
- ఈ ఏడాది 412 మంది మావోయిస్టుల సరెండర్
- లొంగిపోయినవారిలో ఇద్దరు కేంద్ర కమిటీ, ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు
- తాజాగా 60 మందితో లొంగిపోయిన మల్లోజుల
- పోలీసు వ్యూహాలు, నేతల మధ్య విభేదాలతో క్యాడర్ ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులపై పోలీసుల ద్విముఖ వ్యూహం ఫలిస్తోంది. ఓ వైపు ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్ కౌంటర్లు.. మరో వైపు లొంగుబాట్లను ప్రోత్సహిస్తుండంతో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతోంది. గతేడాది పోలీస్ ఎన్కౌంటర్లలో 357 మంది చనిపోగా.. ఈ ఏడాది ఇప్పటికే 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సైతం ఉన్నారు. మరో 412 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ, ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులున్నారు. తాజాగా 40 ఏండ్లు మావోయిస్టు పోరాటంలో ఆరితేరిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
క్యాడర్కకావికలం!
వరుస ఎన్కౌంటర్లు.. మరో వైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ క్యాడర్కకావికలమవుతోంది. దేశంలో 2026 మార్చి కల్లా మావోయిస్టులను తుదముట్టించాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో తాజాగా 2024 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ మొదలుపెట్టింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్డీ, సీ-60, ఎస్‌వోజీ బలగాలతో 20 వేల మంది పోలీసులు, జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, భారీ వెహికల్స్ సహాయంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో 2014 లో 126 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు విస్తరించి ఉండగా.. 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. అదికాస్తా ఈ ఏడాదిన్నర వ్యవధిలో చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్‌లోని వెస్ట్‌సింగ్‌భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు పరిమితమైంది.
ఈ క్రమంలో చేపట్టిన పోలీస్ ఆపరేషన్లతో గత ఏడాది 357 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 136 మంది మహిళలున్నట్టు ఈ ఏడాది జూన్ 23న మావోయిస్టు పార్టీ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది మేలో నారాయణపూర్,- బీజాపూర్, -దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్ కౌంటర్లో మరణించడం 30 ఏండ్లలో ఇదే తొలిసారని హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. దీనికంటే ముందు కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకేసారి 31 మంది మావోయిస్టులు చనిపోయారు.
నేతల మధ్య విభేదాలతో పెరుగుతున్న లొంగుబాట్లు..
మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్దాంతిక విభేదాలతో మావోయిస్టు పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. ఆయుధాలు వీడి జనంతో కలిసి పోరుబాట పట్టాలని కొందరు.. ఆయుధాలు వీడేది లేదు.. సాయుధ పోరాటమే తమ ఊపిరి అని మరికొందరు మావోయిస్టులు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ పరిస్థితులను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై అణచివేతను తీవ్రతరం చేయడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా దండకారణ్యానికి మకాం మార్చారు.
ఇక్కడ నార్త్ బస్తర్, మాడ్, గడ్జిరౌలి, సౌత్ బస్తర్, పీఎల్జీఏకమిటీలదే కీలకపాత్ర. ఇటీవల కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చిన ‘ఆయుధాలు వీడుదాం..’ అనే పిలుపుకు మూడు కమిటీలు ఆమోదం తెలపగా.. హిడ్మా, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ నేతృత్వం వహించే కమిటీలు వ్యతిరేకించాయి. అర్బన్ నక్సల్స్‌గా ముద్రపడిన సింగరేణి కార్మిక సంఘం(సికాస) కూడా మల్లోజుల వాదనకే జై కొట్టింది.
మావోయిస్టుల లొంగుబాట్లకు పోలీసుల వ్యూహాలు
ప్రస్తుతం సెంట్రల్, స్టేట్, జిల్లా, జోనల్, డివిజన్ కమిటీలతో పాటు జనతన్ సర్కార్‌లో సుమారు 5 వేల నుంచి 6 వేల మంది వరకు మావోయిస్టులు పనిచేస్తున్నట్టు పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మావోయిస్టు నేతల మధ్య ఏర్పడిన విభేదాలను చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు పసిగట్టి మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోయేలా వ్యూహం పన్నుతున్నారు. ఇందుకు మాజీ మావోయిస్టులు, కొంతమంది రాజకీయ నేతలు, ఇతరుల సాయం తీసుకొని మావోయిస్టు నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం కోసం భారీ మొత్తంలో నగదు, చెక్కులను వెంటవెంటనే అందిస్తున్నారు. దీంతో ఈ ఏడాది లొంగుబాట్లు పెరిగాయి. గడిచిన పదేండ్లలో 8 వేల మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టారని.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం 18 వేల చ.కి.మీ. నుంచి 4,200 చ.కి.మీ. కు తగ్గిందని, 2010–-24 మధ్య నక్సల్స్ హింస 81 శాతం, మరణాలు 85 శాతం తగ్గినట్టు కేంద్రం విడుదల చేసిన ‘బ్రేకింగ్ రెడ్ గ్రిప్’ నివేదిక తెలియజేస్తున్నది.