
కొంతకాలంగా నన్ను వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న.. ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమేనా అని? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒకసారి గత చరిత్రను తిరగవేసినప్పుడు ప్రస్తుత పాలకులు తెలపని ఎన్నో విషయాలు తెలిశాయి. అసలు ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమే అనేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి?
ఇందిరాగాంధీ మరణించి నేటికి నాలుగు దశాబ్దాలు అయ్యింది. అంటే, నేడు భారతదేశంలో ఉన్న దాదాపు 50% కంటే ఎక్కువ జనాభా ఆమె మరణించిన తర్వాత జన్మించినవారే. వారిలో నేను కూడా ఒకడిని. వీరికి ఇందిరాగాంధీ అంటే ఏం తెలపాలి? భారత దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా, ఎన్నికల ద్వారా గెలిచి దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిన వ్యక్తిగా చెప్పాలి. కానీ, ఈ పాలకులు ఏం చెబుతున్నారు? ఇందిరా గాంధీ అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఆమె జీవితంలో ఎమర్జెన్సీ కంటే ముఖ్యమైన విజయాలు ఎన్నో ఉన్నాయి.
భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలను అమెరికా నుంచి పీఎల్ 480 అనే పథకం ద్వారా దిగుమతి చేసుకుంటున్న క్రమంలో, మన దేశంలో 70 శాతం పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడినప్పటికీ కూడా మనం మన దేశానికి సరిపడా ఆహార ధాన్యాలను పండించుకోలేని సమయంలో... దేశంలో 1960 దశకంలో హరిత విప్లవం తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పాల ఉత్పత్తిని కూడా శ్వేతవిప్లవం ద్వారా భారతదేశానికి పరిచయం చేసింది.
బ్యాంకులు జాతీయం
తన తండ్రి నెహ్రూ సోషలిజాన్ని ముందుకు తీసుకుపోయేవిధంగా అప్పటివరకు ధనవంతులు, వ్యాపారుల కోసం మాత్రమే పనిచేసే బ్యాంకులను జాతీయం చేసి, ఆ బ్యాంకులను పేద రైతులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీకే చెల్లుతుంది. ఆర్బీఐ గణాంకాలు ప్రకారం దేశంలో 1969 వరకు 1,833 బ్యాంకులు ఉంటే ఆ సంఖ్య 1995 నాటికి 33,004 బ్యాంకులకు చేరింది. కొత్తగా ఏర్పాటు అయిన బ్యాంకుల్లో అధికంగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు అయినవే. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పుచేసి వ్యవసాయం చేసే పేద రైతులకు ఈ బ్యాంకుల జాతీ యకరణ ఎంతో తోడ్పాటుని ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం వందలాది మంది
సంస్థానాధీశులకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును భరణంగా చెల్లించడం రద్దు చేసి ఇందిర తన సోషలిస్టు విధానాలను మరోమారు చాటి చెప్పింది. ఈ రెండు నిర్ణయాలు ఇందిరాగాంధీకి ప్రజల్లో మంచి పేరు తీసుకువచ్చాయి.
అలీన దేశాలకు నాయకత్వం
ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో అటు అమెరికాకుగాని ఇటు యుఎస్ఎస్ఆర్కుగాని మద్దతు తెలుపకుండా తటస్థ వైఖరిని పాటించి అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించి ఆ దేశాలకు నాయకత్వం వహించడం జరిగింది. ఈ విధానం నేటికీ కూడా భారతదేశ విదేశాంగ విధానంగా అమలు అవుతోంది. ఇలాంటి విజయాలు వీరగాథలు తెలిసిన తర్వాత ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఇందిర అంటే ఎన్నో విజయాలు.
అసలు ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమే అనేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? అని పరిశీలిస్తే ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న పాలకులు బాహాటంగానే మనుస్మృతి పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించినవారి మనోగతం అర్థమవుతుంది. ఈ మనుస్మృతి అభిమానులు ఎప్పుడూ కూడా స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితం కావాలని కోరుకునేవారు.
కానీ, వారి విశ్వాసాలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ పాలనను చేపట్టడమే కాకుండా ఆదర్శపాలన అందించింది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ విజయాలు, దూరదృష్టి, దౌత్యనీతి, దృఢ నాయకత్వం, సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఉండేందుకు మనువాదులు వేసిన ఎత్తుగడయే ఈ ఎమర్జెన్సీ అనే అంశానికి అత్యంత ప్రచారాన్ని కల్పించడం అని యువతరం అర్థం చేసుకోవాలి.
విజయవంతంగా అణుపరీక్ష
1971లో పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)పై యుద్ధం ప్రకటించినప్పుడు అమెరికా మాటను కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి భారతదేశాన్ని గెలిపించింది. ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయ్ కూడా ఇందిరా గాంధీని ప్రశంసించారు. 1974లో పోఖ్రాన్ అణుపరీక్షను రాజస్థాన్‌లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 1975లో భారత మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టని కూడా విజయవంతంగా ప్రారంభించారు.
గరీబీ హటావో అనే నినాదం 1971లో ఇచ్చి పేదరిక నిర్మూలనకు ఇందిర ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. 1975లో 20 సూత్రాల పథకం అనేది గొప్ప విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. గ్రామాల్లో పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారిత, తాగునీరు, అందరికీ ఆరోగ్యం, చిన్నారులకు పౌష్టికాహారం, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం, మురికివాడల అభివృద్ధిలాంటి కార్యక్రమాలు ఈ పథకంలో భాగంగా చేపట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా ఇందిరా గాంధీ కొండల్లో, గూడెంలో, తండాల్లో, పల్లెల్లో, ఉన్న ప్రజలకు దగ్గర అయ్యింది.
- చిందం మధు, ఉస్మానియా యూనివర్సిటీ