ఇరిగేషన్ ​నుంచి మురళీధర్​ ఔట్

ఇరిగేషన్ ​నుంచి మురళీధర్​ ఔట్
  • ఇరిగేషన్ ​నుంచి మురళీధర్​ ఔట్
  • రాజీనామా చేయాలని ఈఎన్సీకి మంత్రి ఉత్తమ్ ఆదేశం 
  • రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు టర్మినేషన్
  • విజిలెన్స్ ​నివేదిక ఆధారంగా చర్యలు
  • అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇరిగేషన్ శాఖ​ ప్రక్షాళన

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​నుంచి ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ను ప్రభుత్వం తప్పించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆయనను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు బాధ్యుడిగా గుర్తించి ఆయనపై చర్యలు చేపట్టారు. రామగుండం ఈఎన్సీగా కొనసాగుతున్న నల్ల వెంకటేశ్వర్లును ఉద్యోగం నుంచి టర్మినేట్​చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం విజిలెన్స్​ అండ్​ ఎన్ ఫోర్స్​మెంట్​ అధికారులతో విచారణ జరిపించింది. ఆ నివేదిక ఆధారంగానే పదేండ్లకు పైగా ఎక్స్​టెన్షన్​పై కొనసాగుతున్న మురళీధర్​పై ప్రభుత్వం వేటు వేసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే బుధవారం రాత్రి ఈఎన్సీ (జనరల్)తో పాటు మరో ఈఎన్సీపై చర్యలు తీసుకుంది. గత బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.95 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్ ​మాస్టర్​ మైండ్​గా వ్యహరించారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయితే, విజిలెన్స్​ నివేదిక కోసం ఎదురు చూసిన ప్రభుత్వం, ఆ నివేదిక అందడంతో తాజాగా చర్యలు తీసుకుంది.

వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన మేడిగడ్డ బ్యారేజీ మూడేండ్లకే కుంగిపోవడాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మేడిగడ్డను సందర్శించి డ్యామేజీలను పరిశీలించారు. విజిలెన్స్​నివేదికలో ఇంజనీర్లు ముఖ్యంగా మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు పాత్ర, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొనడంతో చర్యలు చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్​సమావేశాల్లో ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.  వీరిద్దరితో పాటు మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన ఇతర అధికారులు, ఇంజనీర్లపైనా త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించాయి. 

రిటైర్ అయినా.. పదేండ్లు పొడిగింపు 

ఉమ్మడి ఏపీలోనే 2013, జూన్​ 30న ఇరిగేషన్​ ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ ​అయ్యారు. అప్పటి కిరణ్​కుమార్​రెడ్డి ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. 2014, జూన్​2న తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ​సీఎం అయ్యారు. ఆ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఆయన పదవీకాలాన్ని 2019 వరకు ఏటా పొడి గిస్తూ వచ్చారు. 2019, జూన్​29న తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనే ఈఎన్సీగా కొనసాగుతారని జీవో నం.257 జారీ చేశారు. రిటైర్​ అయిన తర్వాత కూడా పదేండ్ల ఏడు నెలల పాటు ఆయన ఇరిగేషన్​కు సుప్రీంగా కొనసాగారు.

కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్​ స్కీం రీడిజైన్​లతో పాటు అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్​లు, ఇతర విషయాల్లో కీలకంగా పని చేశారు. నల్ల వెంకటేశ్వర్లు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్​ ఇంజనీర్ (సీఈ)​గా 2019 మార్చి 31న రిటైర్ అయ్యారు. ఆ​తర్వాత ఆయనను ఈఎన్సీగా ప్రమోట్​ చేసి ఎక్స్​టెన్షన్​ ఇచ్చారు. గతేడాది ఇచ్చిన ఎక్స్​టెన్షన్​ ఉత్తర్వులు ఈ ఏడాది మార్చి నెలాఖరు వర కు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లును టర్మినేట్ ​చేస్తూ బుధవారం రాత్రి ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక ఆధారంగానే ఆయనను టర్మినేట్ ​చేస్తున్నామని, ఆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ స్థానంలో మరొకరిని నియమించడానికి ఈఎన్సీ (అడ్మిన్) ప్రతిపాదనలు పంపాలని సూచించారు.