ ద్వారా  పదేండ్లలో  లక్షఉద్యోగాలు పెరగాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయాయి. 

విద్యారంగం అస్తవ్యస్తం

రోడ్లు భవనాలు, తదితర  సివిల్‌ ఇంజినీర్ల రంగంలో కొన్ని నియామకాలు జరిగాయి.  ఎలాంటి పైరవీలు,  అవినీతి  లేకుండా అన్ని రంగాల్లో  తెలంగాణ  పబ్లిక్‌  సర్విస్‌  కమిషన్‌ వేలాదిమంది విద్యావంతులను ప్రభుత్వం చూపిన ఖాళీల ప్రకారం కాస్త ఆలస్యంగానైనా నియామకాలు చేపట్టింది.  గురుకుల  పాఠశాలలో  నియామకాలు  జరిగాయి.  పోలీసు నియామకాలు కూడా సజావుగా సాగిపోయాయి. అవసరమున్న దానికన్నా రెట్టింపు పోలీసులను నియమించారు.  ఉపాధ్యాయులను  కూడా  కాస్త ఆలస్యంగా  నియామకాలు చేపట్టారు. ఈలోపే  ఎక్కడికక్కడ  ఉపాధ్యాయులు కావాలని డిమాండ్‌ పెరగడంతో ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.  హాస్టళ్లు, స్కూళ్లు కలిపి గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది.  ప్రభుత్వ  పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు విద్యార్థులు ఉండడం లేదు. అయినప్పటికీ ఆయా  సబ్జెక్టుల ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది.  అది  ఇంకా స్కూళ్లల్లో,  కాలేజీల్లో,  యూని వర్సిటీల్లో కొనసాగుతూనే ఉంది.   

రిటైర్మెంట్ వయస్సు పెంపు

ప్రభుత్వ  వైద్యశాలల్లో  రెగ్యులర్‌ స్టాఫ్‌ను,  డాక్టర్లను నియమించడం బాగా తగ్గిపోయింది. నిమ్స్‌ వంటి సంస్థల్లో 1994 నుంచి కొన్ని శాఖల్లో కొత్త నియామకాలే లేవు. నర్సులు, సిస్టర్లు, ఆయాలు కింది వర్ణాల నుంచి వచ్చి ఉద్యోగాలు వెతుక్కునేవారు.  వారికి  ఉద్యోగ  భద్రత  లేకుండా ఔట్‌ సోర్సింగ్‌,  కాంట్రాక్ట్‌  పద్ధతిలో తాత్కాలిక నియామకాలు చేపట్టి వారికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. అవసరమైన  మేరకు  వైద్యశాఖలో నియామకాలు చేపడితే పదివేల మంది  డాక్టర్లు లక్షమంది  ఇతర  నైపుణ్య సిబ్బంది నియామకాలు చేపట్టవచ్చు. ఆ పని చేయలేదు. 

ఉద్యోగులకు  తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఒకటి అదనంగా ఇచ్చింది. పే రివిజన్‌ చూసినప్పుడు సాధారణంగా 20 శాతం ఉండే అదనపు బెనిఫిట్‌ను 42 శాతం చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను  నెరవేర్చింది.  అయితే 58  ఏండ్లు ఉన్న రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏండ్లకు పెంచారు. తద్వారా మూడేళ్లపాటు ఖాళీ అయ్యే యాభై వేల ఉద్యోగాలను యువతరం కోల్పోయారు. యువతరానికి ఇచ్చే జీతం 35 వేలు అయితే రిటైరయ్యే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌ 75 వేలు. మొత్తం కలిసి లక్షా ఐదు వేలు. రిటైర్‌ కావాల్సిన ఉద్యోగులను మూడేండ్లు అలాగే ఉంచడం వల్ల లక్షా 50 వేలకు పైగా నెల నెలా ఇవ్వాల్సి వచ్చింది.  ఆ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి, వారి తల్లిదండ్రులకు జీతం పెంచడం వల్ల ఉద్యోగ వయస్సు పెంచడం వల్ల సమాజంలో తీవ్ర సంఘర్షణ, అసమానతలు, కుటుంబంలో కలతలు పెరిగాయి. 

