
మన దేశంలో 1987వ ప్రాంతం నుంచి జాతీయ లా కళాశాలల ఏర్పాటు మొదలైంది. ఆగస్టు 29, 1987లో కర్నాటక ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ప్రత్యేకమైన చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన చట్టం. ఈ చట్టం ద్వారా ‘లా’ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఈ ‘లా’ స్కూల్‌కి ‘డీమ్డ్’ యూనివర్సిటీ హోదా కూడా లభించింది. ఈ యూనివర్సిటీకి భారత ప్రధాన న్యాయమూర్తి చాన్సలర్‌గా ఉన్నారు. ఈ యూనివర్సిటీ విజయవంతం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలలో ‘లా’ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం మొదలైంది.
ఈ యూనివర్సిటీలకు చాన్సలర్స్ ఆయా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు. దేశంలో న్యాయపాలన సక్రమంగా జరగడం చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంటుంది.
అది న్యాయవ్యవస్థ చేయాల్సిన పని. ఆ పనిని నిర్వర్తించడానికే న్యాయమూర్తులకు సమయం సరిపోవడం లేదు. ఈ ‘లా’ యూనివర్సిటీల పర్యవేక్షణ అనేది ఓ అనవసర బాధ్యత. లీగల్ ఎడ్యుకేషన్‌ని చూడటానికి లా ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ ‘లా’ స్కూల్స్ నిజానికి ఓ ‘లా’ కాలేజీలు లాంటివి. వీటికి ఉన్న హంగులు ఏ యూనివర్సిటీకి కూడా ఉండవు. అక్కడ చదువుతున్న విద్యార్థుల వేషధారణ మనకు దేశంలోని ఏ యూనివర్సిటీలో కనిపించదు. ‘ఇక్ఫై’ లా స్కూలును అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఈ లా యూనివర్సిటీల ప్రధాన ఉద్దేశ్యం మంచి న్యాయవాదులను కోర్టులకి పంపిస్తే న్యాయస్థానాల్లో ప్రమాణాలు పెరుగుతాయని, సామాన్యులకి న్యాయం అందుబాటులోకి వస్తుందని శాసనకర్తలు భావించి ఉంటారు. కానీ, వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఈ లా స్కూల్స్ లో చదివిన విద్యార్థులు ఎక్కువగా కార్పొరేట్ న్యాయరంగానికి ఉపయోగపడుతున్నారు.
కార్పొరేట్ న్యాయరంగ వృద్ధికి దారి...
1990 సంవత్సరం నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల మొత్తం ‘లా’ స్వభావం మారిపోయింది. కార్పొరేట్ న్యాయరంగ వృద్ధికి దారి తీసింది. ఈ కొత్త భూభాగంలో న్యాయ సలహాను అందించే న్యాయవాదుల డిమాండ్ పెరిగిపోయింది. లా సంస్థలు ప్రారంభ దశలోనే ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. దీనివల్ల లా వృత్తిని కార్పొరేట్లకు అంకితం చేసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికోసం ఈ ప్రత్యేక లా స్కూల్స్ లో చేరడానికి ఎక్కువమంది ఉత్సాహాన్ని చూపడం మొదలైంది.
క్యాంపస్‌లో వివక్షను తొలగించాలి
ఈ న్యాయ విద్యను పొందడానికి, న్యాయవాద వృత్తిలోకి రావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ‘క్లాట్’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఇంగ్లిష్ భాషలో మంచి ప్రవేశం ఉండాలి. మంచి ఇంగ్లిష్ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ‘క్లాట్’లో ఉత్తీర్ణులవుతారు. ఒకవేళ మామూలు విద్యార్థులు ఉత్తీర్ణులైనా ఆ ఫీజులను చెల్లించడం చాలా కష్టమైన పని. అక్కడ ఉన్న సంపన్న వర్గాలతో కలిసి చదువుకోవడం అంత సులువు కాదు.
ఈ లా యూనివర్సిటీలు సామాన్యుల కోసం కాదు. సంపన్నుల కోసం మాత్రమే. మంచి లా యూనివర్సిటీలో సామాన్యుల పిల్లలు చదివే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా? కల్పించడం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ముంబయి బార్ ఆయనను సన్మానించినప్పుడు అన్నారు. అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో అణగారిన వర్గాల విద్యార్థుల పట్ట ముఖ్యంగా దళిత, ఆదివాసీ విద్యార్థుల పట్ల క్యాంపస్ లో వివక్షను తొలగించాలని, వారిపట్ల సహానుభూతి ఉండాలని కూడా జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
ఈ ‘లా’ స్కూలు విద్యార్థులు ఇతర లా కాలేజీ విద్యార్థులను చిన్నచూపు చూడకూడదని, ఈ లీగల్ఎడ్యుకేషన్దృక్పథం కొన్ని లా కాలేజీలను మెరుగుపరచడం కోసం కాదని అన్ని లా కాలేజీలను మెరుగుపరచడం కోసమని చంద్రచూడ్ నల్సార్ ‘లా’ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేస్తూ అన్నారు. ఈ యూనివర్సిటీల మీద ప్రభుత్వం వెచ్చించే డబ్బులో 25శాతం యూనివర్సిటీల మీద వెచ్చిస్తే పేద విద్యార్థులకి ఎంతో సేవచేసిన వాళ్లవుతారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ సొమ్ము కొద్దిమంది సంపన్నుల కోసమే ఉపయోగపడకూడదు. పేద విద్యార్థులకు ఉపయోగపడాలి. వాళ్లు చదివే కాలేజీలకు ఉపయోగపడాలి.
