ఓబీసీల సాధికారత .. వయా సోషల్ మీడియా

ఓబీసీల సాధికారత .. వయా సోషల్ మీడియా

ఇన్ఫర్మేషన్​అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విప్లవం రావడంతో సోషల్​మీడియా మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు, ప్రజలు ఇంట్లో, కార్యాలయాల్లో, ప్రయాణించేటప్పుడు, ప్రజారవాణాలో రోడ్లపై వంటి ప్రతిచోట ఫేస్​బుక్​, ఎక్స్​(ట్విట్టర్), వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, లింక్డ్ఇన్​, యూట్యూబ్ లను నిరంతరం తమ స్మార్ట్ ఫోన్లలో వాడుతున్నారు.

ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల సోషల్​మీడియా అత్యంత విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్​ విధానంగా మారింది. డిసెంబర్​ 23 నాటికి భారతదేశంలో 881.25 మిలియన్లకు పైగా ఇంటర్​నెట్ చందాదారులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆన్​లైన్​ మార్కెట్​గా నిలిచింది. కేవలం చైనా (1.5 బిలియన్) తరువాత భారతదేశంలో సగటున ఒక వ్యక్తి  రోజుకు 2గంటల 40నిమిషాలు సోషల్ మీడియాపై గడుపుతున్నాడు. ఇది వాస్తవం. 

2008, 2012లో అమెరికాలో ఒబామా విజయవంతమైన రాజకీయ వ్యూహాల కోసం సోషల్​ మీడియాను ఉపయోగించారు. ఆయన​అడుగుజాడలను అనుసరించి.. భారతదేశంలో బీజేపీ కూడా 2014లో సోషల్​ మీడియాను ఉపయోగించి మోదీ బ్రాండ్​ సృష్టించి విజయవంతమైంది. 2014, 2019లో వరుసగా ఎన్నికలలో విజయం సాధించింది. 2024లో కూడా అదేవిధమైన ప్రణాళికతో వెళుతోంది. వారి కార్యకలాపాలపై అవగాహన కల్పించడం, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండటం ఆ పార్టీ లక్ష్యాలుగా ఉన్నాయి. కాగా, సాంకేతిక పురోగతి, డిజిటల్ విప్లవంతో ఇంటర్నెట్ లభ్యత దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంది. 

భారత్​లో 96 కోట్ల మంది ఓటర్లు

హైస్పీడ్​ ఇంటర్నెట్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. సోషల్​మీడియా ప్లాట్​ఫాం ఉపయోగించడం ఉచితం కావడంతో ఇది ఓటరుకు చేరుకోవడానికి సరైన వేదికగా మారుతోంది. ఏఐ ఆధారిత యాప్స్ సహాయంతో  సమాచారాన్ని బహుళ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచే అవకాశం ఏర్పడింది. ఇది సమాజంలోని అణగారిన వర్గాలకు ఎంతగానో సహాయపడుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం మన స్మార్ట్​ఫోన్లలో వ్యతిరేక, అనుకూల రాజకీయ ప్రచారాలను మనం ఇప్పటికే చూస్తున్నాం.

రాజకీయాలు, మీడియా సంక్లిష్టమైన సమన్వయ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాయి.  మీడియా, రాజకీయాలు, ఎన్నికలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ కథనాల చర్చలకు సోషల్​ మీడియా వేదికలుగా మారాయి. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం భారతదేశంలో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్​లో ఇది 4.8 కోట్లు. వీరిలో దాదాపు 52శాతం ఓబీసీ ఓటర్లు.

ఎన్నికల్లో సోషల్​ మీడియా కీలకపాత్ర

ప్రారంభంలో ఓటర్ల వైఖరిని మార్చడంలో ప్రింట్ మీడియా కీలకపాత్ర పోషించింది. సానుకూల పత్రికా కవరేజ్ కారణంగా పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ. అదేవిధంగా ప్రతికూల నివేదికల కారణంగా ప్రభుత్వాలు వైదొలిగాయి. దీనికి ఉదాహరణ నేదురుమిల్లి జనార్దన్​రెడ్డి ప్రభుత్వం. కాగా, ఆ తరువాత కాలంలో ఎన్నికల ప్రచారంలో ఎలక్ర్టానిక్​ మీడియా ముఖ్యమైన పాత్ర పోషించింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ మౌత్​పీస్​లు (టీవీ చానల్స్​)ను ప్రారంభించాయి. సోషల్​ మీడియా రావడంతో ఈ దృశ్యం మారిపోయింది. 

