రెచ్చిపోయిన వీధి కుక్కలు..హైవేపై వెళ్తున్న వారి వెంట పడి దాడి

రెచ్చిపోయిన వీధి కుక్కలు..హైవేపై వెళ్తున్న వారి వెంట పడి దాడి
  • పిక్కలు పీకి.. చేతులు, కాళ్లను కరిచి బీభత్సం
  • 16 మందికి గాయాలు
  •  పరిగి ఆస్పత్రికి వెళ్లిన బాధితులు.. తాండూరుకు రెఫర్

పరిగి, వెలుగు:  వీధి కుక్కల గుంపు హైవేపై బీభత్సం సృష్టించింది. బైక్​లపై వెళ్తున్న వారి వెంటపడి మరీ దాడి చేశాయి. కొందరి కాళ్ల పిక్కలు పట్టి గుంజాయి.. మరికొందరిని నోటికి అందిన కాళ్లు, చేతులను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించాయి. కుక్కల చేతిలో గాయపడి పరిగి ఆస్పత్రికి వెళ్లిన బాధితులకు నిరాశే ఎదురైంది. అక్కడ కుక్కకాటుకు మందు లేదని చెప్పి తాండూరుకు రెఫర్​ చేశారు. హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై పరిగి పరిధిలో ఈ ఘటనలు జరిగాయి.

ఈ  హైవేపై అక్కడకక్కడా కుక్కలు గుంపులుగుంపులుగా ఉంటాయి. ప్రధాన రహదారిపై పరిగి మునిసిపల్​ పరిధి మార్కెట్ యార్డు, ఖాన్ కాలనీ, ఏవీఎస్ ప్లాజా, న్యామత్ నగర్ తండా ఏరియాల్లో శనివారం వీధి కుక్కలు రెచ్చిపోయాయి. హైవేపై బైక్​లపై వెళ్తున్న వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న పలువురిపై అటాక్​ చేశాయి. బైక్​పై వెళ్తుండగా వెంటబడి కాళ్లను, పిక్కలను పట్టి గుంజాయి.

మరికొందరికి చేతులపై గాయాలయ్యాయి. పరిగికి చెందిన అశోక్, సయ్యద్ ఖాజా బాషా, నాగమణి, బుచ్చయ్య, బుగ్గమ్మ, ఎండీ.గౌస్, తేజ అశ్విని, మేడికొండకు చెందిన భరత్, మల్కాపూర్​కు చెందిన అంజయ్య, చౌడపూర్​కు చెందిన అర్జున్, గూడూర్​కు చెందిన సుదర్శన్, గుర్మిత్కల్​కు చెందిన షేక్, కొత్తూరుకు చెందిన రాము పవర్, కిష్టాపూర్​కు చెందిన సరోజా, హైదరాబాద్​కు చెందిన గులాంషఫీకి తీవ్ర గాయాలయ్యాయి. 

కుక్కకాటుకు నో మెడిసిన్​..

వీధికుక్కల చేతిలో గాయపడిన 16 మంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ హారిక ప్రథమ చికిత్స చేసి తాండూరు ఆస్పత్రికి రెఫర్​ చేశారు. కుక్క కాటుకు అవసరమైన మందు తమ వద్ద అందుబాటులో లేనందుకు రెఫర్​ చేసినట్లు తెలిపారు. మెడిసిన్​ లేకపోవడంపై బాధితులు సిబ్బందిపై ఫైరయ్యారు. 15 రోజుల్లోనే పరిగి ఆస్పత్రిలో 158 కుక్కకాటు కేసులు నమోదుకావడం గమనార్హం. వీధి కుక్కలు దాడి చేసిన విషయాన్ని స్థానికులు మునిసిపల్​  కమిషనర్​కు చెప్పేందుకు ఫోన్​ చేయగా స్పందించలేదు. దీంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.