
పెబ్బేరు, వెలుగు: ఉపాధిని ప్రాథమిక హక్కుగా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం పెబ్బేరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి సుభాష్చౌరస్తా, బస్టాండ్ మీదుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, కాంట్రాక్ట్, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలన్నారు.
ఉపాధిని అవుట్ సోర్సింగ్ చేయడం, స్థిర-కాల ఉపాధిని తీసుకురావడం ఆమోదయోగ్యం కాదన్నారు. సమ్మె కార్మికుల హక్కు అని ప్రకటించిన ఐఎల్ఓ కన్వెన్షన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆహార పదార్థాలు, మందులు, వ్యవసాయ పరికరాలు మొదలైన వాటిని జీఎస్టీ నుంచి మినహాయించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కు బదిలీ చేయడాన్ని ఆపాలని, జాతీయ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, రమేశ్, రాము, ఎండీ మహమూద్, సునీత, మదన్, నిక్సన్, బుచ్చమ్మ, ఊషన్న, దేవన్న, బాలయ్య, శారద పాల్గొన్నారు.