సోషల్​ మీడియా లేనిదే గెలవలేరు

ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్​మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్​ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, రౌడీయిజం కీలక పాత్ర పోషిస్తాయి. బర్రెలక్క అలియాస్​ కె. శిరీష పేరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్​ నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా  మార్మోగిపోయింది.  ఓట్లు కేవలం 5,800వరకు వచ్చినా ఆమె సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. అది సోషల్ మీడియా ప్రభావం. మీడియా, సోషల్​ మీడియా లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. 

ఓబీసీలకు కొత్త అవకాశాలు

 ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. దీని కారణంగా చాలామంది ఓబీసీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఒకవేళ పోటీ చేసినా చాలా సందర్భాల్లో ఓడిపోతున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్​ వేదికలను ఉపయోగించి అగ్రవర్ణ ప్రజలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఓబీసీలకు కొత్త అవకాశాలను తెరిచింది. ఇది వెనుకబడిన కులాల ప్రజలకు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, వారి సొంత కుల ఓటర్లతో కనెక్ట్​ అవడానికి, బీసీ ప్రయోజనం కోసం వారికి అవగాహన కల్పించడానికి అపారమైన శక్తినిచ్చింది.

ఫేస్​బుక్, ట్విట్టర్​ (ఎక్స్), ఇన్​స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్​మొదలైన సోషల్​ మీడియా యాప్స్​ద్వారా బీసీలను సమర్థవంతంగా నెట్​వర్క్​ చేయవచ్చు. యూట్యూబ్, జూమ్, స్కైప్​ సమావేశాలను ఉపయోగించి ఆన్​లైన్​ తరగతులను నిర్వహించవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. సామర్థ్యాన్ని పెంచవచ్చు. బీసీ సమస్య గురించి అవగాహన కల్పించడం, పాలనలో చట్టబద్ధమైన వాటా కోసం పోరాడటం, బలహీన వర్గాల అభ్యున్నతి బాధ్యతను చేపట్టడం బీసీ కమ్యూనిటీ నాయకులు, పెద్దల, సామాజిక, నైతిక బాధ్యత. జనాభాలో ఓబీసీల వాటాకు అనుగుణంగా బడ్జెట్​ను కేటాయించాలని, వారి ఆర్థిక అభ్యున్నతి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి.

సాధికారతకు  సాధనం

డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ సూత్రం ప్రకారం బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజలను వ్యవస్థీకరించడం, విద్యావంతులను చేయడం, ఆందోళన చేయడం. మనం ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టి రాజకీయాలలో, ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో మన చట్టబద్ధమైన వాటా కోసం పోరాడాలి. బీసీ సెన్సస్​ గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వారి జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోరవచ్చు. కుల సంఘాలలో రాజకీయ చిచ్చులు పెట్టిన పార్టీలను సోషల్​ మీడియా ద్వారా ఎండగట్టవచ్చు. బీసీ కులాల ఐక్యత, నెట్ వర్కింగ్ చేయడం సులభం అవుతుంది.

బీసీల వాటాకోసం పోరాడాలి

ఓబీసీలు తమ బలాన్ని గ్రహించాలి. బీసీ బిడ్డలు ఎవరికీ తక్కువ కాదు. సోషల్​ మీడియా ద్వారా మాత్రమే బీఆర్ఎస్​ ప్రభుత్వ అన్యాయాలు, అవినీతికి వ్యతిరేకంగా మన బీసీ బిడ్డలు తీన్మార్​ మల్లన్న, జర్నలిస్ట్​ రఘు తదితరులు అవిశ్రాంత పోరాటం చేశారు. దీని కారణంగా శక్తిమంతమైన బీఆర్ఎస్ ​పార్టీ తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు మనం ఇదే మాధ్యమాన్ని బీసీల ఐక్యత కోసం, బీసీ చైతన్యాన్ని సృష్టించడానికి,  ఈ అణగారిన ప్రజల సాధికారత, విముక్తి కోసం సమర్థవంతంగా ఉపయోగించాలి. బీసీ చైతన్యాన్ని సృష్టించడం, రాజ్యాధికారాన్ని అందుకోవడం లక్ష్యంగా పనిచేయాలి. 

-  టి. చిరంజీవులు, ఐఏఎస్ (రిటైర్డ్​)