
పెషావర్: పాకిస్తాన్‌లోని ఒరక్జాయ్ జిల్లాలో నిర్వహించిన రివేంజ్ ఆపరేషన్‌లో 30 మంది తెహ్రీక్- ఇ- తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) టెర్రరిస్టులను హతమార్చినట్టు పాకిస్తాన్ఆర్మీ శుక్రవారం తెలిపింది. ఈ నెల 7న ఖైబర్ పఖ్తుంఖ్వా ఒరక్జాయ్ జిల్లాలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో టీటీపీ టెర్రరిస్టులతో జరిగిన ఘర్షణలో 11 మంది పాక్ సైనికులు మరణించారు.
వారిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పాకిస్తాన్ఆర్మీ భద్రతా దళాలు ప్రతీకార ఆపరేషన్‌లను కొనసాగిస్తున్నాయి.
ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 10) ఒరక్జాయ్‌లోని జమాల్ మాయా ప్రాంతంలో పక్కా సమాచారంతో నిర్వహించిన రివేంజ్ఆపరేషన్లో 30 మంది తెహ్రీక్- ఇ- తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులను తుదముట్టించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌తో 11 మంది పాక్ సైనికుల హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని పేర్కొంది.