ఉద్యోగులకు, యువతరానికి నష్టం జరిగింది

ఆధునిక టెక్నాలజీ ఐటీ సాధనతో బోధనలు, కంప్యూటరీకరణ ఈ రిటైరయ్యే ఉద్యోగులకు కష్టం. అందువల్ల ప్రభుత్వ నడక కూడా మందగించింది. ఇదంతా ప్రభుత్వం ముందుచూపు లేక చేసిన స్వయంకృత అపరాధం. రిటైరైతే ఇవ్వాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌, చెల్లించాల్సిన ఇతర భత్యాలకు బడ్జెట్‌ లేదు అనే పేరిట మూడేండ్లు రిటైర్మెంట్‌ వయస్సు పెంచారు. అయితే ఆరు లక్షల కోట్ల అప్పుచేసి ఏం చేసినట్టు? ఆ లెక్కలు లేవు.  రిటైర్‌ ఉద్యోగులకే బాండ్స్‌ ఇచ్చి బ్యాంకు గ్యారంటీ ఇస్తే వాళ్ళు అవసరమున్న మేరకు బ్యాంకులో కుదువబెట్టి తమ తమ మొత్తాలను విత్‌డ్రా చేసుకునేవారు. దీనివల్ల గొప్ప మేలు కూడా జరిగేది.  రిటైర్మెంట్‌ అయినప్పుడు వచ్చిన డబ్బులు సంతానం  గుంజుకోకుండా స్థిరంగా పెట్టుబడిగా ఉండిపోయేది.  ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వినిపించుకోక అటు అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులకు, ఇటు యువతరానికి ఎనలేని నష్టం చేసింది. మూడేండ్లు  రిటైర్మెంటు వయస్సు పెంచడంవల్ల 85 వేల  మంది ఉద్యోగులకు మూడేండ్లపాటు ప్రమోషన్లు ఆగిపోయాయి. వారు కూడా అసంతృప్తి పాలయ్యారు. ఇలా అందరిని అసంతృప్తికి గురి చేసిన నిర్ణయం  తీసుకోవడం వల్ల ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత  మలుపు తిరిగారు. ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేయాలనుకోవడం అందుకు ప్రధాన కారణం. 

నియామకాలు చేయలె

మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయితీలలో, ఆర్టీసీ బస్టాండ్లలో పారిశుధ్య కార్మికులను నియామకాలు చేపట్టకుండా తీవ్ర అన్యాయం చేశారు. పేదలైన వీరికి ఉద్యోగ భద్రత, జీతభత్యాలు ఇస్తే వారి పిల్లలు చదువుకుని మధ్య తరగతి ఉద్యోగులుగా, నిపుణులుఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్​ నియామకాలతో బీఆర్​ఎస్​ ప్రభుత్వం అన్యాయం చేసింది.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా ఇంకా ఇతర శాఖలను, రంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మరో లక్ష ఉద్యోగాల కల్పన చేపట్టే అవకాశాలు లేకపోలేదు.

విద్యుత్​ ఉద్యోగుల శ్రమ

విద్యుత్‌ శాఖలో ప్రభుత్వం కొంత మేలు చేసింది.  ఎన్నాళ్లుగానో  ఎదురుచూస్తున్న  తొమ్మిదివేల మందిని  రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చింది. కానీ,  స్కేలు మాత్రం పెంచలేదు. ప్రైవేటు రంగం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి కరెంట్‌ సప్లయ్‌ చేయడంలో విద్యుత్‌ ఉద్యోగులు మహత్తర పాత్ర నిర్వహించారు.  నూతన నియామకాలు   చేపట్టారు.  ఇక్కడ కూడా ఉద్యోగ సంఘాలను  నిర్మూలించాలను కున్నారు. కానీ, వారు పకడ్బందీ నిర్మాణం కలిగి ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు.

- బి.ఎస్‌. రాములు, తెలంగాణ  బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