సహానుభూతి సంస్థాగతంగా ఉండాలి
నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఇంకా చాలా అంశాలమీద తన అభిప్రాయాలను
వెల్లడించారు. సహానుభూతి అనేది వ్యక్తిగతంగా కాదు సంస్థాగతంగా ఉండాలి. ఈ వివక్షను అంతం చేయడానికి మొదటి అడుగు ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా హాస్టల్ గదులను కేటాయించడం నిలిపివేయాలని అన్నారు. కుల ఆధారిత విభజనకు దారితీసే ఈ కేటాయింపునకు ముగింపు పలకాలని ఆయన అన్నారు. సామాజిక వర్గాలతోపాటు విద్యార్థులు పొందిన మార్కుల జాబితాను ప్రచురించడం, దళిత, ఆదివాసీ విద్యార్థులను బహిరంగంగా అవమానించడం, వారి మార్కులను అడగడం. ఆంగ్లంలో వారి ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం వంటి పద్ధతులను అంతం చేయాలని ఆయన అన్నారు.
సంపన్నుల ‘లా’ యూనివర్సిటీలు
ఈ సంపన్నుల లా యూనివర్సిటీల సంఖ్య బహుశా పది నుంచి పదిహేను వరకు ఉండవచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాదాపుగా 1390 లా కాలేజీలను దేశవ్యాప్తంగా గుర్తించింది. వీటితో పోలిస్తే ఆ ‘లా’ స్కూల్స్ తక్కువే. కానీ, వాటి సౌకర్యాలు చాలా ఎక్కువ. కార్పొరేట్ న్యాయరంగం.. ఈ అత్యున్నత లా కాలేజీల నుంచే తమ నియామకాలను చేసుకుంటుందని ప్రసిద్ధి చెందింది. ఇతర లా కాలేజీల నుంచి నియామకాలు చేసుకున్న వ్యక్తులకు తక్కువ జీతాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉన్నత వర్గం, వివక్షతతో కూడిన విద్యా విధానాన్ని ఖండించాలి. ఇది సమానత్వ సూత్రాలకు విరుద్ధం. ఈ ‘లా’ స్కూల్స్‌ను తరచూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వస్తూ ఉంటారు. ఈ విద్యార్థులకి పెద్దవాళ్లతో కలిసి మాట్లాడటానికి, వాళ్ల మాటలను ప్రత్యక్షంగా వినడానికి అవకాశాలు ఎక్కువ. భారతదేశ పౌరులకి సమాన హక్కులు ఉండాలి. ఈ లా స్కూల్స్ కు ప్రభుత్వ పోషణ ఎందుకు? మిగతా యూనివర్సిటీలలో ఉన్న ‘లా’ యూనివర్సిటీల పట్ల వివక్ష ఎందుకు?
నల్సార్ యూనివర్సిటీ
ఈ ‘లా’ యూనివర్సిటీ నుంచి చదువుకున్న విద్యార్థులు న్యాయవాదులుగా వచ్చింది తక్కువ. న్యాయమూర్తులుగా మారినవాళ్లు మరీ తక్కువ. కార్పొరేట్ రంగం కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న సొమ్ము ఎక్కువ. ఇచ్చిన స్థలాలు కూడా ఎక్కువే. నల్సార్ యూనివర్సిటీని 55 ఎకరాల స్థలంలో నగర శివారులోని షామీర్‌పేటలో ఏర్పాటు చేశారు. నిజానికి అది ఓ కాలేజీ లాంటిది. ప్రిన్సిపాల్ లాంటి వ్యక్తి సరిపోతారు. కానీ, దానికి ఓ వైస్ చాన్సలర్, మిగతా యూనివర్సిటీలకు లేనటువంటి ఆర్భాటాలూ. ఈ స్థలాన్నే సక్రమంగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఆ వర్సిటీ ఉంది. యూనివర్సిటీ నిర్వహణకి (కాలేజీ నా దృష్టిలో) ఈ స్థలమే ఎక్కువ. నల్సార్‌కి ఎదురుగా జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు కోసం 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఓ పాతిక సంవత్సరాల క్రితం అలాట్ చేసింది. పలు కారణాల వల్ల అక్కడ అకాడమీని రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేసే హైకోర్టు ప్రాంగణంలోనే జ్యుడీషియల్ అకాడమీని ఏర్పాటు చేస్తారని ఓ వార్త. అది గమనించి నల్సార్ యూనివర్సిటీ అధికారులు ఈ స్థలాన్ని తమ యూనివర్సిటీ కోసం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వింటున్నాం.
నేను జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన వస్తే నేను నా అభ్యంతరాలను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకునివచ్చాను. అది అలా ఉండిపోయింది. ఈ స్థలాన్ని కోర్టుల సముదాయాల నిర్మాణాల కోసంకాని, జ్యుడీషియల్ అకాడమీ కోసం కాని ఉపయోగించాలి. కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే ‘నల్సార్’కి ఇస్తే అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈ ప్రయత్నాలను పేదలు,, అందరికీ న్యాయం అందాలని అనుకునే సామాజిక కార్యకర్తలు వ్యతిరేకించాలి.
ప్రభుత్వం ప్రజల పక్షమా? కార్పొరేట్ వైపా వేచి చూడాలి. ప్రభుత్వమే కాదు హైకోర్టు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా న్యాయమూర్తులు ఆలోచించాలి.
- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)